ఇక ఉదయం 9 గంటల నుంచే పాఠశాలలు , స్కూళ్లలో పిల్లల హాజరుపై దృష్టి,

 స్కూళ్లలో పిల్లల హాజరుపై దృష్టి, 

ఇందుకోసం ప్రత్యేక యాప్‌.. గైర్హాజరైతే తల్లిదండ్రులకు మెసేజ్‌

రెండో రోజూ రాకపోతే వలంటీర్‌ ఆ పిల్లల ఇంటికెళ్లి వివరాలు కనుక్కోవాలి

మన బడి నాడు–నేడు, మధ్యాహ్న భోజన పథకంపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ 

ఫిబ్రవరి 15 నుంచి యాప్‌ ద్వారా హాజరు సేకరిస్తామన్న అధికారులు  

రూ.4,446 కోట్లతో ఏప్రిల్‌ 15 నుంచి రెండో విడత నాడు–నేడు పనులు 

పనుల్లో, భోజనం నాణ్యతలో రాజీ పడకూడదని సీఎం ఆదేశం

సులభ్‌ ఇంటర్నేషనల్‌కు టాయిలెట్ల నిర్వహణ బాధ్యత  

ఉదయం పూట త్వరగా తరగతులు ప్రారంభించాలని సూచన

సాక్షి, అమరావతి: స్కూళ్లలో పిల్లల హాజరు వివరాలను ప్రత్యేక యాప్‌ ద్వారా సేకరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. స్కూళ్లకు పిల్లలు గైర్హాజరైతే వెంటనే ఎస్‌ఎంఎస్‌ ద్వారా తల్లిదండ్రులకు మెసేజ్‌ వెళ్లాలని స్పష్టం చేశారు. రెండో రోజు కూడా పాఠశాలకు రాకపోతే నేరుగా సంబంధిత వలంటీర్‌ను ఆ పిల్లల ఇంటికి పంపి, ఎందుకు రాలేదో వివరాలను కనుక్కోవాలని చెప్పారు. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. మన బడి నాడు–నేడు, విద్యార్థుల హాజరు, గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు పునఃప్రారంభం, విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. విద్యార్థుల హాజరుపై యాప్‌ను రూపొందించారా? లేదా? అని ప్రశ్నించారు. ఫిబ్రవరి 15 నుంచి యాప్‌ ద్వారా పిల్లల హాజరు సేకరిస్తామని అధికారులు వెల్లడించారు.

ఇక ఉదయం 9 గంటల నుంచే పాఠశాలలు   

రాష్ట్రంలోని పాఠశాలలన్నీ ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉదయం వేళ సాధ్యమైనంత త్వరగా స్కూళ్లలో బోధన ప్రారంభించడం మంచిదని సూచించారు. ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం బాగా ఉంటుందని, వారి మెదడు కూడా విషయాలను శీఘ్రంగా గ్రహించగలుగుతుందని, ఆ సమయంలో పాఠ్యబోధన సాగిస్తే పిల్లలు ఆయా అంశాలను త్వరితంగా, లోతుగా అవగాహన చేసుకోగలుగుతారన్నారు.

Flash...   SLEEPING PROBLEM IN YOUTH: యువతలో పెరుగుతున్న నిద్ర లేమి సమస్య

ప్రపంచంలో పాఠశాలలన్నీ ఉదయం 8 లేదా 8.30 గంటలకల్లా ప్రారంభమవుతున్నాయని, అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఆలస్యంగా 9.30కు ప్రారంభం కావడం వల్ల అనుకున్న ఫలితాలను సాధించడానికి వీలుండదన్న చర్చ జరిగింది. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని పరిష్కరించుకొని రాష్ట్రంలో కనీసం 9 గంటలకల్లా స్కూళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉదయం త్వరగా ప్రారంభించి, ఆ మేరకు సాయంత్రం త్వరగా తరగతులు ముగించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాగా,  పాఠశాలల వేళలపై గురువారం ఉత్తర్వులు జారీ చేస్తామని విద్యాశాఖ అధికారులు వివరించారు.