కరోనాకు వ్యాక్సినేషన్‌ ఇప్పట్లో లేనట్టే

WHO ప్రతినిధి కీలక వ్యాఖ్యలు

 జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం పెరుగుతుండటంతో అందరి చూపూ వ్యాక్సిన్‌పైనే ఉంది. ప్రజాజీవనాన్ని, ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిన ఈ మహమ్మారిని అంతం చేసేందుకు ప్రపంచ దిగ్గజ ఔషధ తయారీ సంస్థలు వ్యాక్సిన్‌ తయారీలో తలమునకలై ఉన్నాయి. ఇంకా మూడో దశ ట్రయల్స్‌ జరుగుతుండగానే వ్యాక్సిన్‌ను ఇదిగో తెచ్చేస్తున్నామంటూ రష్యా,  అమెరికాలు ప్రకటనలు చేసిన తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా విస్తృత వ్యాక్సినేషన్‌ను 2021 మధ్యకాలం వరకు చూస్తామని తాము భావించడంలేదని ఆ సంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్‌ హ్యారిస్‌ అన్నారు. శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ఆమె.. ఆయా ఔషధ సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు కరోనా నుంచి కాపాడేందుకు ఏమేర ప్రభావం చూపుతాయో, ఎంతవరకు భద్రతను కల్పిస్తాయో తదితర అంశాలను సునిశితంగా పరిశీలించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.  వ్యాక్సిన్ల మూడో దశ ప్రయోగాలకు ఎక్కువ సమయం పడుతుందన్నారు. ఎందుకంటే నిజంగానే ఆ వ్యాక్సిన్లు కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయా? ఏమేరకు సురక్షితం? తదితర అంశాలను జాగ్రత్తగా చూడాల్సి ఉంటుందని చెప్పారు.

ఓవైపు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను నవంబర్‌ 1నాటికి పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ రాష్ట్రాల గవర్నర్లకు అమెరికా రోగ నియంత్రణ సంస్థ (సీడీసీ) లేఖ రాయగా.. తాజాగా అక్టోబర్‌ చివరి నాటికి వ్యాక్సిన్‌ కష్టమేనంటూ అగ్రరాజ్యంలోని* *అంటువ్యాధుల ప్రముఖ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు.  వ్యాక్సిన్ ‌అందుబాటులోకి వచ్చిన ఏడాది లోపు ప్రపంచం సాధారణ స్థితికి చేరుకోగలగదని ఆయన అంచనా వేశారు.* *మరోవైపు, టీకాలపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు ఇంకా పూర్తికాకుండానే ‘నవంబరు 1’ గడువును నిర్దేశిస్తూ సీడీసీ సూచనలు జారీ చేయడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.*

Flash...   చైనాలో గుట్టుచప్పుడు కాకుండా తమ ప్రజలకు కరోనా వాక్సిన్