దగ్గు మందని చెప్పి కరోనా మాత్రలు తెచ్చారట! Baba Ramdev

Baba Ramdev: కరోనా ఆయుర్వేద ఔషధం కరోనిల్ కోసం పతంజలి సంస్థ దరఖాస్తు చేసుకున్న తీరు దేశవాసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఔషధానికి అనుమతి ఎలా ఇచ్చారనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
 
జ్వరం, దగ్గుకు మందు తీసుకొస్తున్నామని చెప్పి పతంజలి సంస్థ కరోనా మహమ్మారికి ఆయుర్వేద మందును విడుదల చేసిందట. యోగా గురువు సహ వ్యవస్థాపకులుగా ఉన్న పతంజలి సంస్థ మంగళవారం (జూన్ 23) విడుదల చేసిన ‘కరోనిల్’ మందు మాత్రలపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆదేశాల మేరకు ఈ ఔషధానికి ఎలా అనుమతి ఇచ్చారనే విషయంపై విచారణ ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం విచారణ ప్రారంభించింది.
పతంజలి సంస్థ కరోనిల్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో అసలు కరోనా వైరస్‌ పేరునే ప్రస్తావించలేదట. ఉత్తరాఖండ్ ప్రభుత్వం బుధవారం ఈ విషయాన్ని తెలిపింది. రోగ నిరోధకశక్తి పెంపొందించడానికి, దగ్గు, జ్వరం నియంత్రణకు ఆయుర్వేద మందు తీసుకొస్తున్నట్లు పతంజలి సంస్థ దరఖాస్తులో పేర్కొందని వెల్లడించింది. దీనిపై పతంజలి సంస్థను వివరణ కోరతామని తెలిపింది.
ముందుగా చెప్పాలి! 

పతంజలి సంస్థ కరోనాకు మందును తీసుకొస్తే సంతోషకరమైన విషయమేనని.. అయితే, ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని ఆయుష్ మంత్రి శ్రీపాద నాయక్ బుధవారం వ్యాఖ్యానించారు. ‘బాబా రామ్‌దేవ్ కొత్త ఔషధం రూపొందించారని తెలిసింది. అయితే.. వాళ్లు ఎలాంటి పరిశోధన చేసినా, ముందుగా ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.
పతంజలి సంస్థకు నోటీసులు జారీ చేస్తాం.. కొవిడ్‌-19 కిట్‌కు ఎలా అనుమతి లభించిందో విచారణ జరుపుతాం’ అని లైసెన్స్‌ అధికారి పేర్కొన్నారు. మరోవైపు.. ఈ వివాదంపై పతంజలి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య బాలకృష్ణ స్పందించారు. తాము ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నియమ, నిబంధనలను 100 శాతం పాటించామని ఆయన సమర్థించుకోవడం గమనార్హం.
కరోనిల్‌, స్వసరి పేరుతో పతంజలి ఆయుర్వేద సంస్థ మంగళవారం రెండు రకాల ఔషధాలు ఉన్న కిట్‌ను ఆవిష్కరించింది. ఈ మాత్రలతో కేవలం 7 రోజుల్లోనే కరోనా పూర్తిగా నయమవుతుందని బాబా రామ్‌దేవ్‌ చెప్పారు. కరోనాకు ఆయుర్వేద మందు తీసుకొచ్చినట్టు పతంజలి సంస్థ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ట్విస్ట్ ఇచ్చింది. కరోనిల్‌, స్వసరి ఔషధాన్ని శాస్త్రీయంగా పరిశీలించి ఆమోదించేంత వరకు ఎలాంటి ప్రచారం చేయవద్దని పతంజలి సంస్థను ఆదేశించింది.
Flash...   టిక్‌టాక్ సహా చైనీస్ యాప్స్‌ని తొలగించాలని గూగుల్ యాప్, ఆప్ స్టోర్‌ను ప్రభుత్వం ఆదేశించిందా?