Civils ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన రైతు బిడ్డ.. సత్తా చాటిన తెలుగు తేజాలు..వివరాలు ఇవే

ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌-2019 పరీక్షకి సంబంధించిన తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 829 మంది అభ్యర్థులు సర్వీసెస్‌కు ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది. ఈ ఫలితాల్లో హర్యానాకు చెందిన ఒక రైతు కొడుకు ప్రదీప్‌ సింగ్‌ మొదటి ర్యాంక్‌ సాధించారు.
ఒకవైపు ఉద్యోగం మరోవైపు చదువు చాలా కష్టంగా ఉండేది. కొన్ని సమయాల్లో రెండింటి మధ్య సమన్వయం పాటించలేక ఏకాగ్రత కోల్పోయే వాడిని. అలాంటి సమయాల్లో నాన్నే నాలో స్పూర్తిని నింపేవారు అంటున్నారు సివిల్‌ సర్వీసెస్‌-2019 ఫలితాల్లో తొలిస్థానంలో నిలిచిన ప్రదీప్‌ సింగ్‌ వివరాలు ఇవే..

నాలుగో ప్రయత్నంలో కల నిజమైంది: ప్రదీప్‌ సింగ్
ఈయన హర్యానాలోని సోనిపేటకు చెందినవారు. ప్రస్తుతం ఫరీదాబాద్‌లోని నేషనల్‌ అకాడమి ఆఫ్‌ కస్టమ్స్‌, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ (ఎన్‌ఏసీఐఎన్‌) ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌)లో అధికారిగా (ప్రొబేషన్‌) పనిచేస్తున్నారు. సివిల్స్‌లో ప్రథమ ర్యాంకు రావడంపై ఆయన స్పందిస్తూ.. తన కల నిజమైందన్నారు. నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌లో మెరుగైన ర్యాంకు సాధించిన ప్రదీప్‌ ప్రభుత్వ పాఠశాలలో చదివినట్టు చెప్పారు. సివిల్స్‌ ఆశావహులకు సూచనలిస్తూ.. ఏకాగ్రతతో చదవాలని సూచించారు. ఇక ఇదే ఫలితాల్లో జతిన్‌ కిశోర్‌ రెండో స్థానం, ప్రతిభా వర్మ మూడో స్థానంలో నిలిచారు.
తెలుగువారి సత్తా:
సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంచి ర్యాంకులను సాధించి తమ సత్తా చాటారు. పెద్దిటి ధాత్రిరెడ్డి 46వ ర్యాంకు, మల్లవరపు సూర్య తేజకు 76వ ర్యాంకు, కట్టా రవితేజ 77వ ర్యాంకు, ఎంవీ సత్యసాయి కార్తీక్‌ 103, తాటిమాకుల రాహుల్‌ రెడ్డి 117, కె. ప్రేమ్‌ సాగర్‌ 170, శ్రీ చైతన్య కుమార్‌ రెడ్డి 250, చీమల శివగోపాల్ రెడ్డి 263, నారాయణపేటకు చెందిన బి. రాహుల్‌కు 272వ ర్యాంకు, యలవర్తి మోహన్‌ కృష్ణ 283, ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి 314వ ర్యాంకు, ముత్తినేని సాయితేదజ 344, ముక్కెర లక్ష్మీ పావన గాయత్రి 427వ ర్యాంకు, కొల్లాబత్తుల కార్తీక్‌ 428, ఎన్‌ వివేక్‌ రెడ్డి 485, నీతిపూడి రష్మితారావు 534, కోరుకొండ సిద్ధార్థ 566, సమీర్‌ రాజా 603, కొప్పిశెట్టి కిరణ్మయి 633వ ర్యాంక్‌ సాధించారు.
మొత్తం 927 ఖాళీలకు నిర్వహించిన ఈ పరీక్షల్లో విజయం సాధించిన వారిలో 304 మంది జనరల్‌ కేటగిరీ, ఓబీసీలో 251, ఎస్సీలో 129, ఎస్టీ కేటగిరీలో 67 మంది ఉద్యోగాలు సాధించారు. నూతనంగా ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్‌ (ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌ – ఆర్థికంగా బలహీన వర్గం) కోటాలో 78 మంది ఎంపికయ్యారు. మరో 182 మంది ఫలితాలను రిజర్వ్‌లో ఉంచినట్టు, 11 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచినట్టు యూపీఎస్సీ తెలిపింది. మరో 15 రోజుల్లో మార్కుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది.
Flash...   SA 1 పరీక్షలు అయ్యాయి .. శనివారం పేరెంట్స్ మీటింగ్ పెట్టండి