బదిలీలతో ఆ పాఠశాలల మూత

 గుంటూరు జిల్లా,:

మాచర్ల: ఇటీవల ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియతో వెల్దుర్తి మండలంలో 11 పాఠశాలలు మూతపడ్డాయి. మండలం మొత్తం మీద 122 మంది ఉపాధ్యాయులు ఉండగా అందులో 54మంది బదిలీ అయ్యారు. వీరిలో నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే 11 పాఠశాలల్లో 18మందిని బదిలీ చేయడంతో ఇప్పుడు ఆ పాఠశాలలు మూత పడ్డాయి. 54మంది బదిలీపై వెళ్లగా ముగ్గురు మాత్రమే మండలానికి వచ్చారు. మూత పడిన పాఠశాలలకు డిప్యుటేషన్‌పై ఇతర ఉపాధ్యాయులను పంపించేందుకు విద్యాశాఖ ప్రయత్నించినా 80శాతం ఉపాధ్యాయినులు కావడంతో వెనకడుగు వేసింది. ఈ నేపథ్యంలో 11 పాఠశాలల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయం ఎంఈవో అల్లి సురేష్‌ ప్రభుత్వ విప్‌ రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన విద్యాశాఖ కమిషనర్‌ వీరభద్రుడుకు శుక్రవారం ఫోన్‌లో సమస్య వివరించారు. మా ప్రాంతంలో పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి, ఉపాధ్యాయులంతా ఇక్కడ నుంచి వెళ్లిపోతే పాఠశాలల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతాయని కమిషనర్‌కు వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా పిల్లలు చేరిక ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయులు లేకపోతే తరగతులు ఎలా నిర్వహిస్తారని పేర్కొన్నారు. రెండు, మూడేళ్లు కాకుండానే ఇక్కడ నుంచి చాలామంది ఉపాధ్యాయులు బదిలీలపై వెళ్లిన్నట్లు ప్రభుత్వ విప్‌ వివరించారు. వెనకబడిన వెల్దుర్తి మండలం విషయంలో నిబంధనలు సడలించాలని కోరారు.

Flash...   NEW GUIDELINES FOR TEACHERS ATTENDACNCE APP