అన్‌లాక్‌ 3.0: సినిమా థియేటర్లకి అనుమతి..

కరోనా కట్టడి కోసం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన కేంద్ర
ప్రభుత్వం క్రమంగా ఆంక్షలు సడలిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో
ప్రస్తుతం అమలవుతున్న అన్‌లాక్‌ 2.0 జులై 31తో ముగియనుంది. దీంతో అన్‌లాక్‌ 3.0
మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగస్టు 1 నుంచి అమలవనున్న అన్‌లాక్‌
3.0లో మరిన్ని సడలింపులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి సినిమా హాళ్లకు అనుమతి
ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆగస్టు 1 నుంచి సినిమా హాళ్లతో పాటు జిమ్‌లకు అనుమతించే అవకాశం ఉందని పలువురు
అధికారులు భావిస్తున్నారు. అయితే.. కొవిడ్-19కు సంబంధించి కఠినమైన నిబంధనలు
విధించనున్నారు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం లాంటి కచ్చినమైన నిబంధనలతో కూడిన
నిర్ధిష్ట మార్గదర్శకాలతో సినిమా హాళ్లను తిరిగి తెరిచేందుకు వెసులుబాటు
కల్పిస్తారని తెలిసింది.
సినిమా థియేటర్లను తిరిగి తెరిపించే ప్రతిపాదనను సమాచార, ప్రసార శాఖ ఇప్పటికే హోం
మంత్రిత్వ శాఖ ముందుంచింది. ఈ ప్రతిపాదనకు ముందు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ
అధికారులతో కసరత్తు చేసింది. థియేటర్‌ యజమానులతో భేటీ అయింది. థియేటర్ యజమానులు
50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో అనుమతించాలని కోరారు. అయితే.. భౌతిక దూరం
నిబంధనల్లో భాగంగా తొలుత 25 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లను తెరవాలని
మంత్రిత్వ శాఖ వారికి సూచించింది.
థియేటర్లను తెరిపించే అంశంపై కేంద్రం మార్గదర్శకాలను మాత్రమే విడుదల చేయనుంది.
అంతిమ నిర్ణయం రాష్ట్రాలకే వదిలేయనుంది. ఆర్టీసీ బస్సులకు, షాపింగ్ మాల్స్‌కు
అనుమతి ఇచ్చే అంశంపై ఇలాంటి మార్గదర్శకాలనే విధించింది. కొవిడ్‌-19 కేసుల
తీవ్రతకు అనుగుణంగా రాష్ట్రాలు సొంతంగా మార్గదర్శకాలను జారీచేయవచ్చని కేంద్రం
తెలిపింది.
ఇక స్కూళ్లు, మెట్రో రైలు సర్వీసుల మూసివేత తదితర అంశాలపై అన్‌లాక్‌ 3.0లోనూ
ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. పాఠశాలలను తిరిగి తెరిపించే అంశంపై పాఠశాల విద్య
కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రాలతో మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డీ)
ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించింది. ఈ అంశంపై తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు
సేకరించామని పాఠశాలలను తెరవడంపై వారు సానుకూలంగా లేరని హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్‌
పోక్రియాల్‌ ఇప్పటికే తెలిపారు. అన్‌లాక్ 3.0కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం
ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు ప్రకటించే అవకాశం ఉంది.
Flash...   PAL lab relocation and shipping of equipment - Certain Instructions