అక్టోబర్ 8న “జగనన్న విద్యాకానుక”

అక్టోబర్ 8న “జగనన్న విద్యాకానుక”: సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ శ్రీ
తుమ్మా విజయకుమార్ రెడ్డి

విజయవాడ, 4 అక్టోబర్: ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం అత్యంత
ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “జగనన్న విద్యాకానుక” కార్యక్రమాన్ని అక్టోబర్ 8న
(గురువారం) ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా
ప్రారంభిస్తారని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్-అఫీషియో
సెక్రెటరీ శ్రీ తుమ్మా విజయకుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో
తెలిపారు. 

ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థినీ,
విద్యార్ధులకు  దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో స్టూడెంట్ కిట్లు పంపిణి
చేస్తారని వెల్లడించారు. 

ప్రభుత్వ యాజమాన్యం లోని అన్ని రకాల పాఠశాలల్లో ఒకటి నుండి 10వ తరగతి వరకు
చదువుతున్న విద్యారినీ, విద్యార్థులందరికీ స్టూడెంట్  కిట్లు పంపిణీ
చేయనున్నట్లు వివరించారు. ప్రతి స్టూడెంట్ కిట్ లో 3 జతల యూనిఫారాలు, ఒక జత
బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు,
ఒక స్కూల్ బ్యాగ్ ఉంటాయని తెలిపారు. 

బడిబయట పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడం, తద్వారా పాఠశాలల్లో పిల్లల నమోదు
శాతం పెంచడంతో పాటు అభ్యసనా కార్యక్రమంలో వారు ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం
ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఈ సందర్భంగా
సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్-అఫీషియో సెక్రెటరీ శ్రీ
విజయకుమార్ రెడ్డి తెలిపారు.

Flash...   Admissions into KGBV class 7th and 8th for 2020-21