EPF ఖాతాదారులకు కేంద్రం మరో షాక్, వడ్డీ రేటుకు కోత?

ఇటీవల చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు భారీగా తగ్గుతున్న సంగతి
తెలిసిందే. దీంతో ఈపీఎఫ్ఓ కూడా తమ ఖాతాదారులకు ఇచ్చే వడ్డీని తగ్గించాలన్న
ఆలోచనలో ఉందట. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.65శాతం నుంచి
8.5శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వడ్డీ
కూడా చెల్లించే అవకాశాలు లేవట. అందుకే వడ్డీ రేటుని మరింత తగ్గించాలని ఈపీఎఫ్ఓ
భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.
వడ్డీ రేటు 8.5 కాదు 8.1శాతమే:

ప్రస్తుతం ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది. దాన్ని 8.1 శాతానికి కుదించొచ్చని
ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే దాదాపు 6 కోట్ల మంది ఈపీఎఫ్‌
చందాదారులపై ప్రభావం పడుతుంది. గత ఆర్థిక సంవత్సరానికి వడ్డీని 8.5 శాతంగా
నిర్ధరిస్తూ మార్చి మొదటివారంలో ప్రకటన వెలువడింది. అయితే ఆర్థిక మంత్రిత్వశాఖ
ఇంకా దీనికి ఆమోద ముద్ర వేయలేదు. అక్కడ ఆమోదం లభించాకే కేంద్ర కార్మిక శాఖ
నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. 

 ఈపీఎఫ్ చందాదారులపై ప్రభావం:

కాగా, ‘‘8.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా ఈపీఎఫ్‌వోకు డబ్బు పంపిణీ చేయడం చాలా కష్టం.
నగదు ప్రవాహం బాగా తగ్గిపోవడమే ఇందుకు కారణం’’ అని సంబంధిత వర్గాల నుంచి వార్తలు
వచ్చాయి. దీంతో మరోసారి వడ్డీ రేటుకు కోత విధిస్తారని తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ
ఉన్నతాధికారులు త్వరలో ఆర్థిక శాఖతో పాటు ఇన్వెస్ట్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అండ్
ఆడిట్ కమిటీని కలిసి పీఎఫ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముందే నిర్ణయించిన వడ్డీ చెల్లించాలా లేదా తగ్గించాలా అన్న
నిర్ణయాన్ని ఈ సమావేశంలో తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఈపీఎఫ్‌ చందాలో
ఉద్యోగులు, యాజమాన్యాల వాటాను మూలవేతనంలో 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది.
ఇప్పుడు వడ్డీ రేటు కోతకు కూడా సిద్ధమవుతోంది. దీంతో ఈపీఎఫ్ చందాదారులు
ఉసూరుమంటున్నారు.

 36లక్షల క్లెయిమ్స్, రూ.11వేల 540 కోట్లు:

ఏప్రిల్, మే నెల్లలో 36లక్షల మంది పీఎఫ్ క్లెయిమ్ చేసుకున్నారని, రూ.11వేల 540
కోట్లు సెటిల్ చేశామని పీఎఫ్ వర్గాలు తెలిపాయి. ఇందులో 15 లక్షల క్లెయిమ్స్
కొవిడ్ అడ్వాన్స్ కింద వచ్చినవే అని చెప్పారు. వారికి రూ.4వేల 580 కోట్లు సెటిల్
చేశారు. కరోనా సంక్షోభ సమయంలో పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు కేంద్రం అవకాశం
కల్పించిన సంగతి తెలిసిందే.

Flash...   TELUGU TEST: మీ తెలుగు భాష మీద పట్టు ఒక్క నిమిషంలో ఇలా చెక్ చేసుకోండి