చేప‌ల వ్యాపారి నుంచి 119 మందికి క‌రోనా

తిరువ‌నంత‌పురం: కేర‌ళలోని పుంథూరా గ్రామంలో మొట్ట‌మొద‌టి క‌రోనా క్ల‌స్ట‌ర్ ఏర్పాటైంది. అత్య‌ధిక సూప‌ర్ స్ప్రెడ‌ర్‌ల‌ను గుర్తించిన అధికారులు వెంట‌నే ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 25 క‌మాండోల బృందాన్ని ప్ర‌స్తుతం అక్క‌డ మోహ‌రించి ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. గ్రామంలో ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. అవ‌న‌వ‌స‌రంగా ఎవ‌రైనా బ‌య‌ట క‌న‌బ‌డితే క్వారంటైన్ కేంద్రాల‌కు పంపుతామ‌ని హెచ్చ‌రించారు. సాధార‌ణంగా ఒక వ్య‌క్తి ద్వారా  క‌రోనా వైర‌స్ ఆరుగురికి సోకితే అత‌న్ని సూప‌ర్ స్ప్రెడ‌ర్ అంటాం. అయితే పుంథూరా గ్రామంలో మాత్రం అత్య‌ధిక సూప‌ర్ స్ప్రెడ‌ర్లు ఉన్నారు.  వీరి ద్వారా క‌రోనా మ‌రింత వ్యాప్తి చెందే అవ‌కాశం ఉండ‌టంతో ఆరు ప్ర‌త్యేక వైద్య బృందాలు అక్క‌డికి చేరుకొని యుద్ద‌ప్రాతిప‌దిక‌న క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తెలిపారు. 

పుంథూరా గ్రామంలో మొద‌టిసారిగా చేప‌ల వ్యాపారికి క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. దీంతో కాంటాక్ట్ ట్రేసింగ్‌లో భాగంగా 600 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కేవ‌లం ఐదు రోజుల్లోనే 119 మందికి వైర‌స్ ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. మ‌రికొంత మంది ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వెలువ‌డాల్సి ఉంది. వ్యాపారి త‌మిళ‌నాడులోని ఓ స్థానిక మార్కెట్‌లో చేప‌లు విక్ర‌యిస్తుంటాడ‌ని తేలింది. అయితే ఒక వ్య‌క్తి నుంచి ఇప్ప‌టికే 119 మందికి వైర‌స్ సోకడంతో అధికారులు సైతం విస్తుపోయారు.

పుంథూరా తీర ప్రాంతం కావ‌డంతో  చాలా కుటుంబాలు చేప‌ల వేట పైనే ఆధార‌ప‌డి జీవిస్తున్నాయి. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చేవ‌ర‌కు మ‌త్య‌కారులు ఎవ‌రూ దీంతో చేప‌ల విక్ర‌యాల‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని జిల్లా కలెక్టర్ నవజోత్ ఖోసా ఆదేశించారు. గ్రామం మొత్తాన్ని శానిటైజేష‌న్ చేయాల్సి ఉంద‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలోని ప్ర‌తీ కుటుంబానికి 5 కిలోల బియ్యం ఇస్తామ‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 301 కొత్త క‌రోనా కేసులు న‌మోదు కాగా వీటిలో త్య‌ధికంగా పుంథూరా, తిరువ‌నంత‌పురం నుంచి న‌మోదైన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

Flash...   ఆయుష్మాన్‌ భారత్‌ VS ఆరోగ్య శ్రీ కార్డు .. ఈ కార్డులకు అర్హులు ఎవరు ..?