1వ తరగతికి ముందే పీపీ1, పీపీ2, ప్రీ ఫస్ట్ క్లాస్
వచ్చే ఏడాది నుంచి నూతన విద్యా విధానం
జాతీయ నూతన విద్యా విధానంపై సమీక్షలో సీఎం జగన్
5+3+3+4 అమలుకు సూత్రప్రాయంగా నిర్ణయం
అందుకు తగిన విధంగా పాఠ్య పుస్తకాల ముద్రణ, ఉపాధ్యాయులకూ శిక్షణ
విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా బదిలీలు
స్కూళ్లు, కాలేజీల్లో ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు
గ్రామ, వార్డు సచివాలయాల సేవలూ వినియోగించుకోవాలి
ఆ మేరకు అవసరమైన విధి విధానాలతో ఎస్‌ఓపీ, యాప్.
సాక్షి, అమరావతి: ఒకటవ తరగతికి ముందే పీపీ1, పీపీ2, ప్రీ ఫస్ట్ క్లాస్
(సంసిద్ధతా తరగతులు) ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్
జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పిల్లలకు 6 ఏళ్ల వయసు వచ్చే సరికే 85
శాతం మెదడు అభివృద్ధి చెందుతుందని అధ్యయనాలు, నిపుణులు చెబుతున్న దృష్ట్యా మొదటి
తరగతికి ముందే సంసిద్ధతా తరగతులను అభ్యసిస్తే వారి పునాది ధృడంగా ఉంటుందన్నారు.
దీనిని అనుసరిస్తూ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2021–22 నుంచి జాతీయ నూతన
విద్యా విధానం అమలు చేయాలన్నారు. ఇందులో భాగంగా 5+3+3+4 అమలుకు సూత్రప్రాయంగా
అంగీకరించారు. జాతీయ నూతన విద్యా విధానంపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో
ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
బలమైన పునాదితో మంచి ఫలితాలు
– విద్యార్థి రాణించాలంటే పునాది బలంగా ఉండాలి. అది జరగాలంటే ఒకటవ తరగతికి
రాకముందే చదువు పట్ల ఆసక్తి, శ్రద్ధ ఉండేలా చూడాలి. ఆట పాటలతో చిన్నారులు బడిబాట
పట్టేలా చూడాలి. అందుకోసమే విద్యా రంగంలో విప్లవాత్మక చర్యలకు నాంది పలుకుతూ
అంగన్‌వాడీలలో పీపీ1, పీపీ2 ప్రారంభించబోతున్నాం. ఆ తర్వాత ప్రీ ఫస్ట్ క్లాస్
ఉంటుంది. విద్యార్థి ఒకటవ తరగతిలో చేరేసరికి చదువు పట్ల అవగాహన ఉంటుంది. అప్పుడే
మంచి ఫలితాలు వస్తాయి. ఈ మేరకు సిలబస్ రూపొందించాలి. జాతీయ నూతన విద్యా
విధానాన్ని 2021–22 నుంచే అమలు చేయడానికి తగిన విధంగా పాఠ్య పుస్తకాలు
ముద్రించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలి.
– విద్యా రంగంలో గ్రామ, వార్డు సచివాలయాల సేవలను వినియోగించుకునేందుకు అవసరమైన
విధి, విధానాలను రూపొందించాలి. అందుకు తగిన ఎస్‌ఓపీ (స్టాండర్డ్ ఆపరేషన్
ప్రొసీజర్) ఉండాలి. ప్రత్యేక యాప్ కూడా రూపొందించాలి.
ప్రమాణాలు బావుండాలి
– అన్ని విద్యాలయాలు, కళాశాలలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. అవి కనీస ప్రమాణాలు
పాటిస్తున్నాయో? లేదో? ధ్రువపరుచుకోవాలి. తగిన ప్రమాణాలు పాటించని విద్యా
సంస్థలను తక్షణమే మూసి వేయాలి. అవి తిరిగి ఆయా ప్రమాణాలు సాధించిన తర్వాతే తిరిగి
ప్రారంభానికి అనుమతివ్వాలి.
– ఉపాధ్యాయ శిక్షణా సంస్థల పని తీరు, ఉపాధ్యాయ శిక్షణ కరిక్యులమ్‌పై కూడా తగిన
శ్రద్ధ కనపర్చాలి. సక్రమంగా పని చేయని ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు, నాణ్యత
ప్రమాణాలు పాటించని వాటిని తక్షణమే మూసి వేయాలి
– వివిధ పాఠశాలలు, శిక్షణా సంస్థలు, కాలేజీలు ప్రమాణాలు పాటించాల్సిన ఆవశ్యకతపై
తల్లిదండ్రులుకు వివరించాలి. విద్యా సంస్థల్లో ప్రమాణాలు కొరవడితే నష్టపోయేది
విద్యార్థులేనని వారికి అవగాహన కల్పించాలి.
ఉపాధ్యాయుల బదిలీలు
– విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను పునర్నియమించే
విధంగా అవసరసమైన బదిలీలు (Re Appropriation) చేయాలి.
– ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నత
విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్యా శాఖ
ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చిన
వీరభద్రుడు, హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్
జస్టిస్ వి.ఈశ్వరయ్య, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్
వెట్రిసెల్వి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, పలువురు
ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే పలు అంశాలు అమలు
– జాతీయ నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన అనేక అంశాలను రాష్ట్రంలో ఇప్పటికే
అమలు చేస్తున్నామని విద్యా శాఖ అధికారులు సీఎంకు వివరించారు.
– పాఠశాలలు, అంగన్‌వాడీల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం
అమలు, ప్రాథమిక స్ధాయిలో పాఠశాల సంసిద్ధత కార్యక్రమాల అమలు, ద్విభాషా పాఠ్య
పుస్తకాలు రూపొందించడం, సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టడం, స్థానిక సంస్కృతికి
అద్దం పట్టేలా పాఠ్య పుస్తకాల రూపకల్పన, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఏడాదికి
కనీసం 50 గంటల పాటు శిక్షణా కార్యక్రమాలు అమలు జరిగేలా చూడటం వంటివన్నీ
రాష్ట్రంలో అమలు అవుతున్నాయి.
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం 1,261 గురుకుల పాఠశాలలు, బాలికల కోసం
352 కస్తూరిబా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీ), దివ్యాంగుల కోసం 672 భవిత
కేంద్రాలను ఏర్పాటయ్యాయి.
– పాఠశాలల ప్రమాణాల పరిరక్షణ కోసం ఇప్పటికే పాఠశాల విద్య, ఉన్నత విద్యకు
సంబంధించి రెండు వేర్వేరు కమిషన్లు పని చేస్తున్నాయి.
– అంగన్‌వాడీ సిబ్బందిలో మరింత నైపుణ్యం పెంచడంలో భాగంగా ఇంటర్ అర్హత ఉన్న
వారికి ఆరు నెలల డిప్లొమా కోర్సు, పదవ తరగతి అర్హత ఉన్న వారికి ఏడాది డిప్లొమా
కోర్సు ప్రవేశపెట్టాల్సి ఉంది.