ప్రమాదకరమైన కరోనా వైరస్ రకం!

సాధారణం కన్నా 10 రెట్లు ఎక్కువగా వ్యాప్తి..మలేసియా శాస్త్రవేత్తల వెల్లడి. 

కౌలాలంపూర్‌: ప్రస్తుత కరోనా వైరస్‌ రకాల కన్నా పది రెట్లు ఎక్కువ వేగంతో విస్తరించే ఒక కొత్త రకాన్ని గుర్తించినట్లు మలేసియా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొవిడ్‌ కట్టడి చర్యలపై ఇది దుష్ప్రభావాన్ని చూపొచ్చని చెప్పారు.

డీ614జీ’గా ఈ కొత్త రకాన్ని పిలుస్తున్నారు. కరోనా వైరస్‌ ఉత్పరివర్తన చెంది, ఈ రూపాన్ని సంతరించుకొంది. భారత్‌ నుంచి తిరిగొచ్చిన ఒక రెస్టారెంట్‌ యజమాని.. క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించి, దాదాపు 45 మందికి ఈ ఇన్‌ఫెక్షన్‌ను వ్యాప్తి చేసిన సందర్భంలో ఈ కొత్త వైరస్‌ ఉత్పరివర్తనను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరిలో ముగ్గురికి ‘డీ614జీ’ రకం కరోనా వైరస్‌ సోకిందని తేల్చారు. ఈ రకం.. ఇప్పటికే అమెరికా, ఐరోపాల్లో కనిపించిందని, దీనివల్ల కరోనా మహమ్మారి రెండోసారి విజృంభించొచ్చని మలేసియా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జనరల్‌ నూర్‌ హిషామ్‌ అబ్దుల్లా చెప్పారు.

ఏమిటీ ఉత్పరివర్తన?
వైరస్‌లోని జన్యుపదార్థంలో జరిగే మార్పును ఉత్పరివర్తన (మ్యుటేషన్‌)గా పేర్కొంటారు. ఇది ఆ వైరస్‌ జీవిత చక్రంలో భాగం. ఈ మార్పుల వల్ల మానవులపై అదనంగా దుష్ప్రభావాలు కలగడం చాలా అరుదు. పైపెచ్చు.. కొన్ని సందర్భాల్లో ఈ ఉత్పరివర్తనల వల్ల వైరస్‌ బలహీనపడుతుంటుంది. కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వంటి ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లు చాలా వేగంగా ఉత్పరివర్తన చెందుతుంటాయి. వివిధ దేశాల్లో భిన్న రకాల కొవిడ్‌ వైరస్‌లు ఉండటం ఇందుకు నిదర్శనం. అయితే వాటిలో మార్పులు నెమ్మదిగా సాగుతున్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే తెలిపారు. గత ఏడాది చైనాలో తొలిసారిగా కనిపించిన వైరస్‌తో పోలిస్తే అది పెద్దగా మారలేదని చెప్పారు.

టీకాలపై ప్రభావం..?
ఈ కొత్త రకం వైరస్‌ వల్ల.. కొవిడ్‌-19 నివారణకు ఉద్దేశించిన టీకాలపై ప్రస్తుతం జరిగిన అధ్యయనాలు అసంపూర్తిగా మిగిలిపోవడం కానీ ఆ ఉత్పరివర్తనపై వ్యాక్సిన్‌లు పనిచేయకపోవడం కానీ జరగొచ్చని మలేసియా అధికారి అబ్దుల్లా చెప్పారు. అయితే సార్స్‌-కోవ్‌-2 వైరస్‌లో కొత్తగా వచ్చే మార్పులు తీవ్ర నష్టాన్ని కలిగించకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. –  source EEnadu news.

Flash...   మళ్లీ లాక్ డౌన్ దిశగా రాష్ట్రాల నిర్ణయం!