Adhaar Card mafia.

డబ్బులిస్తే కోరుకున్న విధంగా కార్డులో మార్పులు
పేరు, వయసు, అడ్రస్‌ ఏదైనా యాప్‌తో మార్చేస్తారు
అనంత నుంచి సిక్కోలు వరకూ రోజుకో ఘటన వెలుగులోకి
తాజాగా కర్నూలు జిల్లాలో ఏకంగా 30 మంది అరెస్ట్‌
ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసమే చేస్తున్నట్లు నిందితుల వెల్లడి
నేరస్థుల కోసం కూడా చేసి ఉండొచ్చని పోలీసుల అనుమానం

ఆధార్‌ కార్డులో మీ వయసు తగ్గించాలా? లేక పెంచాలా? తల్లిదండ్రుల పేర్లు మార్చాలా?
లేక మీ పేరే మార్చేయాలా? అందుకు అవసరమైన ధృవపత్రాలు మీ దగ్గర లేవా? అయినా ఎలాంటి
హైరానా పడాల్సిన పనిలేదు. ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకన్నా
లేదు. ఓ నాలుగైదు వేలు మీవి కావనుకుంటే చాలు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీకు
నచ్చినట్టు ఆధార్‌ వివరాలు మార్చేసుకోవచ్చు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ
ఏలూరు నుంచి కర్నూలు వరకూ ఎక్కడికక్కడ ఇలాంటి గ్యాంగులు పుట్టుకొస్తున్నాయి.
డబ్బులు తీసుకుని ఆధార్‌లో ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు.
అనర్హులను ప్రభుత్వ పథకాలకు అర్హులుగా మారుస్తున్న ముఠాలు ఈ రెండు నెలల కాలంలో
ఆరు చోట్ల పోలీసులకు చిక్కాయి. సుమారు 55 మంది అరెస్టయ్యారంటేనే రాష్ట్రంలో ఈ
దందా ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పనక్కర్లేదు!

అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆధార్‌ కార్డుల్లో ఇష్టానుసారంగా మార్పులు
చేస్తున్న ముఠాలు ఆంధ్రప్రదేశ్‌లో నలుమూలలా పుట్టుకొస్తున్నాయి. ఇలా చేస్తూ
నెలన్నర క్రితం అనంతపురంలో.. ఆ తర్వాత గుంటూరు అర్బన్‌లో ఒక బ్యాచ్‌,
శ్రీకాకుళంలో మరో గ్యాంగ్‌ పట్టుబడింది. ఏలూరు టూ టౌన్‌ పోలీసులు కూడా ఒక ముఠాను
పట్టుకున్నారు. వీళ్లందరినీ విచారించగా.. ఇవన్నీ సంక్షేమ పథకాల కోసమే
చేస్తున్నారని తేలింది. కానీ.. ఆధార్‌లో మార్పులు చేసుకుంటున్న వారిలో ఎంతమంది
ఏమేం నేరాలు చేశారో తెలీదు. ఆధార్‌ సవరణలు యూఐడీఏఐ అనుమతితో తప్ప ప్రైవేటు
వ్యక్తులు చేయరాదు. కానీ.. ఈ ముఠాలు వ్యక్తి పేరు, తండ్రిపేరు, అడ్రస్‌, పుట్టిన
తేది ఏదైనా మార్చేస్తున్నారు. ఆఖరికి ఫొటోలు సైతం మార్చేస్తున్నారు. అనంతపురం
జిల్లా పుట్లూరులో జరుగుతున్న ఈ భాగోతం గురించి నెల రోజుల క్రితం ఎస్పీ సత్య
యేసుబాబుకు సమాచారం అందింది.

