నూతన విద్యావిధానం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం

దేశానికో మంచి విద్యా విధానం ఇస్తామన్న బిజెపి 2014 ఎన్నికల హామీ ఆరేళ్ళ
తరువాత కార్యరూపం తీసుకున్నది. అత్యధికులు భావిస్తున్నట్లు ‘జాతీయ విద్యా
విధానం-2019’ (ఎన్‌ఇపి) మన దేశ విద్యా రంగంలో భారీ మార్పులను తీసుకు
వస్తుందన్నది వాస్తవమే. అయితే ఈ మార్పులు ప్రస్తుత విద్యా వ్యవస్థను ఎటు
తీసుకు వెళ్తాయి అన్నదే కీలకం. కేంద్రం ప్రతిపాదిత ఈ మార్పులన్నీ రాజ్యాంగ
విరుద్ధమైనవి. స్వాతంత్య్రానంతరం నిర్దేశించుకున్న విద్యా లక్ష్యాలకు
భిన్నమైనవి.


పాఠశాల విద్యలో కొఠారీ ప్రతిపాదిత 10+2+3 విధానాన్ని 5+3+3+4గా మార్చారు.
లెర్నింగ్‌ క్రైసిస్‌ (తరగతికి తగ్గ స్థాయి లేకపోవడం) అధిగమించడానికి,
డ్రాపౌట్‌ రేటు తగ్గించడానికి పూర్వ ప్రాథమిక విద్య అవసరమని ఈ మార్పు చేశారు.
నిజానికి ఈ రెండు సమస్యలకు అనేక పరిష్కార మార్గాలు ఉన్నాయి. దీనికోసం
కరిక్యులమ్‌ను మార్చనక్కరలేదు. ప్రైవేట్‌ రంగం లోకి విద్యను తెచ్చి 10+2+3
విధానాన్ని ప్రభుత్వం విఫలం చేసిందే తప్ప విధానంగా అది విఫలం చెందినట్లు ఏ
అధ్యయనం తేల్చలేదు.
ఫౌండేషన్‌ కోర్సును 5 సంవత్సరాలకు పెంచి ప్రాథమిక విద్యను 3 సంవత్సరాలకు
కుదింపు అనేది విద్యార్థులు భాషలలో పరిజ్ఞానం పెంచుకోవడానికి దోహదపడుతుందే
కాని, పరిసరాల విజ్ఞానం పెంచడానికి ఉపయోగపడదు. పూర్వ శిశు సంరక్షణ మరియు
విద్య యొక్క ప్రాధాన్యత గూర్చి గట్టిగా చెప్పినా దానిని ఎలా ఎవరు
నిర్వహించాలన్న దానిలో స్పష్టతను ఇవ్వలేదు. అంగన్‌వాడీ కేంద్రాలలో ఇంతవరకు
ఉన్న 3 నుంచి 6 సంవత్సరాల బాలలను, స్కూల్‌కు పంపిస్తే అక్కడ విద్య వస్తుంది
కానీ ఆరోగ్య సంరక్షణ ఎలా? పాఠశాల విద్యలో వీరు భాగమైనప్పటికీ వీరికి విద్య
కూడా రెగ్యులర్‌ టీచర్లు చెప్పరు. అంగన్‌వాడీ/వాలంటీర్లతో చెప్పించడం వలన
పిల్లలు ప్రైవేట్‌ కాన్వెంట్‌లకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
జాతీయ విద్యావిధానం విద్యార్థుల ప్రమాణాల పెంపు, డ్రాపౌట్‌ సమస్యను
అధిగమించేందుకు పాఠశాల విద్యా వ్యవస్థలో శాశ్వతమైన వ్యవస్థలను కాక,
వాలంటీరిజమ్‌ను ప్రతిపాదించింది. ఎడ్యుకేటర్లు, వాలంటీర్లు, కో-ఆర్డినేటర్లు,
సోషల్‌ వర్కర్లు, రిటైర్డ్‌ ఉద్యోగులు, మాజీ సైనికులను నియమించుకొని వారి
సేవలను వినియోగించుకోవాలని, ఎక్స్‌లెంట్‌ స్టూడెంట్లను గుర్తించి వారితో
వెనుకబడిన విద్యార్థులకు బోధన చేయాలని చెప్పింది. ఈ చర్య ఆచరణలో పాఠశాలలను,
ఉపాధ్యాయ వృత్తిని డీ-ఫార్ములేటింగ్‌ చేస్తుంది.
