కనీసం రెండు పొరలుండాలి
3 ఉంటే మరింత రక్షణ
ఇంట్లో తయారుచేసుకునే మాస్కుల సమర్థతను తేల్చిన తాజా అధ్యయనం
మెల్‌బోర్న్: కరోనా ముప్పు నేపథ్యంలో ప్రస్తుతం ప్రతిఒక్కరూ మాస్కు ధరించడం తప్పనిసరి అయింది! చాలామంది ఇళ్లలోనే వస్త్రంతో సొంతంగా మాస్కులను తయారుచేసుకుంటున్నారు. అయితే- ఇళ్లలో సిద్ధం చేసుకునే ఈ మాస్కులకు కనీసం రెండు పొరలు ఉండాల్సిందేనని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అప్పుడే అవి కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించగలవని నిర్ధారించింది. మాస్కుకు మూడు పొరలుంటే మరింత మంచిదని సూచించింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన బృందం తాజా అధ్యయనాన్ని నిర్వహించింది. సాధారణంగా వ్యక్తులు మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా తుంపర్లు వెలువడుతుంటాయి. కొవిడ్ బాధితుల నుంచి వచ్చే తుంపర్లలో వైరస్ ఉంటుంది. ఇళ్లలో తయారుచేసుకునే మాస్కులు ఈ తుంపర్లను ఎంతమేరకు నిలువరించగలుగుతున్నాయనే అంశాన్ని సర్జికల్ మాస్కుల సమర్థతతో శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో పోల్చి చూశారు. ఇందులో భాగంగా ఎల్‌ఈడీ కాంతి వ్యవస్థ, హైస్పీడ్ కెమెరాతో తుంపర్ల ప్రయాణాన్ని పరిశీలించారు.
తుంపర్లను సర్జికల్ మాస్కులు అత్యంత ప్రభావవంతంగా అడ్డుకోగలిగాయని తేల్చారు. ఒకే పొర ఉండేలా ఇంట్లో వస్త్రంతో తయారుచేసుకున్న మాస్కులు- మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్లను ఆపగలిగినప్పటికీ.. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చేవాటిని నిలువరించలేకపోయాయని గుర్తించారు. రెండు పొరలతో కూడిన మాస్కులు ఈ విషయంలో కొంత ప్రభావవంతంగా కనిపించాయని తెలిపారు. మూడు పొరలుంటే.. వాటిని దాటి తుంపర్లు బయటకు వెళ్లడం చాలా తక్కువని పేర్కొన్నారు.