Flash...   Naadu – Nedu Phase-II Master Trainers of 13 districts

రంగంలోకి దిగిన పోలీసులు తాడిపత్రి, గుంతకల్లు ప్రాంతానికి చెందిన ఐదుగురు సభ్యుల
ముఠా బయటి నుంచి మరో ముగ్గురి సహకారంతో మొత్తం 800 మంది ఆధార్‌ వివరాలు
మార్చేసినట్లు గుర్తించారు. దీనికి మూలాలు బెంగళూరులో ఉన్నట్లు సమాచారం
సేకరించారు. ఆధార్‌ మార్పుల కోసం డబ్బులు తీసుకుని 45 ఏళ్ల వయసున్న వారికి 62
సంవత్సరాలుగా వేసి ప్రతినెలా వృద్ధాప్య పింఛను వచ్చేందుకు సహకరించారు.
బెంగళూరులోని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ)ను
సంప్రదించిన అనంత పోలీసులు తాడిపత్రి, గుంతకల్లు ప్రాంతంలోనే వందలాది మంది ఆధార్‌
అడ్ర్‌సలు, ఇతర వివరాలు మారినట్లు పసిగట్టారు. తాజాగా కర్నూలు.జిల్లాలో పది గ్రామ
సచివాలయాల్లో ఆధార్‌ మార్పుల దరఖాస్తులు 200కు పైనే ఉన్నట్టు గుర్తించారు. రూ.5
వేలు తీసుకుని ఆధార్‌లో మార్పులు చేస్తూ ఆదోని, బనగానపల్లె, నందవరం పోలీస్‌
స్టేషన్ల పరిధిలోనే 30 మంది పట్టుబడ్డారు. ఆగస్టు చివరి వారంలో గుంటూరు అర్బన్‌
ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కేవలం రూ.2 వేలు ఇస్తే 35 ఏళ్ల మహిళ
వయసు 45 ఏళ్లుగా మారుస్తున్న గ్యాంగ్‌ను గుర్తించారు. ఈ ముఠా సంబంధిత అధికారుల
గెజిటెడ్‌ హోదాతో బయట రబ్బర్‌ స్టాంపులు తయారు చేయించి, నకిలీ లెటర్లు సృష్టించి
ఆధార్‌ వివరాలను ప్రణాళికా బద్ధంగా మార్చేస్తోంది. తిరుపతిలోని సుభాష్‌ నగర్‌లో
ఇంటర్నెట్‌ కేంద్రం నడుపుతున్న సిద్ధవటం రవిశంకర్‌ను సెప్టెంబరు 20న అలిపిరి
పోలీసులు అరెస్టు చేశారు. ఆయన రూ.2 వేల నుంచి రూ.5 వేల రూపాయలిస్తే చాలు ఎవరికి
ఆధార్‌ కార్డు ఎలా కావాలంటే అలా మార్చేస్తాడు. పేరు, పుట్టిన తేదీ మాత్రమే కాదు,
ఫోటో కూడా మార్చేయగలడు. 

సిక్కోలు ఆధార్‌కు ఒడిశాలో లాగిన్‌..

శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌ పేట మండలంలో 260మంది ఆధార్‌ కార్డులను మార్పు
చేసినట్లు ఇటీవలే జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ వ్యవహారం అంతా పర్లాకిమిడి
(ఒడిశా)లో లాగిన్‌ అవుతోందని, సరిబుజ్జిలి మం డలం నుంచి మొదలై జిల్లాలో
విస్తరించినట్లు చెప్పారు. ఒడిశాకు చెందిన ఎస్మన్‌ అనే వ్యక్తితో పాటు జిల్లాలోని
ఎల్‌ఎన్‌ పేట మండలం ఎంబారం గ్రామానికి చెందిన చిన్నారావు, శ్రీనివాసరావులను
పోలీసులు అరెస్టు చేయడంతో ముఠా గుట్టు రట్టయింది. వయసు మార్చేందుకు బర్త్‌
సర్టిఫికెట్‌, పదో తరగతి మార్కుల కార్డు అవసరం లేకుండానే ఈ గ్యాంగులు మాయ
చేస్తున్నాయని పోలీసుల విచారణలో తేలింది. ఏలూరులో ఒక ప్రబుద్ధుడు నకిలీ ఆధార్‌
కార్డులనే తయారు చేస్తున్నాడు. రామ్‌ ఇన్ఫో మీ సేవా కేంద్రం నిర్వాహకుడు
వీఆర్‌వీ, టీచర్‌, తహశీల్దార్‌ ఎవరి సంతకం కావాలన్నా ఫోర్జరీ చేసి నకిలీ ఆధార్‌
కార్డులే సృష్టించాడు.  

