వడ్డీ మీద వడ్డీ ఏమిటి.? EMI మారటోరియం నిబంధనలని సవరించాలి

లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారు, తమ ఈఎంఐలను ఆరు నెలల పాటు చెల్లించనవసరం లేకుండా ఆర్బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మారటోరియం సమయంలో చెల్లించాల్సిన ఈఎంఐలను కట్టకుంటే, దానిపై వడ్డీని వసూలు చేసుకోవచ్చన్న వెసులుబాటును బ్యాంకులకు కల్పించింది. మొత్తం ఆరు నెలల కాలం… అంటే ఆగస్టు వరకూ మారటోరియం అమలులో ఉండగా, వడ్డీపై వడ్డీని విధిస్తున్నారంటూ, ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, దీనిపై విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

తీసుకున్న రుణంపై నెలవారీ చెల్లింపులలోనే వడ్డీని కలుపుతారనీ, మళ్లీ వడ్డీపై కూడా వడ్డీని వేయడం ద్వారా, మారటోరియం ప్రయోజనం నెరవేరేట్లు కనిపించడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశాన్ని కేంద్రం పరిశీలించాలని సూచిస్తూ, మొత్తం వ్యవహారాన్ని బ్యాంకులకే వదిలేయవద్దని సూచించింది. దీనిని కేవలం కస్టమర్లు, బ్యాంకుల మధ్య ఉన్న వ్యవహారంగా చూడవద్దని పేర్కొంది.

ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు తొలి వారానికి వాయిదా వేసిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, మొత్తం విధానాన్ని మరోసారి సమీక్షించాలని ఆర్బీఐకి సూచించింది. మొత్తం వడ్డీని రద్దు చేయకపోయినా, వడ్డీ మీద వడ్డీనైనా తొలగించే విధంగా పరిశీలించాలని సూచించింది.
Flash...   Restrictions on Use of mobile phones in the classrooms