కోవిడ్‌ వైద్యంపై నిపుణుల బృందం..రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ఆస్పత్రుల్లో కోవిడ్‌ రోగులకు అందిస్తున్న చికిత్సను
పర్యవేక్షించడానికి నిపుణుల బృందాన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని
సుప్రీంకోర్టు ఆదేశించింది. రోగులకు అందిస్తున్న చికిత్సను అధికారులు
పర్యవేక్షిస్తూ ఉండేందుకు వీలుగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటుచేయాలని జస్టిస్‌
అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం సూచించింది.
వివిధ రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ధరల విషయంలో
వ్యత్యాసాలపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
కరోనా నిర్ధారణ పరీక్ష రుసుము కొన్ని రాష్ట్రాల్లో రూ.2,200 కాగా, మరికొన్ని
రాష్ట్రాల్లో రూ.4,500 ఉందంటూ కోర్టు.. ధరల నిర్ణయ విషయాన్ని కేంద్రానికే
వదిలేస్తున్నామని తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షల ధరలు అన్ని చోట్ల ఒకేలా
ఉండాలని సూచించింది. ఢిల్లీలోని ఎల్‌ ఎన్‌ జేపీ ఆస్పత్రిలో పరిస్థితులు దారుణంగా
ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సీసీటీవీల ప్రస్తావన
తీసుకొచ్చింది. కెమెరాలు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్క అంశమూ పర్యవేక్షించేందుకు
వీలుంటుందని తెలిపింది. ఆస్పత్రుల్లో కరోనా రోగులను సరైన చర్యలు తీసుకుంటూ
జాగ్రత్తగా చూసుకోవాలని ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్‌
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ఈ వ్యవహారంపై జూలైలో మరోసారి
విచారిస్తామని స్పష్టం చేసింది.
Flash...   Tooth Paste:రోజూ ఉదయాన్నే ఉపయోగించే టూత్‌పేస్ట్‌ గురించి ఈ విషయాలు తెలుసుకోండి.