E-SR ‌ నమోదుకు అష్టకష్టాలు – సర్వర్‌ సమస్యలు

తెరచుకోని నెట్‌ సెంటర్లు వెంటాడుతున్న సర్వర్‌ సమస్యలు

లాక్‌డౌన్‌లో వ్యవస్థలన్నీ స్తంభించిపోవడంతో.. పనులేవీ సక్రమంగా సాగడం లేదు. ‘ఆన్‌లైన్‌’ కార్యకలాపాలు సైతం నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఈఎస్‌ఆర్‌’ నమోదు ఉపాధ్యాయ వర్గాలను కలవరపెడుతోంది. ఈ నెల 15లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు గడువు విధించారు. కానీ, ఓ వైపు కరోనా వ్యాప్తి.. మరోవైపు నెట్‌ సెంటర్లు తెరచుకోకపోవడంతో సకాలంలో ఈఎన్‌ఆర్‌ నమోదు ఎలా సాధ్యమంటూ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుభవజ్ఞులతో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి.. ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 ఉపాధ్యాయులకు అత్యంత ప్రధానమైన సర్వీసు రిజిష్టర్‌ను ‘ఈ-ఎస్‌ఆర్‌’గా అప్‌డేట్‌ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నెల 25లోగా వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని గడువు విధించింది. కానీ, దీనిని మళ్లీ జిల్లా విద్యాశాఖ ఈ నెల 15కు కుదించింది. కరోనా సమయంలో  ఈ ప్రక్రియ సకాలంలో పూర్తిచేయడం కష్టమేనంటూ ఉపాధ్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో 5,255 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3948  మంది, హైస్కూళ్లలో 8638 మంది..  మొత్తం 17,841 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరంతా ‘ఈ-ఎస్‌ఆర్‌’ ప్రక్రియ పూర్తిచేయాలి. కానీ లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో నెట్‌ సెంటర్లు తెరవట్లేదు. ఈ-ఎస్‌ఆర్‌ నమోదుకు కనీసం 2 నుంచి 4 రోజుల సమయం పడుతుందని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. నెట్‌ సదుపాయం ఉండి, కంప్యూటర్‌ పరిజ్ఞానం తెలిసి.. అన్ని సిద్ధంగా ఉంటే పూర్తవుతుంది. జిల్లాలో ఉదయం 11 గంటలు వరకే నెట్‌ సెంటర్లు తెరచుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈఎస్‌ఆర్‌  ఎలా నమోదు చేయగలమని ప్రశ్నిస్తున్నారు. గడువు పెంచాలని కోరుతున్నారు.

కీలకమైనా.. ప్రస్తుతం కష్టమే :ఉద్యోగి జీవితంలో ఎస్‌ఆర్‌ అత్యంత ప్రధానం పుస్తకరూపంలో ఉన్న ఎస్‌ఆర్‌ కాలిపోయినా.. తడిసి పాడైనా.. పోగొట్టుకున్నా తిరిగి పొందాలంటే కష్టమే. దానిని డిజిటలైజ్‌ చేసే క్రమంలో ఈ-ఎస్‌ఆర్‌ నమోదుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న విద్యాశాఖాధికారులు కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో నెలరోజుల కిందట ‘ఈ-ఎస్‌ఆర్‌’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. జూలై నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తిచేయాలని గడువు విధించారు. తర్వాత ఈ నెల 25 వరకు గడువు పొడిగించారు. కానీ గడువులోగా ఈ ప్రక్రియ పూర్తిచేయడం అసాధ్యమని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ-ఎస్‌ఆర్‌ నమోదుకు చాలా సమయం పడుతుంది. టీచర్లు, ప్రధానోపాధ్యాయులు విద్యార్హత సర్టిఫికెట్ల నుంచి ఉద్యోగం చేస్తున్న ప్రస్తుత స్థితి వరకూ ఎస్‌ఆర్‌లోని వివరాలు, ఉద్యోగి ఆస్తులు, ఆధార్‌, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి.

Flash...   SBI సరికొత్త పని విధానం..ఇంటి వద్దకే మనీ ప్రారంభం.

 పైగా 60 నుంచి 70 సర్టిఫికెట్ల కాఫీలు స్కాన్‌ చేసి, అప్‌లోడ్‌ చేయాలి. ఈ-ఎస్‌ఆర్‌ నమోదు ప్రక్రియలో ఏకంగా 12 రకాల అంశాలను అప్‌డేట్‌ చేయాలి. ఉపాధ్యాయులు వివరాలనీ సమర్పిస్తే  మండల పరిషత్‌ టీచర్లకు ఎంఈవోలు ఓకే చేస్తారు. ప్రధానోపాధ్యాయులకు డీవైఈవో ఓకే చేస్తారు. ఒక మండలంలో 250 నుంచి 350 మంది వరకు ఉపాధ్యాయులు ఉంటే వారంతా ఎంఈవోతో హార్డ్‌ కాఫీలపై ఆమోదం పొందాలి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రక్రియ ఎలా సాధ్యమంటూ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.