ఉపాధ్యాయుల బదిలీలతో మీకేం సంబంధం?

 బీసీ సంక్షేమ సంఘం పిల్‌పై హైకోర్టు ఆగ్రహం

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియతో మీకేం సంబంధం? బదిలీలతో ఉపాధ్యాయులు ప్రభావితులవుతారనే కారణంతో వారి తరఫున మీరెలా పిల్‌ వేస్తారని ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని హైకోర్టు ప్రశ్నించింది. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటారా? లేక ఖర్చులు విధించమంటారా? అని హెచ్చరించడంతో.. ఉపసంహరించుకుంటున్నట్లు పిటిషనర్‌ తరఫు న్యాయవాది నివేదించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ డి.రమేశ్‌తో కూడిన ధర్మాసనం ఇందుకు సమ్మతించింది. గత విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేసి బదిలీలు చేపట్టాలంటూ బీసీ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బి.చిరంజీవి హైకోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.నాగేంద్రరెడ్డి శుక్రవారం వాదనలు విన్పిస్తూ.. కరోనా కారణôగా ప్రవేశాలు లేకపోయినా, పాఠశాలలు మొదలుకాకపోయినా ఈ ఏడాది నవంబర్‌ నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను బదిలీ చేస్తున్నారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘బదిలీలతో మీ సంఘానికి సంబంధమేంటి? మీ సంఘం పూర్తి పేరేంటి? పిల్‌ వేయడానికి మీకున్న అర్హతేంటి? బదిలీలతో మీరెలా ప్రభావితులవుతారు?’ అని ప్రశ్నించింది. ‘ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణను ప్రభుత్వం చూసుకుంటుంది. అభ్యంతరాలుంటే ఉపాధ్యాయ సంఘాలు కోర్టును ఆశ్రయిస్తాయి. పరిధి దాటి వ్యవహరించొద్దు. సంక్షేమ సంఘం పేరుతో అన్నింటా జోక్యం చేసుకోవడమేంట’ని ప్రశ్నించింది. న్యాయవాది బదులిస్తూ.. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా వ్యాజ్యం దాఖలు చేశామన్నారు. ఆ వాదనలపై సంతృప్తి చెందని ధర్మాసనం.. పిటిషన్‌ వెనక్కి తీసుకుంటారా? ఖర్చులు విధించమంటారా? అని హెచ్చరించింది. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటామని న్యాయవాది చెప్పగా, ధర్మాసనం అంగీకరించింది.

Flash...   Nipah Virus: Nipah వైరస్ కారణంగా తీవ్ర మరణాలు-ICMR హెచ్చరికలు - సూచనలు