పాఠాలు కావాలా .. ? ప్రాణాలు కావాలా .. ?

కరోనా హడావిడి తగ్గిపోయింది, టీకా రాకముందే జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఈనెలలోనే సినిమా థియేటర్లు కూడా మొదలైతే.. ఇక ఆంక్షలకు పూర్తిగా గేట్లెత్తేసినట్టే. అయితే ఇదే సమయంలో స్కూళ్ల వ్యవహారం మాత్రం ఆందోళనకరంగా మారింది. పిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి స్కూల్లకు పంపించడానికి ఏ తల్లిదండ్రులు రిస్క్ చేయరు. అయితే ఇంట్లో ఉంటే ఉన్న చదువు పోతోందని, అన్నీ మర్చిపోతున్నారని, పూర్తిగా సెల్ ఫోన్ గేమ్స్ కి అడిక్ట్ అవుతున్నారని.. కొంతమంది ధైర్యం చేసి ట్యూషన్లకు పంపిస్తున్నారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా 9, 10 తరగతి పిల్లల్ని తల్లిదండ్రుల అనుమతితో స్కూళ్లకు రానిస్తోంది. వీరికి టీచర్లు పాఠాలు కూడా మొదలు పెట్టేశారు

ఈ దశలో రాష్ట్రంలో జరిగిన రెండు సంఘటనలు తల్లిదండ్రుల్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టేశాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరులో ట్యూషన్ కి వెళ్లిన 30మంది పిల్లలు కరోనా బారిన పడ్డ విషయం మరవకముందే.. విజయనగరం జిల్లా గంట్యాడ జడ్పీ హైస్కూల్ లో 20 మంది విద్యార్థులకు కరోనా సోకింది. వీరంతా ఇటీవల తరగతులకు హాజరైన 9, 10 తరగతులకు చెందిన స్టూడెంట్స్. తల్లిదండ్రుల అనుమతితోనే పిల్లలు స్కూల్ కి వచ్చారు.

గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనలో ట్యూషన్ మాస్టర్ వల్లే పిల్లలకు కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. గంట్యాడ స్కూల్ లో మాత్రం కరోనా మూలాలు కనిపెట్టలేకపోయారు వైద్య అధికారులు. ఆ పాఠశాలలో పనిచేసే ఉపాద్యాయులెవరికీ కరోనా లేదు. పిల్లల్లో ఒకరినుంచి ఒకరికి ఈ వ్యాధి సోకినట్టు అనుమానిస్తున్నారు.

మొత్తమ్మీద ఈ రెండు సంఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు డైలమాలో పడ్డారు. చదువుకోసం పిల్లల ప్రాణాలు పణంగా పెట్టాలా అని ఆలోచిస్తున్నారు. 9, 10 తరగతుల పిల్లల్ని కూడా స్కూల్ కి పంపించేందుకు ఆసక్తి చూపించడంలేదు. అటు ఉపాధ్యాయులు కూడా పిల్లల వల్ల తమకు కరోనా సోకుతుందేమోనని, తమ ద్వారా ఇంట్లోవారు ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని ఆందోళనలో ఉన్నారు.

Flash...   ఉద్యోగ సంఘాల్లో YCP మార్క్ విభజన !

బస్టాండ్ లు, బ్యాంకులు, మార్కెట్లు.. ఇలా సమూహ వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉన్నచోట్ల నిర్దిష్ట నివారణ చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నా.. స్కూల్ ప్రాంగణాల్లో పిల్లల్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాదు. కాకి ఎంగిళ్లు తింటూ.. చేయీ చేయీ కలిపి వెళ్లే సహ విద్యార్థుల మధ్య ఎవరైనా ఆంక్షలు పెట్టగలరా? ఒకవేళ పెట్టినా వారు వింటారా? ఎంతకాలం వారిపై నిఘా పెట్టగలరు? ఇదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు స్కూళ్లను తిరిగి ప్రారంభించడంలో వెనకడుగు వేసి, చివరకు నవంబర్ లో మహూర్తం ఫిక్స్ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అది కూడా అనుమానమేననిపిస్తోంది. వ్యాక్సిన్ వచ్చే వరకు స్కూల్స్ జోలికి పోకుండా ఉండటమే మంచిదేమోనని ప్రభుత్వాలు కూడా ఆలోచనలో పడ్డాయి.

తల్లిదండ్రుల వద్ద అంగీకార పత్రాలు తీసుకున్నా కూడా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడాలని ఎవరికీ ఉండదు. పాఠాలు కావాలా.. ప్రాణాలు కావాలా అనే ప్రశ్న ఎవరినీ స్థిమితంగా ఉంచడంలేదు. స్కూల్స్ విషయంలో ఇది మరీ సున్నితమైన అంశంగా మారుతోంది.