TS: 158 రోజుల తర్వాత తెరుచుకున్న బడులు.. హాజరుకాని పిల్లలు.. టీచర్లు మాత్రమే విధులకు

అనేక తర్జనభర్జనల అనంతరం ఎట్టకేలకు బడులు తెరుచుకున్నాయి. దాదాపు 158 రోజుల తర్వాత టీచర్లు విధులకు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి కారణంగా మార్చిలో మూతబడిన ప్రభుత్వ పాఠశాలలు గురువారం ఉపాధ్యాయులు విధులకు హాజరవడంతో పునఃప్రారంభమయ్యాయి. కేంద్రం ఆదేశించే వరకు విద్యార్థుల హాజరుకు అనుమతి లేకపోవడంతో ఉపాధ్యాయులే మాత్రమే స్కూళ్లలో దర్శనమిచ్చారు.

పలకరింపులతో తొలిరోజును ప్రారంభించారు. కొత్తగా అటెండెన్స్‌ రిజిస్టర్లు ఎంట్రీ చేయడంతోపాటు స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బందితో శానిటేషన్‌ చేయించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పిల్లలకు వీడియో పాఠాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వీడియో పాఠాలు, ఈ–లెర్నింగ్‌ మెటీరియల్, పాఠ్యాంశ ప్రణాళికలు తయారు చేయాలని ఉపాధ్యాయులకు స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినప్పటికీ 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి టీచింగ్‌ క్యాలెండర్‌ను సర్కారు ఇంకా విడుదల చేయలేదు. దీంతో టీచర్లు తొలిరోజు విధులకు హాజరైనా వీడియో పాఠాలు తయారీ లేకుండానే తొలిరోజు ముగించారు.

బస్సులు లేక వెతలు:

ప్రస్తుతం ప్రజా రవాణా స్తంభించడంతో విధులకు హాజరయ్యేందుకు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే టీచర్లు సహోద్యోగుల వాహనాలు లేదా సొంత వాహనాల్లో విధులకు హాజరయ్యారు. వాహన సౌకర్యం లేనివాళ్లు మాత్రం ప్రైవేటు వాహనాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది.

టీచర్లు ఎక్కువగా ఆర్టీసీ బస్సులపై ఆధారపడి విధులకు హాజరయ్యేవారు. అయితే ప్రధాన రహదారులకే పరిమితమైన బస్సులు… పల్లెబాట పట్టడం లేదు. దీంతో బస్సులు లేక చాలా మంది టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రభుత్వం ఆదేశం మేరకు తొలి రోజు స్కూళ్లు ప్రారంభమయ్యాయి.

Flash...   CPS రద్దా..వద్దా!