రోడ్డునపడిన 20 వేల మంది 2018-20 బ్యాచ్ విద్యార్థులు
పరీక్షలు రాసేందుకు అనుమతి నిరాకరించిన విద్యాశాఖ
5 నుంచి 11 వరకు డీఎడ్ ఫస్టియర్ పరీక్షలు
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేట్ డీఎడ్ కాలేజీలకు షాక్ ..! నిబంధనలకు విరుద్ధంగా 2018-20 బ్యాచ్‌లో ప్రవేశం కల్పించిన విద్యార్థులను పరీక్షలు రాసేందుకు పాఠశాల విద్యాశాఖ నిరాకరించింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. జీ.వో.నెం. 30కి విరుద్ధంగా ఆయా విద్యార్థులను చేర్చుకుని, ఫీజులు తీసుకుని, రెండేళ్ల డీఎడ్ కోర్సును పూర్తిచేయించిన కాలేజీ మేనేజ్‌మెంట్లకు ఈ పరిణామం శరాఘాతంలా మారింది. పరీక్షలకు అనుమతించకుంటే విద్యార్థుల భవితవ్యం ఏం కావాలన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.
2018-20 బ్యాచ్ డీఎడ్ ఫస్టియర్ పరీక్షలను నవంబరు 5 నుంచి 11 వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి షెడ్యూల్‌ను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 744 డీఎడ్ కాలేజీలు ఉండగా, వాటిల్లో 2018-20 బ్యాచ్‌లో కోర్సు పూర్తిచేసిన 14,530 మంది రెగ్యులర్ విద్యార్థులకు మాత్రమే ఫస్టియర్ పరీక్షలు రాసే అవకాశం కల్పించారు. వీళ్లతో పాటు గత బ్యాచ్‌ల్లో ఒకసారి ఫెయిలైన 6,555 మంది ప్రైవేట్ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు. మొత్తంమీద 21,085 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా 178 సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వాస్తవానికి ఎప్పుడో 2018-20 బ్యాచ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, రకరకాల కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చాయి. అయితే సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 6 వరకు ఈ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా గతంలో షెడ్యూల్ ఇచ్చారు. కానీ చివరి క్షణంలో డీఎడ్ ఫస్టియర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొవిడ్-19 కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ అసలు కారణం ఏమంటే.. 2018-20 బ్యాచ్‌కి సంబంధించి ప్రైవేట్ డీఎడ్ కాలేజీల్లో స్పాట్, మేనేజ్‌మెంట్ కోటాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల అడ్మిషన్లను పాఠశాల విద్యాశాఖ రాటిఫై చేయలేదు. సంబంధం లేకుండా కన్వీనర్ కోటాలో భర్తీకాని సీట్లను, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను నేరుగా భర్తీ చేసుకోవడమే ఇందుకు కారణం.
జీ.వో.నెం.30 ప్రకారం డీఎడ్‌లో ప్రవేశాలకు డీసెట్‌లో క్వాలిపై కావడం తప్పనిసరి. అయినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు రీత్యా 2015-16 విద్యా సంవత్సరం నుంచి కూడా డీసెట్ లేని అడ్మిషన్లను కూడా రాటిఫికేషన్‌తో అనుమతిస్తున్నారు. కానీ 2018-20 బ్యాచ్ అడ్మిషన్ల విషయంలో మాత్రం కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లను రూల్స్‌కు విరుద్ధంగా భర్తీ చేసుకోవడంపై సీరియస్ అయ్యింది. ఆ అడ్మిషన్లను అనుమతించబోమంటూ కాలేజీలకు హెచ్చరికలు చేసింది. ఫస్టియర్ పరీక్షలకు సంబంధిత విద్యార్థుల నుంచి ఫీజులు కూడా కట్టించుకోలేదు. దీంతో మేనేజ్‌మెంట్లు కోర్టుకెళ్లాయి. ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ వారి ప్రవేశాలు చెల్లబోవని తీర్పునిచ్చింది. దీంతో మేనేజ్‌మెంట్లు అప్పీల్ చేసుకున్నాయి. కేసు పెండింగ్‌లో ఉంది.
అయితే ఎన్‌సీటీఈ రూల్స్‌కు లోబడే తాము ఇంటర్ అర్హతపై అడ్మిషన్లు చేసుకున్నట్లు మేనేజ్‌మెంట్లు పేర్కొంటున్నాయి. పరీక్షలకు కౌంట్ డౌన్ అవుతుండటంతో ఆయా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మేనేజ్‌మెంట్లపై ఒత్తిడి పెరిగింది. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన మేనేజ్‌మెంట్లు పైరవీలను ముమ్మరం చేశాయి. కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లను డీసెట్‌కు క్వాలిఫైయింగ్ కోర్సు అయిన ఇంటర్ ఉత్తీర్ణతను ప్రాతిపదికగా తీసుకుని తాము అడ్మిషన్లు చేసుకుంటున్నామని, ఇది ఎన్‌సీటీఈ రూల్స్‌కు అనుగుణంగా జరుగుతోందని ఒకవైపు చెబుతూనే, ఇలా అడ్మిషన్లు చేసుకోవడం ఇప్పడే కొత్త కాదని 2015 నుంచి కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లను డీసెట్‌లో సంబంధం లేకుండానే భర్తీచేసుకుని విద్యాబోధన చేస్తున్న విషయాన్ని మేనేజ్‌మెంట్లు తాజాగా మంత్రి ఆదిమూలపు సురేశ్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరాయి.
దీంతో ఆయన పరీక్షల వాయిదాకు సిఫారసు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఫైలు పంపారు. తొలుత పట్టుదలతో ఉన్న అధికారులు అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు రావడంతో పరీక్షలను వాయిదా వేయక తప్పలేదు. కానీ ఈ అంశంపై మంత్రి సురేశ్ వద్ద పంచాయితీ జరిగింది. ఈ విషయంలో తాను చేయగలిగిందేమీ లేదని మేనేజ్‌మెంట్లకు ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో బుధవారం ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.