Hetero Drugs: Injection for Covid – కోవిఫర్

ఓవైపు కరోనా మహమ్మారి శరవేగంతో వ్యాపిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ ఇప్పట్లో
వచ్చేది కష్టమేనని తెలుస్తోంది. దాంతో చికిత్సలో ఉపయోగించే సమర్థవంతమైన ఔషధాల
తయారీపై దృష్టి పెట్టాలని అనేక ఫార్మా రంగ సంస్థలు భావిస్తున్నాయి. ఇప్పటికే
గ్లెన్ మార్క్ ఫార్మా సంస్థ ఫాబిఫ్లూ పేరుతో ఫావిపిరావిర్ టాబ్లెట్లను
మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గ్లెన్ మార్క్ కు అనుమతులు
మంజూరు చేసింది. ఇప్పుడు, కరోనా చికిత్సలో ఓ ఇంజెక్షన్ కూడా సమర్థవంతంగా
పనిచేస్తుందని గుర్తించిన భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆమేరకు అనుమతులు
ఇచ్చింది.
ఆ మందు పేరు రెమ్ డెసివిర్. కోవిఫర్ పేరుతో మార్కెట్లోకి రానున్న ఈ ఔషధాన్ని
హైదరాబాద్ కు చెందిన హెటెరో ఫార్మా సంస్థ తయారుచేస్తోంది. మరో ఫార్మా సంస్థ
సిప్లా కూడా ఈ ఔషధానికి అనుమతులు దక్కించుకుంది. కోవిఫర్ తయారీకి, మార్కెటింగ్ కు
డీజీసీఐ సిప్లా, హెటెరో సంస్థలకు క్లియరెన్స్ ఇచ్చింది.
కాగా, హెటెరో సంస్థ ఇప్పటికే లక్ష డోసులు సిద్ధం చేసింది. ఇంజెక్షన్ రూపంలో ఉన్న
ఈ యాంటీ వైరల్ డ్రగ్ నేటి నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. 100 ఎంఎల్
పరిమాణంలో ఉన్న ఒక్కో ఇంజెక్షన్ ధర రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఉంటుందని
భావిస్తున్నారు. హెటెరో వర్గాలు దీనిపై మాట్లాడుతూ, కరోనా లక్షణాలన్నింటిపైనా
కోవిఫర్ సమర్థవంతంగా, సమగ్రంగా పనిచేస్తుందని తెలిపాయి. కరోనా చికిత్సలో
తొలిరోజున ఒక 200 ఎంజీ డోసు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని, ఆపై ఐదు రోజుల పాటు
100 ఎంజీ డోసు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించాయి.
వాస్తవానికి రెమ్ డెసివిర్ ఔషధం తాలూకు పేటెంట్ హక్కులు అమెరికాకు చెందిన గిలీడ్
సైన్సెస్ ఫార్మా సంస్థ వద్ద ఉన్నాయి. ఈ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న సిప్లా,
హెటెరో సంస్థలు భారత్ లో కోవిఫర్ పేరుతో ఇంజెక్షన్లు మార్కెట్లోకి
తీసుకువస్తున్నాయి.
హెటెరో గ్రూప్ చైర్మన్ డాక్టర్ బి.పార్థసారథి రెడ్డి దీనిపై స్పందిస్తూ…
క్లినికల్ ట్రయల్స్ లో కోవిఫర్ సానుకూల ఫలితాలు ఇచ్చిందని, తమకు అన్ని అనుమతులు
వచ్చిన నేపథ్యంలో ఇప్పటినుంచే భారత్ లోని కరోనా రోగులందరికీ అందుబాటులోకి ఈ
ఔషధాన్ని తీసుకువస్తామని తెలిపారు.
Flash...   రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిఎంత ఉందొ ఇలా తెలుసుకోవచ్చు !