అనుమతి ఉన్నా..పాఠశాలలు తెరవడం కష్టమే..!

పాఠశాలలు తిరిగి ప్రారంభించడంపై రాష్ట్రాల కసరత్తు.

 గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాలు కూడా ప్రాథమిక తరగతులు
దీపావళిలోపు పునఃప్రారంభించడం కష్టమేనని తేల్చాయి.

 కరోనావైరస్‌ ప్రభావం దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా గత
మార్చి నెల నుంచి విద్యా సంస్థలన్నీ మూతబడే ఉన్నాయి. వ్యవస్థలను గాడిలో
పెట్టడంలో భాగంగా జూన్‌ 8 నుంచి కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ ప్రక్రియను
కొనసాగిస్తోంది. తాజాగా అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల్లో భాగంగా అక్టోబర్‌
15నుంచి కంటైన్మెంట్‌ బయట ఉన్న పాఠశాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను
తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనిపై ఆయా రాష్ట్ర
ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే, వెసులుబాటు
ఉన్నప్పటికీ చాలా రాష్ట్రాలు మాత్రం పాఠశాలలను తిరిగి తెరిచేందుకు వెనకడుగు
వేస్తున్నాయి. ముఖ్యంగా వైరస్‌ తీవ్రత కొనసాగుతోన్న దృష్ట్యా ఆయా రాష్ట్రాలు
పాఠశాలలను తెరిచేందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దిల్లీ,
కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు పాఠశాలలు ఇప్పట్లో తెరవడం కష్టమని
ప్రకటించాయి.

 విద్యాసంస్థలు తిరిగే ప్రారంభించడంపై ఆయా రాష్ట్రాల ఆలోచన ఈ విధంగా
ఉంది.

దిల్లీలో..అక్టోబర్‌ 31వరకు ఇంతే..!

దేశరాజధాని దిల్లీలో అక్టోబర్‌ 31వరకు యథాతథ స్థితి కొనసాగిస్తామని
నిర్ణయించింది. అనంతరం పరిస్థితి సమీక్షించి దీనిపై మరోసారి నిర్ణయం
తీసుకుంటామని పేర్కొంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో..9, 10 తరగతులు మాత్రమే..!

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో అక్టోబర్‌ 19 పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు
రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, ప్రస్తుతం కేవలం 9, 10వ తరగతి
విద్యార్థులకు మాత్రమే తరగతులు ప్రారంభిస్తామని ప్రకటించింది. క్లాసులను మాత్రం
రెండు షిఫ్టుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి
దినేష్‌ శర్మ వెల్లడించారు. అంతేకాకుండా పాఠశాలలకు వచ్చే విద్యార్థులు తమ
తల్లిదండ్రుల నుంచి నిరభ్యంతర పత్రాన్ని తీసుకురావాలని సూచించింది.

కర్ణాటక..తొందరేం లేదు..!

వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా కర్ణాటకలో పాఠశాలలను ఇప్పట్లో తెరిచే
పరిస్థితి కనిపించడం లేదు. ‘విద్యార్థులు ఆరోగ్యం, భద్రతా మాకు ముఖ్యమైనది.
ప్రస్తుతానికి విద్యాసంస్థలు తెరవడంపై అటు ప్రభుత్వం కానీ, విద్యాశాఖ తొందరపడడం
లేదు, దీనిపై అన్ని రకాలుగా చర్చించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటాం’అని
విద్యాశాఖ మంత్రి పుpరేష్ కుమార్‌ వెల్లడించారు.

Flash...   Selfie Ban: సెల్ఫీలు నిషేధం, కారణం ఏంటంటే..

మహారాష్ట్రలో..దీపావళి తర్వాతే..!

దేశంలోనే అత్యధికంగా వైరస్‌ తీవ్రత ఉన్న మహారాష్ట్రలోనూ విద్యాసంస్థలు
తెరవడంపై రాష్ట్రప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. దీపావళి వరకు పాఠశాలలు మూసే
ఉంటాయని స్పష్టం చేసింది. దీపావళి తర్వాత పరిస్థితులను మరోసారి అంచనావేసిన
అనంతరం విద్యాసంస్థలు తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ‘దీపావళి
అనంతరం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే వైరస్‌ తీవత్రపై సమీక్షించి నిర్ణయం
తీసుకుంటారు. అంతవరకూ విద్యాసంస్థలు మూసే ఉంటాయి’ అని ఉపముఖ్యమంత్రి అజిత్‌
పవార్‌ పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మేఘాలయ రాష్ట్రాల్లోనూ..!

రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు విద్యాసంస్థలు మూసే ఉంటాయని
ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇక, దీపావళి తర్వాతే పాఠశాలు తెరవడంపై
నిర్ణయం తీసుకుంటామని గుజరాత్‌ ప్రభుత్వం పేర్కొంది. అటు మేఘాలయా కూడా ఇంకా
తుది నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే విద్యాసంస్థల పునఃప్రారంభంపై అక్కడి
తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకుంది. అయితే, అక్టోబర్‌ 15 నుంచి 6,7,8
తరగతులతో పాటు తొమ్మిది, పదోతరగతి విద్యార్థులకు కేవలం వారి విషయ సందేహాలను
నివృత్తి చేసుకునేందుకు పాఠశాలలకు అనుమతిస్తామని పేర్కొంది.

పుదుచ్చేరిలో ఒకపూట మాత్రమే..!

విద్యా సంస్థలలను తిరిగి ప్రారంభించడంలో పుదుచ్చేరి కాస్త ముందువరుసలో ఉంది.
తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులకు తిరిగి తరగతులను అక్టోబర్‌ 8 నుంచే
ప్రారంభించింది. అయితే, వీరికి కేవలం ఒకపూట మాత్రమే తరగతులు నిర్వహిస్తామని
పుదుచ్చేరి విద్యాశాఖ డైరెక్టర్‌ రుద్ర గౌడ్‌ వెల్లడించారు. విద్యార్థులు రోజు
విడిచి రోజు పాఠశాలలకు రావాలని సూచించింది. హరియాణా ప్రభుత్వం కూడా ఆరు నుంచి
తొమ్మిదో తరగతుల వరకు పునఃప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

AP, బెంగాల్‌ రాష్ట్రాల్లో నవంబరు వరకు..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా
నవంబరు 2 వరకు పాఠశాలలను ప్రారంభించమని పేర్కొంది. 

రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించడంపై నవంబరు నెల మధ్యలో నిర్ణయం
తీసుకుంటామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టంచేశారు. ఇలా
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ పాఠశాలలను తిరిగి
ప్రారంభించడంపై ఆయా రాష్ట్రాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని
పాఠశాలలు ఆన్‌లైన్‌లో బోధించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలాఉంటే, పాఠశాలలు
పునఃప్రారంభమైన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌
ప్రొసీజర్స్‌(SOPs) సిద్ధం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు,
కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటికే సూచించింది.

Flash...   Afghanistan కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో భయంకర దృశ్యాలు.. విమానం రెక్కలపైకి ఎక్కిన ప్రజలు.