ఉపాధ్యాయ ఖాళీలపై తుది పరిశీలన
వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌కు రంగం సిద్ధం
రెండు రోజుల్లో అందుబాటులోకి.
ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి పాఠశాలల వారీగా గుర్తించిన ఖాళీలను మరోసారి నిర్ధారించే పనిలో జిల్లా విద్యాశాఖ తలమునకలై ఉంది. ఇప్పటికే గుర్తించిన ఖాళీల వివరాలపై కొన్ని తప్పిదాలు ఉన్నట్లు ఎంఈఓ, హెచ్‌ఎంలు జిల్లా విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని ఐటీ విభాగం సరిచేసి తిరిగి జాబితాను రూపొందించింది. వాటిని మరోసారి డీవైఈఓ, ఎంఈఓలకు పంపి వాటిని ధ్రువీకరించుకోనుంది. ఈ ప్రక్రియను బుధవారానికి పూర్తి చేసి ఖాళీల జాబితాను గురువారం నుంచి జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలనే యోచనలో జిల్లా విద్యాశాఖ ఉంది.
ప్రతి పాఠశాలలో ఖాళీలు, దీర్ఘకాలంగా ఉన్నవి, హేతుబద్ధీకరణతో ఖాళీలు, అడహక్ ప్రమోషన్ ఖాళీలు, బాలికల ఉన్నత పాఠశాలల్లో పురుష ఉపాధ్యాయులు ఎక్కడైనా పనిచేస్తుంటే ఆ ఖాళీలు ఇలా అన్ని కేటగిరీల్లో జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పెట్టడానికి కసరత్తు ప్రస్తుతం జరుగుతోంది. తేడాలకు తావు లేకుండా పకడ్బందీగా ఖాళీల జాబితాను రూపొందిస్తున్నట్లు డీఈఓ గంగాభవానీ చెప్పారు.
ఆ కేటగిరీపై నిఘా..
చాలా మంది ఉపాధ్యాయులు పాయింట్ల కోసం కేన్సర్, మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నామని వైద్యుల సిఫార్సు లేఖలు సమర్పించారు. అవన్నీ నిజంగా మెడికల్ బోర్డులో ఉన్న వైద్యులే జారీ చేశారా? లేక ప్రైవేటు వైద్యులా అనేది కూడా ర్యాండమ్‌గా పరిశీలన చేస్తున్నారు. సర్టిఫికెట్లు పెట్టి తిరిగి ప్రిఫరెన్షియల్ కేటగిరీ పాఠశాలల్లోనే కొనసాగటానికి ఆసక్తి చూపుతున్నారా అనే కోణంలోనూ యంత్రాంగం పరిశీలన జరుపుతోంది.
అదేవిధంగా జిల్లాలో రహదారి సౌకర్యం లేని మారుమూల, సముద్ర తీర ప్రాంతాల్లోని 42 పాఠశాలల్లో టీచర్ల కొరత ఏటా ఏర్పడుతోంది. ఈ పాఠశాలలకు టీచర్లను పంపటానికి ఈసారి ప్రతి కేటగిరీలో కొన్ని పోస్టులను రిజర్వు చేయాలని ప్రభుత్వం ఇంతకు ముందే ఆదేశించింది. దీంతో కేటగిరీ వారీగా ప్రతి మండలంలో ఉన్న ఖాళీల నుంచి 10శాతం ఖాళీలను భర్తీ చేసే పనుల్లో యంత్రాంగం ఉంది. అయితే ఈ ఖాళీల రిజర్వు విషయంలో యంత్రాంగం చాలా గోప్యత పాటిస్తోంది.
Category IV schools lists from 2012 to 2017 for West Godavari placed in District Official Website