ఫిన్లాండ్‌ ప్రధానమంత్రిగా 16 ఏళ్ల బాలిక ఆవా ముర్టో

 ఫిన్లాండ్‌ : 16 ఏళ్ల బాలిక ఫిన్లాండ్‌కు ప్రధాని కాగలదా ? కానీ..
అయ్యింది ! గత బుధవారం ఉదయం ఫిన్లాండ్‌ ప్రధానమంత్రిగా ఆవా ముర్టో (16)
బాధ్యతలను చేపట్టింది. ఆ వెంటనే కేబినెట్‌ మంత్రులు, చట్ట సభ్యులు, అధికారులతో
సమావేశాన్ని నిర్వహించింది. బాలికలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయడం చాలా
ముఖ్యమని, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఈ సమస్యపై దృష్టి సారించాల్సిన
అవసరముందని నొక్కి చెప్పింది. సాంకేతికంగా దూసుకెళ్తున్న ఫిన్లాండ్‌…
బాలికలకు ఆ ఫలాలను అందించేందుకు ఏమేం చేయగలదన్న విషయమై ఆరా కూడా తీసింది
!

ఫిన్లాండ్‌ ప్రధానమంత్రిగా ఆవా ముర్టో ఎలా కాగలిగిందంటే…ఈ నెల 11 న
‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’. ఆ వేడుకను పురస్కరించుకుని ఐరాస బుధవారం
‘గర్ల్స్‌ టేకోవర్‌’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా దక్షిణ
ఫిన్లాండ్‌లోని వాక్సే గ్రామానికి చెందిన ఆవా ముర్టో (16) ఒక్కరోజు ప్రధానిగా
బాధ్యతలు చేపట్టింది. స్త్రీ-పురుష సమానత్వ భావనను చాటడమే లక్ష్యంగా ఈ
కార్యక్రమాన్ని నిర్వహించారు. ముర్టో తోపాటు అసలు ప్రధాని సనా మారిన్‌ కూడా
కేబినెట్‌ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వారిద్దరూ సంయుక్తంగా ఓ ప్రకటన
విడుదల చేశారు. ”ప్రపంచ వ్యాప్తంగా బాలికలకు ఆన్‌లైన్‌లో వేధింపులు
ఎదురవుతున్నాయి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, పరిష్కారం కనుగొనాలి” అని వారు
పేర్కొన్నారు. ఫిన్లాండ్‌లోని చాలా సంస్థలు కూడా మహిళా సిబ్బందికి ఒక్కరోజు
సారథ్య బాధ్యతలు అప్పగించాయి.

Flash...   UPSC నుంచి మరో నోటిఫికేషన్‌.. 344 ఖాళీలు