ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా:

 ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో సోకే అవకాశముందని ఇటీవలి ఓ అధ్యయనం తెలిపింది. ఈ మేరకు బ్రిటన్‌లోని ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌’కు చెందిన నిపుణుల బృందం తమ పరిశోధనా ఫలితాలను వెల్లడి చేసింది. వివిధ ప్రభుత్వాలు, సంస్థలు అధికారికంగా వెల్లడించిన కొవిడ్‌-19 ప్రమాద కారకాలను, అంటువ్యాధులకు సంబంధించిన విస్తారమైన గణాంకాలను, సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని విశ్లేషించిన అనంతరం తాము ఈ నిర్ణయానికి వచ్చినట్టు నిపుణులు తెలిపారు. వీరి అధ్యయనం ప్రకారం…

ప్రపంచ జనాభాలో 20 శాతం కంటే ఎక్కువ మంది.. అంటే ఐదింట ఒకరు ఏదో ఒక ఆరోగ్య సమస్యను కలిగిఉన్నారు. వీరికి కరోనా ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో తెలుస్తోంది.
ఇక కొవిడ్‌ ముప్పును పెంచే రుగ్మతల్లో టైప్‌-2 మధుమేహం, గుండె సమస్యలు ముఖ్యమైనవని వారు వెల్లడించారు. ఇవే కాకుండా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఈ జాబితాలో ఉన్నాయని తెలిపారు.

యువ జనాభా అధికంగా ఉన్న ఆఫ్రికా వంటి ప్రదేశాల్లో కొవిడ్‌ విరుచుకుపడే ప్రమాదం తక్కువ.
సరాసరి వయస్సు అధికంగా ఉండి, సుమారు మూడోవంతు జనాభా ఏదో ఒక ఆరోగ్య సమస్యను కలిగిఉన్న యూరోపియన్‌ దేశాలకు కరోనా నిరోధకత స్వల్పంగా ఉంటుంది.

భారత్‌లో గడచిన 24 గంటల్లో 10,667 కొత్త కొవిడ్‌ కేసులు నమోదు కాగా, 380 మరణాలు చోటుచేసుకున్నాయి. దీనితో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,091 అని, మృతులు 9900 అని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో యాక్టివ్‌ కేసులు 1,53,178గా ఉంది. ఇక ప్రపంచ వ్యాప్త కొవిడ్‌ గణాంకాలు సుమారు 80 లక్షలకు చేరుకున్నాయి. కరోనా కేసులు, మరణాలు ఆందోళనకరంగా పెరుగుతున్న ఈ నేపథ్యంలో… కొవిడ్‌కు వ్యాక్సిన్‌ కనుగొన్నపుడు దానిని ముఖ్యంగా ఎవరికి అందించాలనే ప్రాధాన్యాలను ప్రభుత్వాలు నిర్ణయించేందుకు తమ అధ్యయనం ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Flash...   పెరుగు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందా..టాప్ 7 జింక్ రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.