GST పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట.. ఆలస్యమైతే రూ.500 చెల్లిస్తే చాలు!

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లింపుదారులకు మోదీ సర్కార్ భారీ ఊరట కలిగించింది. కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ రిటర్న్స్ దాఖలు ఆలస్యమైతే తక్కువ పెనాల్టీ చెల్లించొచ్చని పేర్కొంది. దీంతో జీఎస్‌టీ చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతుంది. ఎక్కువ పెనాల్టీలు చెల్లించాల్సిన పని ఉండదు.
జీఎస్టీ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీఆర్-3బి ఫామ్ రిటర్న్ దాఖలుకు ఆలస్య రుసుమును గరిష్టంగా రూ.500కు పరిమితం చేసింది. జూలై 2017 నుంచి జూలై 2020 వరకు సంబంధించిన జీఎస్టీఆర్-3బి రిటర్న్స్‌ దాఖలుకు ఇది వర్తిస్తుంది. 2020 సెప్టెంబర్ 30లోపు రిటర్న్స్ దాఖలు చేస్తేనే ఈ రూ.500 ఆలస్య రుసుము పడుతుంది.
అలాగే నిల్ రిటర్న్స్ అంటే పన్ను చెల్లించనవసరం లేని పక్షంలో ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ స్పష్టం చేసింది. పన్ను చెల్లించాల్సి ఉన్నప్పుడు, అది కూడా సంబంధిత రిటర్న్స్ ఆలస్యం అయితేనే పెనాల్టీ అమలు అవుతుందని పేర్కొంది. గరిష్టంగా పెనాల్టీ రూ.500 ఉంటుందని తెలిపింది.
ఇకపోతే గత జీఎస్‌టీ మీటింగ్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రూ.5 కోట్లలోపు టర్నోవర్ ఉన్న వ్యాపారులకు ఆలస్య రుసుము, వడ్డీ చెల్లింపుపై మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. మే, జూన్, జూలై నెలలకు జీఎస్‌టీఆర్ 3బీ ఫామ్ దాఖలు చేసిన వారికే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుందని, అలాగే సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.
Flash...   Noise Smartwatch: నాయిస్‌ నుంచి కొత్త స్మార్ట్‌ వాచ్‌.. 4G వాయిస్ కాలింగ్‌తో పాటు మరెన్నో ఫీచర్స్‌..