జెడ్‌పి పాఠశాలలో అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం

 గాంధీ విగ్రహానికి మాస్క్‌, కలాం విగ్రహాలకు అనుచిత రంగులు-విప్పర్లరెడ్డిపాలెం జెడ్‌పి పాఠశాలలో దుండగుల దుశ్చర్య

నరసరావుపేట (గుంటూరు జిల్లా) : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం విగ్రహాల పట్ల అనుచితంగా వ్యవహరించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున శనివారం రాత్రి గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెం జెడ్‌పి పాఠశాలలో ఈ సంఘటన చోసుకుంది. పోలీసులకు ఈ విషయం అదే రోజు తెలిసినా రహస్యంగా ఉంచారు. ఆదివారం విషయం వెలుగులోకి వచ్చింది. 

స్థానికుల కథనం ప్రకారం… విప్పర్లరెడ్డిపాలెంలోని జెడ్‌పి పాఠశాలలో పలువురి జాతీయ నాయకుల విగ్రహాలు ఉన్నాయి. వాటిలోని అంబేద్కర్‌ విగ్రహం ముక్కు, కన్ను భాగాలను గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి ధ్వంసం చేసి అనుచిత రంగులు వేశారు. మహాత్మా గాంధీ విగ్రహానికి మాస్కుపెట్టి తలకు రంగు కాగితం చుట్టారు. అబ్దుల్‌ కలాం విగ్రహానికి అనుచితంగా రంగు వేశారు. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట రూరల్‌ సిఐ వై.అచ్చయ్య, రొంపిచర్ల ఎస్‌ఐ ఎస్‌.వెంకట్రావు వెంటనే వెళ్లి పరిశీలించారు. అంబేద్కర్‌ విగ్రహానికి మరమ్మతులు చేయించారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దుండగుల చర్యలకు నిరసనగా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడులో దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోదా రమేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. 

ధ్వంసమైన అంబేద్కర్‌ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాలు ఏర్పాటు చేయాలని బిఎస్‌పి జిల్లా కో-ఆర్డినేటర్‌ బూదాల బాబురావు, మాలమహానాడు జిల్లా నాయకులు గోదా జాన్‌పాల్‌ డిమాండ్‌ చేశారు.

Flash...   High Income: కోటి రూపాయల కంటే ఎక్కువ ఎంత మంది సంపాదిస్తున్నారో తెలుసా?