266 మంది టీచర్లకు సంజాయిషీ నోటీసులు

ఒంగోలు విద్య, డిసెంబరు 25 : జిల్లాలో నిష్టా ఆన్‌లైన్‌ శిక్షణకు హాజరు కాని 266మంది ఉపాధ్యాయులకు సంజాయిషీ నోటీసులు ఇస్తూ డీఈవో వి.ఎస్‌.సుబ్బారావు ఉత్తర్వులు జారీచేశారు. నోటీసులు అందిన వారంరోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసివేసిన సమయంలో కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో టీచర్లకు ఆన్‌లైన్‌ శిక్షణకు శ్రీకారం చుట్టారు. అయితే ఉపాధ్యాయులు మొదటిగా తమ పేర్లు నమోదు చేసుకోలేదు. కొందరు నమోదు చేసుకున్నా రెగ్యులర్‌గా శిక్షణకు హాజరుకాలేదు. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారందరికీ సంజాయిషీ నోటీసులు జారీచేశారు. 

ప్రాథమిక స్థాయిలో విద్యను మరింత బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నూతన ఆవిష్కరణలతో ఈ ఏడాది ఆగస్టులో ఎన్‌సీఈఆర్‌టీ  ‘నిష్టా’ ఆన్‌లైన్‌ శిక్షణకు శ్రీకారం చుట్టింది. నేషనల్‌ ఇన్సియేటేవ్‌ ఫర్‌ స్కూల్‌ హెడ్స్‌ అండ్‌ టీచర్స్‌ హోలిస్టిక్‌ అడ్వాన్స్‌మెంట్‌గా పిలిచే ఈ కార్యక్రమానికి టీచర్లందరూ ముందుగా తమ పేర్లు రిజిస్టర్‌ చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 1 నుంచి 8వ తరగతి వరకు బోధిస్తున్న 8,262 మంది టీచర్లు హాజరుకావాల్సి ఉంది. 90రోజుల కార్యక్రమాన్ని అక్టోబరులో ప్రారంభించారు. అయితే అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసి జిల్లాలో 266 మంది ఉపాధ్యాయులు శిక్షణకు హాజరుకాలేదు. దీనిని పాఠశాల విద్య డైరెక్టర్‌ తీవ్రంగా పరిగణించారు. శిక్షణకు హాజరుకాకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. అయినప్పటికీ కొందరు స్పందించకపోవడంతో వారిపై క్రమశిక్షణ చర్యలకు పాఠశాల విద్యాశాఖ ఉపక్రమించింది. 

శిక్షణకు హాజరు కాని వారికి నోటీసులు జారీచేసి వారి నుంచి వారంరోజుల్లో వివరణ తీసుకుని వారిపై ఏమి చర్యలు తీసుకుంది.. 15 రోజుల్లోపు తమకార్యాలయానికి నివేదిక పంపాలని డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు. శిక్షణకు రాని వారి వివరాలు కూడా డైరెక్టర్‌ కార్యాలయం నుంచి డీఈఓ కార్యాలయానికి అందాయి. దీంతో డీఈవో సుబ్బారావు ఆయా ఉపాధ్యాయులందరికీ సంజాయిషీ నోటీసులు జారీచేశారు.  

Flash...   PGCIL న్యూఢిల్లీలో ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు.. భారీగా వేతనం!