స్కూల్‌ కాంప్లెక్స్‌ల ఏర్పాటుపై ప్రతిపాదనలు చూస్తే కొద్దిపాటి బలమైన
పాఠశాలలు మిగిలి లక్షలాది చిన్న పాఠశాలలు మూతపడే ప్రమాదముంది. స్కూల్‌
కాంప్లెక్స్‌లో సెకండరీ పాఠశాలలకే నిధులు, మౌళిక వసతులు కేంద్రీకృతమయి
మిగిలిన పాఠశాలలు క్రమంగా బలహీన పడతాయి. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి
పాఠశాలకు కాక స్కూల్‌ కాంప్లెక్స్‌కు లెక్కిస్తారు. దీనివలన చిన్న పాఠశాలలు
నష్టపోతాయి. స్కూల్‌ కాంప్లెక్స్‌లలో వివిధ పేర్లతో ఉపాధ్యాయేతరులను
నియమించడం కూడా పాఠశాలలు బలహీనపడడానికి దారితీస్తుంది. ఇది వెనుకబడిన తరగతుల,
ప్రాంతాల విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది.
ప్రైవేట్‌ పాఠశాలలకు ఫీజులు నిర్ణయించుకొనే స్వేచ్ఛ ఇవ్వాలనడం, ఫీజులపై
ప్రభుత్వ నియంత్రణ ఉండరాదనడం, ప్రైవేట్‌ పాఠశాలల నెలకొల్పడాని
ప్రోత్సహించాలనడం, ప్రైవేట్‌ పాఠశాలల మీద ప్రభుత్వ అధిక నియంత్రణకు స్వస్థి
పలకాలనడం అత్యంత ప్రమాదకరమైన మార్పులు. క్రమేణా విద్యా వ్యాపారం పెరిగి
ప్రభుత్వం బాధ్యత నుండి తప్పుకోవడానికి దారితీస్తాయి. ధార్మిక, దాతృత్వ, మత
సంస్థలను పాఠశాలలు ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించాలనే ప్రతిపాదన, ఆయా
సంస్థలు, మతాల భావజాల ప్రభావం విద్యా వ్యవస్థపై వేయడానికి దారితీస్తుంది.
మైనారిటీ సంస్థలకిచ్చే రాయితీలు ఇతర సంస్థలకు ఇవ్వాలనే దానికి ఇది
ఉపయోగించుకుంటారు.
ఉపాధ్యాయ నియామకానికి 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బియిడి ఉండాలన్న ప్రతిపాదన
సరికాదు. ఇది రాష్ట్రాలు నిర్ణయించుకోవాలి. టీచర్ల నియామకంలో డెమో లేదా
ఇంటర్వ్యూలను ప్రతిపాదించింది. టీచర్ల జీతాలు, పదోన్నతులు సీనియారిటీని బట్టి
కాక మెరిట్‌ మరియు సాధించిన ఫలితాలను బట్టి ఇచ్చేవిధంగా రాష్ట్రాలు ప్రణాళిక
రూపొందించాలని చెప్పారు. ఇది అనుభవాన్ని ఉపేక్షించి, సామాజిక న్యాయాన్ని
దెబ్బతీయడమే. వాస్తవానికి ఉపాధ్యాయుల సర్వీసు అంశాలు రాష్ట్రాలకున్న
అధికారాలలో చొరబడడమే.
3,5,8 తరగతుల విద్యార్థులకు దేశవ్యాప్తంగా సెన్సస్‌ పరీక్షలు పెట్టడమంటే
పరీక్షా విధానాన్ని కూడా కేంద్రీకృతం చేసి రాష్ట్రాలకు చెందిన బోర్డు
పరీక్షలకు ప్రాధాన్యతను తగ్గిస్తున్నది. 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఉన్న
నిర్భంధ విద్యను 3-18 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఆర్భాటంగా చెప్పారు. 6-14
సంవత్సరాల నిర్భంధ విద్య అమలుకు విద్యాహక్కు చట్టం ఉంది. మరియు 3-18
సంవత్సరాల నిర్భంధ విద్యకు విద్యాహక్కు చట్టాన్ని 3-18 సంవత్సరాల వరకు
పెంచాలి కదా! మొదటి ముసాయిదా ఈ ప్రతిపాదన చేసింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన
కేబినెట్‌ సమావేశంలో రాష్ట్రాల విద్యామంత్రులు ఆర్‌టిఇ అమలు నిధులు గూర్చి
ప్రశ్నిస్తే తుది నివేదికలో ఆ ప్రతిపాదన తీసేసింది. అంటే నిధులు వెచ్చించి
బాధ్యత మోయడానికి కేంద్రం సిద్ధంగా లేదని, రాష్ట్రాలపై పెత్తనం చేయడానికి
ప్రయత్నిస్తున్నదని అర్థమవుతుంది.
ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉన్నత విద్యా సంస్థలన్నింటికీ ఒకే నియంత్రణ వ్యవస్థ
ఉండాలని, అక్రిడిటేషన్‌ థర్డ్‌ పార్టీకి అప్పజెప్పాలని చెప్పింది. ఇది
అభ్యంతరకరం. నియంత్రణ వ్యవస్థ ఇంతవరకు ఇన్‌పుట్లు ఆధారంగా నడిచింది. ఇపుడు
క్వాలిటీ ఆఫ్‌ అవుట్‌కమ్స్‌గా మార్చాలని చెప్పింది. అంటే ప్రభుత్వ బాధ్యత
తగ్గించి ఫలితాల కోసం ఇతరులపై ఆధారపడేటట్లు చేయడమే ఇది. ఇంతవరకు యుజిసి
పర్యవేక్షణలో నిధుల కేటాయింపు ఉండేది. దీనివల్ల విద్యావసరాల ఆధారిత నిధుల
కేటాయింపు ఉండేది. ఈ రెండింటిని విడదీసి నియంత్రణ ఎన్‌హెచ్‌ఆర్‌ఎ కు, నిధుల
కేటాయింపు హెచ్‌ఇజిసి కి అప్పగించింది. అంటే నిధుల కేటాయింపు ప్రభుత్వం
తన చేతుల్లో పెట్టుకుంది. విద్యను ఒక సరుకుగా ఆ రంగాన్ని ఒక పెద్ద
మార్కెట్‌గా భావించే డబ్ల్యుటిఒ లో సంతకం చేసిన మన దేశం అందుకు ఆటంకాలుగా
ఉన్న ప్రస్తుత విద్యా వ్యవస్థ నిర్మాణాన్ని, చట్టాలను, సంస్థల స్వభావాలను
పూర్తిగా మార్చేసే సిఫార్సులను ఎన్‌ఇపి చేసింది. విద్యను పెద్ద ఎగుమతి
సరుకుగా భావించే ఆస్ట్రేలియాతోనూ, బ్రిటన్‌ తోనూ కేంద్ర ప్రభుత్వం చేసుకున్న
ఒప్పందాలను, విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశాన్ని వేగవంతం చేయడానికి ఎన్‌ఇపి
ప్రతిపాదనలు దోహదపడతాయి.
జాతీయ విద్యావిధానం చెప్పిన 20 శాతం ఖర్చు ప్రభుత్వ విద్యపై చేయాలంటే
కేంద్రం, రాష్ట్రాలు రెండూ కేటాయింపులు పెంచాలి. కాని ప్రస్తుతం విద్యపై
జరుగుతున్న వ్యయం 10 శాతంలో రాష్ట్రాల వాటాయే సుమారు 75-80 శాతం వరకు
ఉంటుంది. ఇవి ఇంకా ఎక్కువ ఖర్చు చేయాలంటే మార్గం ఏంటో ఎన్‌ఇపి చెప్పలేదు.
విద్యా సెస్‌లు, సర్‌ఛార్జీలలో రాష్ట్రాలకు వాటా ఉండదు. కేంద్రం అదనంగా
నిధులు ఇవ్వకుంటే రాష్ట్రాలు ఎలా భరించగలవు. మోడీ ప్రభుత్వం 2014 నుండి
విద్యా బడ్జెట్‌ తగ్గిస్తూ వస్తున్నది. 2014-15లో 4.14 శాతం నుండి ప్రస్తుతం
2019-20లో 3.4 శాతానికి తగ్గిస్తుంది. విద్యా హక్కు చట్టం ద్వారా బాలలకు
కల్పించిన హక్కులను పథకాలుగా మార్చి సదరు చట్టాన్ని నిర్వీర్యం చేస్తుంది.
పరీక్షలు, సిలబస్‌, రాష్ట్రాల విద్యా పథకాలలో కేంద్రం యొక్క మితిమీరిన
జోక్యాన్ని జాతీయ విద్యా విధానం ప్రతిపాదించింది. ఇది సమాఖ్య విధానానికి
విరుద్ధం. విద్యాహక్కు చట్టం సార్వత్రిక విద్యా హక్కును అమలు చేయాలని
చెప్తుంటే…ఎన్‌ఇపి అలా కాకుండా గురుకులాలు, మదరసాలు, హోమ్‌ స్కూలింగ్‌
తదితరాలను ప్రత్యామ్నాయంగా చెప్పింది. ఇది సమానమైన అవకాశాలకు, సమానమైన
విద్యకు విరుద్ధం. సామాజిక న్యాయం గూర్చి ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు.
విద్యను ఒక పెద్ద మార్కెట్‌గా మార్చి… తన భావజాలాన్ని విద్యా వ్యవస్థలో
చొప్పించడానికి వీలుగా…విద్యా వ్యవస్థను కేంద్రీకరించే విధంగా జాతీయ విద్యా
విధానం ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రజాతంత్రవాదులు దీనిని తిప్పికొట్టాలి.
– కె. శేషగిరి
(వ్యాసకర్త యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, విజయనగరం)
Flash...   Daily Students and Teachers/staff attendance Called for