సరెండర్‌ లీవ్‌ చెల్లింపులు..ఎప్పటికో?

రెండు నెలలుగా అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపు 

ఒక్కో ఉద్యోగికి 15 రోజులు సరెండర్‌ చేసుకొనే అవకాశం 

ఖజానా ఖాళీ కావడమే ప్రస్తుత పరిస్థితికి కారణం 

పండగ ఖర్చులు ఎలా అధిగమించాలోనని ఉద్యోగుల అంతర్మథనం

గుంటూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఏటా సంవత్సరం ఆఖరులో తమకున్న సెలవులను ప్రభుత్వానికి సరెండర్‌ చేసి దానికి వేతనం పొందే ఉద్యోగులు ఈ ఏడాది కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కరోన కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినా తమకున్న సరెండర్‌ లీవ్‌లకు వేతనం పొందే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్‌, న్యూఇయర్‌ గడిచిపోగా సంక్రాంతి పండగ రాబోతోంది. దీంతో పండగ ఖర్చులు ఎలా అధిగమించాలో అని మథనపడుతున్నారు. నిత్యం డ్రాయింగ్‌ డిస్‌బర్స్‌మెంట్‌ అధికారులను సరెండర్‌ లీవ్‌లు ఎన్‌క్యాష్‌ అయ్యాయో, లేదోనని వాకబు చేస్తూ ప్రభుత్వ బడ్జెట్‌ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. 

ప్రతీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ప్రొబేషన్‌ పీరియడ్‌ అయిపోయిన తర్వాత ఏటా 15 క్యాజువల్‌, 30 ఎర్న్‌డ్‌ లీవ్‌లు ఉంటాయి. వాటిని వినియోగించుకోకపోతే సర్వీసు రిజిష్టర్‌లో జమ అవుతుంటాయి. సెలవులు వినియోగించుకోని వారు ఏటా నవంబరు నెల వస్తూనే తమకున్న సెలవుల్లో 15 ప్రభుత్వానికి సరెండర్‌ చేసి అందుకు వేతనం పొందుతారు. ఈ విధంగా ఒక ఉద్యోగి జీతం రూ.70 వేలు ఉంటే అతనికి సరెండర్‌ లీవ్‌ కింద రూ.35 వేలు చేతికందుతాయి. వాటితో పండగల సమయంలో వచ్చే అదనపు ఖర్చులను అధిగమిస్తుంటారు. గతంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా ఉద్యోగుల సరెండర్‌ లీవ్‌లకు ఎలాంటి బడ్జెట్‌ కొరత రాకుండా చూసేది. 

అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ఖజానా ఖాళీ చేసింది. అప్పులు తీసుకురావడం కూడా కష్టమైపోతోంది. జిల్లాలో సుమారు 45 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు వివిధ శాఖల్లో ఉన్నారు. వారి జీతాలను బట్టి సగటున రూ.25 వేల వంతున సరెండర్‌ లీవ్‌లకు వేసినా ఇంచుమించు రూ.112.50 కోట్ల బడ్జెట్‌ జిల్లాకి అవసరమౌతుంది. నవంబరు నెల ప్రారంభంలోనే ఉద్యోగులు సరెండర్‌ లీవ్‌లు ఎన్‌క్యాష్‌ చేసుకొనేందుకు డీడీవోలకు దరఖాస్తులు అందజేశారు. 

Flash...   పిల్లలిక్కడ.. బడి ఎక్కడో!

అయినప్పటికీ ఇప్పటివరకు వారి ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఈ విషయాన్ని తమ రాష్ట్రస్థాయి సంఘాల నాయకులకు కూడా నివేదించారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. తమతో కరోనా విధులు, ప్రస్తుతం ఇళ్ల పట్టాలు, వరదల సమయంలో పంట నష్టం లెక్కింపు, ఎన్నికల విధులు వంటివి  చేయిస్తూ కూడా తమకున్న హక్కు అయిన సరెండర్‌ లీవ్‌లకు నగదు విడుదల చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం సంక్రాంతి పండగ లోపు అయినా బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ ఇవ్వాలని కోరుతున్నారు.