విద్యార్థులకు ఉచితంగా మాస్క్‌లు.. సెర్ప్‌కు పంపిణీ బాధ్యత!

 శ్రీకాకుళం : కోవిడ్‌-19 వైరస్‌ నుంచి రక్షణ కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుటుంబాలకూ మాస్క్‌ల్ణు పంపిణీ చేసింది. తాజాగా పాఠశాల విద్యార్థులకు కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా దారిద్య్రరేఖ దిగువన ఉన్నవారే కావడంతో ఒక్కొక్క విద్యార్ధికీ మూడేసి చొప్పున ఉతికి తిరిగి వినియోగించేందుకు అనువుగా ఉంటే మాస్క్‌లను అందించనుంది. సెప్టెంబర్‌ ఐదో తేదీ నుంచి పాఠశాలలను తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పాఠశాలలను తెరిచిన తర్వాత వీటిని అందించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 42.34 లక్షల మందికి పంపిణీ

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్యాల కింద నడుస్తోన్న పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 42,34,322 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కొక్క విద్యార్థికీ మూడేసి మాస్క్‌ల చొప్పున 1,27,02,966 మాస్కుల అవసరముంటుందని లెక్కగట్టారు. వీటి పంపిణీ బాధ్యతను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)కు ప్రభుత్వం అప్పగించింది. 

ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి విద్యార్థులకు ఇచ్చే మాస్క్‌ నాలుగున్నర అంగుళాల వెడల్పు, ఐదున్నర అంగుళాల ఎత్తు ఉండాలని, చెవి రింగులు ఆరు అంగుళాలు ఉండాలని సూచించింది. ఐదు నుంచి ఏడు తరగతులకు ఆరు అంగుళాల వెడల్పు, ఏడు అంగుళాల ఎత్తు, ఏడు అంగుళాల చెవి రింగులు, ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు ఏడు అంగుళాల వెడల్పు, ఏడున్నర అంగుళాల ఎత్తు, ఎనిమిది అంగుళాల చెవి రింగులు ఉండాలని నిర్దేశించింది. మాస్క్‌ల తయారీకి వస్త్రాన్ని ఆప్కో సరఫరా చేయనుంది. సెర్ప్‌లో శిక్షణ పొందిన డ్వాక్రా మహిళలతో కుట్టించనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో మాస్క్‌ తయారీకి ఎంత మంజూరీ చెల్లించాలనే దానిపై మార్గదర్శకాలు రావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. గతంలో ఒక్కో మాస్క్‌కు రూ.3 చొప్పున ప్రభుత్వం చెల్లించింది. ఇప్పుడు కూడా అదే రేటు ఉంటుందని భావిస్తున్నారు.

Flash...   3 Day training on developing of e-Content for 8th class