గాలిలో కరోనా జాడలు

మూడు మీటర్లలోపు ప్రయాణం

సీసీఎంబీ ఎయిరోసోల్‌ సర్వే వెల్లడి

బాధితులు ఎక్కువగా ఉన్నచోటే వ్యాప్తి

అధిక వెలుతురు ఉన్నచోట తక్కువే

దీపావళికి పటాకులు కాల్చొద్దు: సీసీఎంబీ

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గాలిలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న జాడలున్నాయి.. కానీ దాని ప్రభావం ముందుగా ఊహించినంత ప్రమాదకరంగా లేదని హైదరాబాద్‌లోని సీసీఎంబీ ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. దాని ప్రభావం కేవలం రెండు నుంచి మూడు మీటర్లలోపే ఉన్నట్టు తేలింది. భయంకరమైన ఈ వైరస్‌ గాలిలో వ్యాపిస్తుందా? లేదా? అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నా యి. గాలిలో వైరస్‌ వ్యాప్తికి ఆధారాలున్నాయని వివిధ దేశాల శాస్త్రవేత్తలు, పరిశోధనా సంస్థలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు నివేదించాయి. 

ఇదే విషయంపై సీసీఎంబీ ఆధ్వర్యంలో రెండు నెలల నుంచి హైదరాబాద్‌ కేంద్రంగా ఎయిరోసోల్‌ వైరల్‌ ట్రాన్స్‌మిషన్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. నగరంలో కరోనా చికిత్సలు అందిస్తున్న కొన్ని దవాఖానలను, ఇతర ప్రాంతాలను శాస్త్రవేత్తలు పరిశోధన కోసం ఎంచుకున్నారు. కరోనా బాధితులు ఎక్కువగా, తక్కువగా ఉన్న ప్రాంతాలతోపాటు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే బాధితులున్న ప్రాంతాల్లోనూ పరిశోధనచేశారు. బాధితులు అధికంగా ఉన్నచోట వైరస్‌ గాలిలో వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. డ్రాప్‌లెట్స్‌ ద్వారా వెలువడిన వైరస్‌ గాలి, దుమ్ము కణాలలో కలిసి ప్రయాణిస్తున్నట్టు తేల్చారు. కానీ సంబంధిత రోగులనుంచి కేవలం రెండు నుంచి మూడు మీటర్ల లోపే దాని వ్యాప్తి ఉన్నట్టు కనుగొన్నారు. వెంటిలేషన్‌ లేకుం డా చాలావరకు ‘క్లోజ్డ్‌ డోర్‌’లలో వైరస్‌ గాలిలో తిరగాడుతున్నట్టు గుర్తించారు. 

గాలి, వెలుతురు ధారాళంగా ఉన్నచోట దీని ప్రభావం తక్కువగా ఉన్నట్టు తేలింది. ఒకరిద్దరు ఉన్నచోట గాలిలో కరోనా కనిపించలేదని తెలుస్తున్నది. ఒక గదిలో 7నుంచి 10 అడుగుల ఎత్తు లో వైరస్‌ వ్యాప్తి ఉన్నట్టు సమాచారం. ఇలాంటి ప్రాం తంలో సాధారణ వ్యక్తులకు వైరస్‌ వ్యాపించే అవకాశమున్నదని తేల్చారు. నలువైపులా ద్వారాలు తెరిచి వెంటిలేషన్‌ బాగా ఉన్నచోట గాలిలో వైరస్‌ జాడలు అంతలా కనిపించడం లేదని శాస్త్రవేత్తలు తమ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది. ఇతర దేశా ల్లో ఆందోళన వ్యక్తమవుతున్నంత తీవ్రంగా లేదని శాస్త్రవేత్తలు నివేదించినట్టు సమాచారం. ఎయిరోసోల్‌ సర్వే ఇంకా కొనసాగుతున్నదని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. 

Flash...   RTC సంచలన నిర్ణయం..త్వరలో డ్రైవింగ్ స్కూల్స్..!

పటాకులను నియంత్రించాలి

కాలుష్యం కారణంగా వైరస్‌ ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా చెప్తున్నారు. ఢిల్లీలో కాలుష్యం వల్లే వైరస్‌ మరింత విజృంభిస్తున్నదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యల వల్ల వైరస్‌ కట్టడి సాధ్యమైందన్నారు. కానీ రెండో దఫా కరోనా వ్యాపించే అవకాశాలున్నాయని, ఈ దశలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నదన్నారు