Teacher Posts Blocked for Transfers

50 శాతం కాదు 30 శాతమే చేశాం 

ఇది కొత్తేమీ కాదు: విద్యామంత్రి సమర్థన 

పారదర్శకత కోసమే వెబ్‌ కౌన్సెలింగ్‌ 

కేటగిరీ-3లోని ఖాళీలూ బ్లాక్‌ చేసేశారు 

ఇలాంటి బదిలీలు దండగ: ఉపాధ్యాయులు 

మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలి: ఫ్యాప్టో 

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉపాధ్యాయ పోస్టుల బ్లాకింగ్‌, వెబ్‌ కౌన్సెలింగ్‌పై ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీల డిమాండ్లు, ఆందోళనలను పట్టించుకోకుండా మొండివైఖరి అవలంబిస్తోంది. ఖాళీ పోస్టులను బ్లాక్‌ చేయడం కొత్త విషయమేమీ కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ శుక్రవారం మీడియా ముందు సమర్థించుకున్నారు. బ్లాక్‌ చేసిన పోస్టులు 25-30శాతం వరకు ఉంటాయని, 50శాతం అనడం వాస్తవం కాదన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల పాఠశాలల్ని దృష్టిలో ఉంచుకుని వాటిని బ్లాక్‌ చేశామని చెప్పారు. ఆ పోస్టులను బదిలీలు పూర్తయ్యాక మారుమూల, గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేస్తామన్నారు.

రాష్ట్రంలో మంజూరైన టీచర్‌ పోస్టులు 1.72లక్షలు ఉండగా, వాటిలో 15వేల పోస్టులు బ్లాక్‌ చేశామని చెప్పారు. ‘‘పారదర్శకత, జవాబుదారీతనం, అవకతవకలకు ఆస్కారం లేకుండా వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా ఉపాధ్యాయ బదిలీలకు చర్యలు తీసుకున్నాం. వెబ్‌ ఆప్షన్లు ఎలా ఇవ్వాలో ఇప్పటికే డెమో ఇచ్చి యూట్యూబ్‌లో పెట్టాం. జీఓ.53, 54, 59లకు అనుగుణంగానే బదిలీల ప్రక్రియ చేపట్టాం. విద్యార్థుల నిష్పత్తి ప్రకారం బదిలీలకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని మంత్రి స్పష్టం చేశారు. అయితే వెనుకబడిన ప్రాంతాల్లోని పాఠశాలలు మూతపడకుండా ఉండేందుకు కొన్ని పోస్టులు బ్లాక్‌ చేస్తామన్న అధికారులు ఇప్పుడు కేటగిరీ-3లోని ఖాళీలను కూడా బ్లాక్‌ చేశారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. 50శాతం పోస్టులు బ్లాక్‌ చేశారని, ఇలాగైతే బదిలీలు నిర్వహించడం దండగని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌జీటీలు ఎక్కువగా ఉన్నారని, వారు మెరుగైన ప్రదేశానికి ఆప్షన్‌ ఇచ్చుకోవాలంటే వెబ్‌ కౌన్సెలింగ్‌లో అసాధ్యమని అంటున్నారు. ఒక్కో ఎస్‌జీటీ కనీసం 2-3 వేల ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందని, వారికి మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కోరుతున్నారు. 

Flash...   జూన్ 7 నుంచి పది పరీక్షలు

ఇలాగైతే బదిలీలు ఎందుకు? 

మూడేళ్ల తర్వాత జరుగుతున్న బదిలీల కోసం ఉపాధ్యాయ లోకం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఖాళీగా ఉన్న పోస్టుల్లో కోరుకున్న ప్రదేశానికి వెళ్లవచ్చని ఎంతగానే ఆశపడ్డారు. మారుమూల ప్రాంతాల పాఠశాలల్లో పనిచేస్తూ ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తిచేసిన ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే నిబంధనల పేరిట ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లిందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల మొండివైఖరి, ఏకపక్ష ధోరణిపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

పోస్టుల బ్లాకింగ్‌ రద్దు చేయాలని, మాధ్యమం నమోదులో తేడా వల్ల పోస్టులు కోల్పోయిన పాఠశాలలకు తిరిగి వాటిని కేటాయించాలని, బదిలీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ వద్దని, మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) డిమాండ్‌ చేస్తోంది. ఇందుకు గల కారణాలను సైతం విద్యామంత్రికి, ఉన్నతాధికారులకు నేతలు పలుమార్లు వివరించారు. పట్టుదలకు పోయి ఉపాధ్యాయులను రోడ్లపైకి రప్పిస్తున్నారని, ఇది తగదని అంటున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఫ్యాప్టో ఆధ్వర్యంలో విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు శుక్రవారం ముట్టడించారు.

వెబ్‌ కౌన్సెలింగ్‌ రద్దు చేయండి

పోస్టులు బ్లాక్‌ చేయొద్దు: ఫ్యాప్టో 

విద్యాశాఖ కమిషనరేట్‌ ముట్టడి

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 11: వెబ్‌ కౌన్సెలింగ్‌ రద్దు చేయాలని, అన్ని పోస్టులకు కౌన్సెలింగ్‌ జరపాలని డిమాండ్‌ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. బదిలీల్లో పారదర్శకత పాటించకుండా విద్యాశాఖ అధికారులు ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, ఫ్యాప్టో చైర్మన్‌ జీవీ నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధ్యమం నమోదులో తేడా వల్ల పోస్టులు కోల్పోయిన పాఠశాలకు పోస్టులు కేటాయించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి కె.నరహరి, ఎం.రఘునాథరెడ్డి, పి.బాబురెడ్డి, సీ.హెచ్‌.జోసెఫ్‌ సుధీర్‌బాబు, పి.పాండురంగ వరప్రసాద్‌, వి.శ్రీనివాసరావు, పి.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ సాధ్యం కాదు: మంత్రి సురేశ్‌

అమరావతి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా ఆన్‌లైన్‌లో ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ఈ నెల 11నుంచి మొదలైందని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. 15 వరకు గడువు ఉందని, బదిలీ కోరుకునే ఉపాధ్యాయులు ఎన్నిసార్లయినా ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉందన్నారు. 16తో వెబ్‌ ఆప్షన్లను ఫ్రీజ్‌ చేస్తామని, 21న జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. శుక్రవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 1.72,082 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారని, వారందరికీ నేరుగా కౌన్సెలింగ్‌ నిర్వహించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదన్నారు.

Flash...   Instructions to follow the G.O.Ms.No. 31 WD& CW Dept. dt. 01.12.2009 for disabled

బదిలీ ప్రక్రియకు వినియోగిస్తున్న సాప్ట్‌వేర్‌లో ఎలాంటి లోపాలు లేవని అపోహలకు గురికావద్దన్నారు.  బదిలీ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిందన్నారు. బ్లాక్‌ చేసిన పోస్టుల వివరాలు అన్ని జిల్లాల్లోని డీఈవో ఆఫీసుల్లో ప్రదర్శించడంతో పాటు వెబ్‌సైట్‌లో కూడా పెడతామన్నారు. ఎక్కడెక్కడ బ్లాక్‌ చేశామనే సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి అభ్యతరం లేదని మంత్రి పేర్కొన్నారు.