Flash...   ఇంటర్ పాసైతే ఇస్రోలో ఉద్యోగం పొందవచ్చా? సైంటిస్ట్ అవ్వాలంటే ఏ కోర్స్ చెయ్యాలి ... ISRO JOB

ఎలా చేస్తున్నారంటే..

మైక్రోసాఫ్ట్‌ పెయింట్‌ యాప్‌ ద్వారా ఈ ముఠాలు నకిలీ పాన్‌కార్డులను
సృష్టిస్తాయి. నెట్‌లో ఎవరో ఒకరి పాన్‌కార్డు డౌన్‌లోడ్‌ చేసుకుని ఫోటో, పుట్టిన
తేదీ, ఇతరత్రా అవసరమైన వివరాలు యాప్‌ ద్వారా మార్చేస్తారు. ఎవరి ఆధార్‌ కార్డు
మార్చాలో వారి పేరుతో ఏవేవి మార్చాలో వాటిని ఈ కార్డు ఆధారంగా యూఐడీఏఐలో
సమర్పిస్తారు. ఆ తర్వాత మార్పులతో కోరుకున్న విధంగా ఆధార్‌ కార్డు ఇచ్చేస్తారు.
దీంతో 35 ఏళ్ల మహిళకు 45 ఏళ్లుగా చూపించి ఆసరా కింద 18వేలు పొందితే.. 45 ఏళ్ల
పురుషుడికి 60 సంవత్సరాలుగా చూపించి వృద్ధాప్య పింఛను తీసుకొంటున్నాడు. ఈ
వ్యవహారం ఇంతటితో ఆగుతోందా.? అంటే నేరస్తులకు కూడా చేరుతోందన్న అనుమానాలు పోలీసుల
నుంచే వ్యక్తం అవుతున్నాయి. 

ఆధార్‌ కేంద్రాలపై పర్యవేక్షణ అవసరం: డీజీపీ సవాంగ్‌

యూఐడీఏఐ కేంద్రాలపై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌
అభిప్రాయపడ్డారు. పోలీసులకు ఏ చిన్న సమాచారం అందినా ముఠాల ఆట కట్టిస్తున్నామని..
అందులో భాగమే అనంతపురం, కర్నూలు, గుంటూరు, తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం కేసులని
స్పష్టం చేశారు. తప్పుడు పనులు చేస్తే జైలుకు వెళ్లక తప్పదని ముఠాలను
హెచ్చరించారు.

వర్చువల్‌ ఐడీ సురక్షితం..

రేషన్‌ కార్డు నుంచి సిమ్‌ కార్డు వరకూ అన్నింటికీ ఇప్పుడు ఆధార్‌ ఒక్కటే
ఆధారమైంది. బ్యాంకు, గ్యాస్‌, పింఛను, ప్రభుత్వ సబ్సిడీలకు కూడా ఇదే ముఖ్యం.
ఇంతటి కీలకమైన ఆధార్‌ను ఇప్పుడు కేటుగాళ్లు అక్రమ దందాలకు ఉపయోగించుకొంటున్నారు.
ఆధార్‌లో మార్పులు చేస్తున్నారు. ఎవరో ఒకరిది ఆధార్‌ కార్డు తీసుకొచ్చి
ఫ్యాబ్రికేట్‌ చేసి నకిలీది సృష్టిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోఆధార్‌ డేటా
హ్యాక్‌ అవ్వకుండా వర్చువల్‌ ఐడీ ద్వారా రక్షణ పొందవచ్చని పోలీసులు చెబుతున్నారు.
పన్నెండు నెంబర్ల ఆధార్‌ నంబర్‌ బదులు ఓటీపీ ద్వారా వచ్చే 16 అంకెల వర్చువల్‌ ఐడీ
ఇస్తే రక్షణగా ఉంటుందంటున్నారు.