హెచ్‌ఎం, తెలుగు, హిందీ పండిట్ల జాబితాలో జాప్యం*
*🌻న్యూస్‌టుడే, ఒంగోలు నగరం :* ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారంలో ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం బదిలీలపై తాజా షెడ్యూలు అనివార్యమైంది. అదే తరహాలో తెలుగు, హిందీ పండిట్ పోస్టుల అంశం కూడా ఎటూ తేలకుండా ఉంది. గతేడాది వీటిని అప్‌గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించారు. ఆ విధంగా వారు చేరిన స్థానాలను కూడా ఖాళీలుగా చూపించాలని నిర్ణయించారు. దీనిపై పదోన్నతులు పొందిన వారు, ఇప్పటికే సీనియర్లుగా కొనసాగుతున్న తెలుగు, హిందీ పండిట్‌ల మధ్య రగడ సాగుతోంది. అప్‌గ్రేడ్ పోస్టులను ఖాళీలుగా చూపవద్దని కొందరు, చూపాలని మరొకొందరు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఇంకొందరు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఖాళీలుగా చూపితే గత సంవత్సరం జిల్లాలో అప్‌గ్రేడ్ పోస్టుల్లో చేరిన 845 మంది కూడా మళ్లీ తప్పనిసరి బదిలీకి దరఖాస్తు చేసుకోవాల్సివస్తుంది.
*♦హెచ్‌ఎంలకు రీ షెడ్యూలు…*
ఉన్నత పాఠశాల హెచ్‌ఎంలకు సంబంధించి సవరించిన తాజా షెడ్యూలును విడుదల చేయడంతో జిల్లాలో తిరిగి సీనియారిటీ జాబితా తయారు చేసే ప్రక్రియ చేపట్టనున్నారు. అయిదు అకడమిక్ సంవత్సరాలు నిండిన వారినందర్నీ తప్పని సరి బదిలీ జాబితాలో చేర్చాలని నిర్ణయించారు. గతంలో ఒకే చోట అయిదేళ్లు పూర్తిగా సర్వీసు నిండిన వారినే జాబితాలో చేర్చారు. ఆ విధంగా అయితే 122 మంది బదిలీ అవుతారు. తాజా ఉత్తర్వుల ప్రకారం మరో 40 మందికి స్థానచలనం ఉంటుందని అంచనా. కొత్త షెడ్యూలు ప్రకారం కొత్త ఖాళీలను ప్రకటించారు. మంగళవారం నుంచి 16వ తేదీ వరకు కొత్తగా ప్రకటించిన ఖాళీలను కూడా తమ ఆప్షన్లలో పెట్టుకునేందుకు వీలు కల్పించారు. 17, 18 తేదీల్లో సీనియారిటీ జాబితా ప్రకటిస్తారు. దీంతో హెచ్‌ఎం, తెలుగు, హిందీ ఉపాధ్యాయుల బదిలీలు ఆలస్యం కానున్నాయి. మిగిలిన వారికి రెండు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయని భావిస్తున్నారు. డీఈవో కార్యాలయంలోని ఐటీ సెల్ సిబ్బంది కమిషనర్ కార్యాలయంలోనే ఉన్నారు. ఉత్తర్వులు విడుదలకు ముందు ఏమైనా లోపాలు ఉంటే సవరించడానికి వారిని అందుబాటులో ఉంచుకున్నారు.