టీచర్ల బదిలీలు బ్లాక్‌లో.. బ్లాక్‌ చేసిన స్థానాలను కేటాయిస్తూ ఉత్తర్వులు

స్పౌజ్‌ ఒక చోట.. ఆర్డర్లు మరో చోటకు..

నిబంధనలకు తిలోదకాలు..

అక్రమార్కులతో  సీనియర్లకు అన్యాయం

ఇదివరకు సినిమా టికెట్లే బ్లాక్‌లో దొరికేవి.. ఇప్పుడు టీచర్ల బదిలీ స్థానాలు కూడా బ్లాక్‌లో అందుబాటులో ఉన్నాయి.. బదిలీల్లో ఈసారి చాలా స్థానాలను బ్లాక్‌ చేయటంపై విమర్శలు వెల్లువెత్తాయి.. ఇది మామూలేనంటూ విద్యాశాఖ  మంత్రే  చెప్పుకొచ్చారు.. ఇప్పుడు వాటికి కూడా అక్రమంగా పోస్టింగ్‌  ఇస్తుండటం పారదర్శకతా? ఉన్నతాధికారులే సమాధానం చెప్పాలి..

అనంతపురం విద్య, జనవరి 19: ఉపాధ్యాయుల బదిలీల్లో అక్రమార్కుల హవా నడుస్తోంది. దరఖాస్తు చేసినప్పటి నుంచి బదిలీల ఆర్డర్లు పొందే వరకూ అడుగడుగునా అక్రమాలే. కొందరు అక్రమార్కులకు హద్దే లేకుండా పోతోంది. ఆప్షన్ల సమయంలో బ్లాక్‌ చేసినట్లు చూపిన స్థానాలకూ కొందరు ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు జారీ కావటం ఆ శాఖలో పెద్ద దుమారానికి తెర తీస్తోంది. నిబంధనలకు పాతరేస్తూ.. కొందరు ఉపాధ్యాయులు, అధికారులు అక్రమాలకు పాల్పడటంపై పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 7,458 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 20 మంది కోర్టును ఆశ్రయించారు. 7438 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఇప్పటివరకు 3,195 మందికి బదిలీల ఉత్తర్వులు జారీ అయ్యాయి. పైరవీలు, అక్రమాలతో బ్లాక్‌ చేసిన స్థానాలకు సైతం బదిలీ ఉత్తర్వులివ్వటంతో సీనియర్లకు తీరని అన్యాయం వాటిల్లింది.

ఆది నుంచీ అదే తీరు

ఉపాధ్యాయ బదిలీల్లో మొదట్నుంచీ అక్రమార్కులు హల్‌చల్‌ చేస్తున్నారు. దరఖాస్తు చేసే నాటి నుంచి ఆర్డర్లు అందుకునే వరకూ బదిలీల్లో చోటుచేసుకున్న అక్రమాలు చూస్తుంటే.. వెబ్‌ కౌన్సెలింగ్‌ అంతా మిథ్య అన్న వాదనలు వినిపిస్తున్నాయి. పామిడి మండలంలోని ఓ పాఠశాల నుంచి ఓ మహిళా ఎస్‌జీటీ బుక్కరాయసముద్రం (బీకేఎస్‌) మండలంలోని 20 శాతం హెచ్‌ఆర్‌ఏ స్థానానికి వచ్చింది. ఆమె భర్త శింగనమలలో పనిచేస్తున్నారు. ఈ మేరకు ఆమె స్పౌజ్‌ కేటగిరీ కింద శింగనమల మండలానికి ఆప్షన్‌ ఇవ్వాలి. బదిలీ ఉత్తర్వు కూడా  ఆమెకు ఆ మండలానికి రావాలి. ఆమెకు ఏకంగా బీకేఎ్‌సలోని ఓ పాఠశాలకు బదిలీ ఉత్తర్వు రావటం వెనుక భారీగా పైరవీలకు తెరలేపారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నార్పల మండలంలోని ఓ పాఠశాలలో రెండు సోషల్‌ స్టడీస్‌ (ఎస్‌ఎస్‌) టీచర్‌ పోస్టులుండగా ఒకటి బ్లాక్‌ చేశారు. బదిలీల్లో ఒక పోస్టుకు మాత్రమే ఆప్షన్‌ ఇచ్చుకునే అవకాశం ఇచ్చారు. అంటే ఆ పాఠశాలకు ఒక టీచర్‌ మాత్రమే బదిలీ ఆర్డర్‌ కాపీతో వెళ్లాల్సి ఉంది. ఇద్దరు ఉపాధ్యాయులు ఆర్డర్‌ కాపీలు తీసుకుని, వెళ్లినట్లు సమాచారం. ఉన్న ఒక్క ఖాళీకి ఇద్దరెలా వెళ్తారన్నది అనేక సందేహాలకు తావిస్తోంది.

Flash...   SBI Offers: SBI రూ.40,000 డిస్కౌంట్ ఆఫర్.. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వాడే వారికి బ్యాంక్ శుభవార్త!

ఆన్‌లైన్‌లో వివరాలేవీ…?

ఆన్‌లైన్‌లో బదిలీల వివరాలు పెట్టకుండా టీచర్లు అభ్యంతరాలు తెలపాలంటూ చెబుతుండటంపైనా విమర్శలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 7,458 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో  హిందూపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం తదితర ప్రాంతాల నుంచి 20 మంది వరకూ కోర్టును ఆశ్రయించగా.. 7438 మంది బదిలీల ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో తప్పనిసరి బదిలీ కావాల్సిన టీచర్లు 2454 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన 64 మందిని ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ నుంచి తిరస్కరించారు. ఇప్పటి వరకూ 3195 మంది టీచర్లు బదిలీ ఉత్తర్వులు అందుకున్నారు. వారిలో ఎస్‌జీటీలు 1986, ప్రైమరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయు లు 105, స్కూల్‌ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్‌) 373, స్కూల్‌ అసిస్టెంట్లు (నాన్‌ లాంగ్వేజెస్‌) 731 మంది ఉన్నారు. ఇంకా కొందరికి ఉత్తర్వులు రావాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా చాలా మండలాల్లో స్పౌజ్‌ కేటగిరీని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో వేలాది మంది టీచర్ల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచితే ఏ టీచర్‌ ఏ స్కూల్‌ నుంచి ఏ స్కూల్‌కు, ఏ కేటగిరీ కింద బదిలీ అయ్యారో తెలుస్తుంది. అక్రమాలకు పాల్పడి ఉంటే గుర్తించి, ఫిర్యాదు చేయొచ్చు. వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచకుండా అ భ్యంతరాలు తెలపమని విద్యాశాఖ చెబుతుండటంపైనా విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు జిల్లాలో చోటుచేసుకున్న అక్రమాలపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి