ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధం

క్రమబద్ధీకరణ కసరత్తు ముమ్మరం

ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధం

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ (రేషనలైజేషన్‌), బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన ప్రక్రియ నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు కొన్నిరోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రాకపోయినా రెండు, మూడు విధాలుగా జాబితాలను సిద్ధం చేస్తున్నారు. 2020 ఫిబ్రవరి 29 నాటికి డైస్‌ లెక్కలను పరిగణనలోకి తీసుకుని పిల్లల సంఖ్యను బట్టి పోస్టులను కేటాయించనున్నారు. దీనికి సంబంధించి పాఠశాలల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య వివరాలను తాజాగా సేకరిస్తున్నారు. గతంలో ఈ వివరాలను అందించినా, ఏమైనా మార్పులుంటే బుధవారంలోగా తెలియజేయాలని డీఈవో లింగేశ్వరరెడ్డి ఎంఈవోలను ఆదేశించారు.

జిల్లాలో 4020 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో 12 వేల మందికి పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడంతో పాటు ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఇకపై ఇద్దరు టీచర్లను నియమించనున్నారు. దీంతో ఈ ఏడాది భారీగా ఉపాధ్యాయులకు స్థానచలనం కలగనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో 851 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. అక్కడ పనిచేసే ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లినా, అనారోగ్యానికి గురైనా అక్కడి బడులు తెరుచుకునే పరిస్థితి లేదు. మైదాన ప్రాంతంలో వేరే పాఠశాల నుంచి ఉపాధ్యాయులను తాత్కాలిక విధులు అప్పగించినా ఏజెన్సీలో అయితే బడి మూతే. ఈ పరిస్థితిలో మార్పు రావాలనే సర్కారు ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులుండేలా తప్పనిసరి చేస్తామని చెబుతోంది. అలాగే జిల్లాలో ఎనిమిదేళ్లు ఒకేచోట పనిచేసే ఉపాధ్యాయులు వందల సంఖ్యలో ఉన్నారు. వీరంతా బదిలీలు ఎప్పుడు జరుగతాయా అని ఎదురుచూస్తున్నారు.

Flash...   Collection of data on Student absenteeism after Re-opening of schools