కరోనా వ్యాక్సిన్ సిద్ధం.. రష్యా కీలక ప్రకటన

Russia: కరోనా మహమ్మారికి టీకా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ రష్యా కీలక
ప్రకటన చేసింది. తమ దేశంలో ఉత్పత్రి చేస్తున్న టీకా క్లినికల్ ట్రయల్స్
పూర్తైనట్లు తెలిపింది. ఆగస్టులో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు
రష్యా ప్రకటించింది.

కరోనా వ్యాక్సిన్ గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రపంచానికి రష్యా శుభవార్త
అందించింది. మహమ్మారికి చెక్‌ పెట్టడానికి రూపొందించిన టీకా సిద్ధమైనట్లు
ప్రకటించింది. క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయని.. వచ్చే నెలలో వ్యాక్సిన్ ప్రజలకు
అందుబాటులోకి వస్తుందని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి సోమవారం (జులై 20) ప్రకటించారు.
వ్యాక్సిన్‌పై ప్రయోగాలు విజయవంతం కావడంతో ఉత్పత్తికి సంబంధించిన చర్యలు వేగవంతం
చేసినట్లు వివరించారు.
ఆగస్టు 3వ తేది నుంచి రష్యా, సౌదీ ఆరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఈ
వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇందు కోసం ఇప్పటికే
వేలాది మందిని ఎంపిక చేశారు. దీనికి సమాంతరంగా ఈ టీకాను ప్రజలకు కూడా
అందుబాటులోకి తీసుకురానున్నట్లు రష్యా ఆరోగ్య మంత్రి వెల్లడించారు.
రష్యాలో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి అనేక ప్రయోగాలు జరుగుతున్నా.. సెచినోవ్‌
యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ మెరుగైన ఫలితాలు ఇస్తుందని రష్యా
అధ్యక్షుడు పుతిన్‌ భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధి
కోసం రష్యన్‌ శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇప్పటికే రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ
వ్యాక్సిన్.. ప్రపంచంలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న తొలి కరోనా
వ్యాక్సిన్‌గా గుర్తింపు పొందింది. ఇదే క్రమంలో ప్రపంచంలో ప్రజలకు అందుబాటులోకి
వచ్చే తొలి కరోనా టీకాగా నిలువనుంది.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా మూడు కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయనున్నట్టు రష్యా
ప్రకటించింది. మరో 17 కోట్ల డోస్‌లు విదేశాల్లో తయారవుతాయని తెలిపింది.
వ్యాక్సిన్‌ తయారీకి 5 దేశాలు అంగీకారం తెలిపినట్టు ఆ దేశం పేర్కొంది.
మరోవైపు.. రష్యాలో కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలోని 85
ప్రాంతాల్లో 5,940 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రష్యాలో కరోనా కేసుల సంఖ్య
7,77,486కు చేరింది. రష్యాలో కొవిడ్ బారినపడి ఇప్పటివరకు 12,427 మందికి పైగా మృతి
చెందారు. రష్యాలో కరోనా వైరస్ సంక్రమణ రోజూ 0.8 శాతం పెరుగుతున్నట్లు అధికారిక
గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Flash...   15 నుంచి మళ్లీ పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అంటూ వస్తున్న పుకార్లు ... క్లారిటీ ఇచ్చిన కేంద్రం