ఆత్మకూరు మండలం నాగులపాడు ప్రాథమిక పాఠశాలలో 29 మంది విద్యార్థులు విద్యను
అభ్యసిస్తుండగా- ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. అత్యవసర సమయంలో ఆయన సెలవు పెడితే…
ఇక బడికి తాళం వేయాల్సిందే.
ఆత్మకూరు మండలం నాగులపాడు ప్రాథమిక పాఠశాలలో 29 మంది విద్యార్థులు విద్యను
అభ్యసిస్తుండగా- ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. అత్యవసర సమయంలో ఆయన సెలవు పెడితే…
ఇక బడికి తాళం వేయాల్సిందే
అనంతసాగరం మండలం మినగల్లు ప్రాథమిక పాఠశాలలో 31 మంది చదువుతుండగా- ఇక్కడా ఒక్కరే
ఉపాధ్యాయుడు. ఆయన రాకపోతే.. ఈ పాఠశాలలో డిప్యుటేషన్ పై పని చేసేందుకు ఇతరులు
ముందుకు రావడం లేదు
వాకాడు మండలం పూడిరాయదొరువు ప్రాథమిక పాఠశాలలో 61 మంది విద్యార్థులు ఉండగా- ఇక్కడ
పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు ఇటీవల బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఒక్కరూ
లేకపోవడంతో.. రోజూ డిప్యుటేషన్‌పై నియమిస్తూ.. బోధన సాగిస్తున్నారు
భావి భారత భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందన్నది ఎంత సత్యమో… ప్రాథమిక
పాఠశాలల్లో నేర్చుకునే అభ్యాసాలే భవిష్యత్తుకు నాంది అన్నదీ అంతే నిజం. అలాంటి
ప్రాథమిక విద్యను బోధించే ఉపాధ్యాయుల కొరత జిల్లాలో వేధిస్తోంది. కేవలం ఒకే ఒక్క
ఉపాధ్యాయుడితో 918 ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధన సాగుతుండటం పరిస్థితికి అద్దం
పడుతుండగా- ఇటీవల జరిగిన బదిలీలతో 69 పాఠశాలల్లో అసలు ఉపాధ్యాయులే లేకుండా
పోయారు. నాడు-నేడు పనుల ద్వారా మౌలిక వసతులు సమకూరుతున్నాయి. దీంతో ప్రభుత్వ
పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ, ఉపాధ్యాయుల కొరతే తీరకుండా
ఉంది. ప్రతి విద్యా సంవత్సరంలోనూ ఈ సమస్య పునరావృతమవుతున్నా.. అధిగమించే చర్యలు
మాత్రం నామమాత్రమే అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులపై
సమీక్షించి.. రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించాల్సిన అధికారులు ఈ విషయంలో
పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు నెలకొన్నాయి. సుమారు 1359 మంది
ప్రాథమిక ఉపాధ్యాయులు జిల్లాలో అవసరం ఉందని విద్యావేత్తలు చెబుతుండగా- సమస్యను
పరిష్కరించాలని నిరసనలు చేపట్టినా ఫలితం లేకపోతోందని ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి
వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా సమస్యను అధిగమించే చర్యలు చేపట్టాలని
కోరుతున్నారు
విద్యాహక్కు చట్టం ప్రకారం ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండరాదు. దాని వల్ల విద్యార్థులు
విద్యలో వెనుకబడిపోతారని విద్యావేత్తల మాట. కనీసం పాఠశాలలోని విద్యార్థుల సగటును
దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది. ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ
తరగతి వరకు ఉన్న విద్యార్థులకు నాలుగు పాఠ్యాంశాలు బోధిస్తారు. అందరిని కలిపి ఒకే
చోట ఉంచి ఒక్కో పాఠ్యాంశం బోధిస్తుండంతో ఆయా పాఠ్యాంశాల్లో కొందరు విద్యార్థులు
వెనుకబడిపోతున్నారు. ఒక్కో తరగతిలో 20 నుంచి 50 మంది విద్యను అభ్యసిస్తున్నారు.
వీరికి కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. కానీ, ఒకే ఉపాధ్యాయుడితో
కానిచ్చేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే మరో 918 మంది ఉపాధ్యాయులు అవసరం.
కానీ, ఆ దిశగా చర్యలు కొరవడ్డాయి