బడిలో కరోనా…

*గుంటూరు జిల్లాలో 25 మంది టీచర్లకు వైరస్‌*

*ప్రకాశంలో ఏడుగురు విద్యార్థులు, హెచ్‌ఎంకు*

*విశాఖలో 50 మంది టీచింగ్‌, స్టాఫ్‌కు*

*స్కూళ్లు తెరిచిన 3 రోజుల్లోనే వందల కేసులు*

*ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)*

బడి తలుపులు తెరిచి మూడు రోజులైనా కాలేదు.. అప్పుడే కరోనా వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా కారణంగా రాష్ట్రంలో సుదీర్ఘకాలం మూతబడిన పాఠశాలలు ఈ నెల 2న పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూళ్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా.. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 239 మంది ఉపాధ్యాయులు, 44 మంది విద్యార్థులకు వైరస్‌ సోకినట్టు గుర్తించారు. మరిన్ని పరీక్షల ఫలితాలు అందాల్సి ఉంది. దీంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. తమ పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. గుంటూరు జిల్లాలో ఏకంగా 25 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకినట్టు గుర్తించారు. వారిలో వైరస్‌ లక్షణాలు పెద్దగా లేకపోయినప్పటికీ స్ర్కీనింగ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది*

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 500 మంది ఉపాధ్యాయులకు ఇటీవల కరోనా స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించగా 5 శాతం మంది కొవిడ్‌ బారిన పడినట్లు వెల్లడైంది. కాగా.. గుంటూరు జిల్లా వెల్లటూరు జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థికి పాజిటివ్‌ వచ్చింది. కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించగా విద్యార్థి తండ్రికీ వైరస్‌ సోకినట్టు తేలింది. ప్రకాశం జిల్లాలో మంగళవారం నలుగురు విద్యార్థులు, ఒక టీచర్‌కు కరోనా సోకగా.. బుధవారం ఏడుగురు విద్యార్థులు, ఒక ప్రధానోపాధ్యాయుడికి పాజిటివ్‌ వచ్చింది. కర్నూలు జిల్లాలో పాఠశాలలు తెరుచుకున్న మూడు రోజులకే ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలికి వైరస్‌ సోకినట్టు అధికారులు గుర్తించారు. అక్టోబరు నుంచి ఇప్పటివరకు జిల్లాలో 38 మంది టీచర్లు, 125 మంది విద్యార్థులకు కరోనా సోకింది. విశాఖపట్నం జిల్లాలో గడచిన రెండు రోజుల్లో 50 మంది టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌కు కరోనా సోకగా.. ఇద్దరు విద్యార్థులు కూడా కరోనా బారినపడ్డారు. మరి కొంతమంది ఫలితాలు రావాల్సి ఉంది. చిత్తూరు జిల్లాలో గత నెల 27, 28, 29, 31, ఈ నెల 2, 3, 4వ తేదీల్లో చేసిన పరీక్షల్లో ఏకంగా 187 మంది ఉపాధ్యాయులకు, 13 మంది విద్యార్థులకు వైరస్‌ సోకినట్లు తేలింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో 14 మంది విద్యార్థులతోపాటు ఒక టీచర్‌కూ కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈస్ట్‌ యడవల్లిలో 10 మందికి, కూచింపూడిలో టీచరుతో పాటు నలుగురు విద్యార్థులకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

Flash...   Investment in NPS: NPS పెట్టుబ‌డి మెరుగైన రాబ‌డిని ఇస్తుందా?