సాంకేతీకరణతోనే మాతృభాషల పరిరక్షణ

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

World-Mother-Language-Day

ప్రపంచంలోని అత్యధిక భాషలు మాతృభాషా దినాన్ని ఉత్సవంలా కాకుండా మాతృభాషా
‘దినాలు’గా జరుపుకునే దుస్థితి దాపురించింది. మాతృభాషలు బతకాలంటే విద్యా,
పరిపాలనా మాధ్యమాలుగా కొనసాగడం మొదటి మార్గం. రెండవది, ముఖ్యమైనది డిజిటల్
మార్గం. ఈ డిజిటల్ యుగంలో అందిపుచ్చుకోవల్సిన మార్గం భాషలను ఎలక్ట్రానిక్
రూపంలోకి మార్చటం. ఇక్కడ భాషలను అంటున్నామంటే మాతృభాషల్లో లభ్యమవుతున్న సమస్త
జ్ఞాన సంచయం. భాషా వినియోగ సందర్భాలు ఇంతకుమునుపులా విద్య, పరిపాలన, సంప్రదాయ
మీడియాల్లోనే కాకుండా ఈ పదేళ్ళ కాలంలో విప్లవాత్మకంగా మారిపోయాయి. నేడు
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగునేల మీద భాషా ఉద్యమాలన్నీ ‘మాతృభాషా పరిరక్షణ’
పేరుతో ఉద్యమిస్తున్నది పైన పేర్కొన్న మొదటి మార్గంలోనే మాతృభాష విద్యా, పరిపాలనా
మాధ్యమంగా ఉండాలనే ‘చిన్న కోరిక’ మాత్రమే భాషాపరిరక్షణకు సరిపోదు. అదే నిజమైతే
ఇంగ్లీషు ఇవాళ ప్రపంచాన్ని శాసించదు. నేడు ఇంగ్లీషు ఇంతలా ‘గిరాకీ’ ఉన్న భాషగా
మారటానికి ఎన్ని దేశాల్లో లేదా ఎన్ని ప్రాంతాల్లో మాధ్యమ భాషగా చలామణిలో ఉంది?
అని ప్రశ్న వేసుకుంటే సరిపోతుంది. కేవలం అది మాత్రమే ఇంగ్లీషును రాజ భాష చేయలేదు.
నేడు సమస్త జ్ఞానమంతా ఇంగ్లీషులో లభ్యమవడం మాత్రమే దానికి ఆ స్థాయిని
కల్పించింది.

tech-mother-tongue

ఇది సమాచార విప్లవ యుగం. ఎవరి దగ్గర ఎక్కువ సమాచారం ఉంటే వారికి అంత ‘మార్కెట్’
ఉంటుంది. ఏ భాష ఎక్కువ జ్ఞానాన్ని, సమాచారాన్ని అందించగలగుతుందో ఆ భాషకు అంత
వాడుక, ప్రాధాన్యం పెరుగుతాయి. సమాచారమంటే కేవలం శాస్త్ర సంబంధమైనదని మాత్రమే
అనుకోనక్కర్లేదు. పుట్టుక నుంచి చావు వరకు మనిషి ఎదుర్కొనే అనేక సందర్భాలను
‘దాటగలగటానికి’ కావలసిన సమస్త సమాచారాన్ని ఆడియో, వీడియో, అక్షరాల రూపంలో
అందుబాటులో ఉంచడం. ‘నా మాతృభాషలో దేనికి సంబంధించిన విషయమైనా నాకు అంతర్జాలంలో
దొరుకుతుంది’ అని నమ్మకం కుదిరిననాడు భాషను రక్షించండని ఎవరో ఉద్యమాలు
చేయక్కర్లేదు. భాష బతుకుతుంది. కేవలం బతకడమే కాదు అది బతుకునూ ఇస్తుంది. సమాచారం
ఉన్నవాడు ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో బతుకగలుగుతారనే విషయం వేరే
చెప్పనక్కర్లేదు. కరోనా కాలంలో భౌతిక సంబంధాలన్నీ తెగిపోయి, పెరిగిన ఇంటర్నెట్
వాడకం, తెలుగు కేంద్రంగా తెలుగువారు చేసిన ప్రయోగాలు ఈ అభిప్రాయానికి మరింత
బలాన్నిస్తున్నాయి.

Flash...   విట్ లో మెరిట్ స్కాలర్షిప్స్

‘డిజిటలైజేషన్’ అనేది గడిచిన దశాబ్దకాలంగా తరుచూ వినిపిస్తున్న మాట. రేషన్‌కార్డు
మొదలుకుని వ్యక్తిగత ఆస్తుల వివరాల వరకు డిజిటలైజ్ చేయాలని తెలుగు ప్రభుత్వాలు
సన్నాహాలు చేస్తున్న విషయం మనందరికీ అనుభవమే. గ్రంథాలయాలు, ప్రాచీన లిఖిత
గ్రంథాలను కూడా డిజిటలైజ్ చేయడానికి అరకొరగానైనా ప్రభుత్వాలు నిధులు మంజూరు
చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని లక్షల గ్రంథాలను డిజిటలైజ్ చేసి పిడిఎఫ్ రూపంలో
భద్రపరిచారు. కచ్చితంగా ఇది భారత సమాచార పరిరక్షణా విప్లవంలో ఒక ముందడుగే. కానీ,
డిజిటలైజ్ చేసి, భద్రపరిచిన సమాచారాన్ని వాడటంలో చాలా పరిమితులున్నాయి. కేవలం
చదువుకోవడానికి, రిఫరెన్సులు తీసుకోవడానికే ఈ సమాచారం పనికొస్తోంది. డిజిటలైజ్
చేసిన సమాచారాన్ని వాడటంలో భాషా, సమాచార వినియోగదారుడు సమయం, శ్రమ ఎక్కువ
వెచ్చించాల్సి ఉంటుంది. ఇంత శ్రమించి చేసిన ఉత్పత్తిలో (అవుట్‌పుట్)
నిర్మొహమాటంగా చెప్పాలంటే కచ్చితత్వం, వివిధ ఆకరాల విశ్లేషణ పరిమితంగానే ఉంటుంది.
కనుక, ఆ డిజిటల్ సమాచారాన్నంతా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లోకి మార్చుకోవలసిన అగత్యం,
అనివార్యత చాలా ఉంది. సమాచారాన్ని వినియోగించుకోవడానికి యూనికోడ్ ఫాంటులో అందరికీ
అందుబాటులో (ఓపెన్ సోర్స్/ యూజర్ ఫ్రెండ్లీ) ఉంచేలా చేయడమే ఎలక్ట్రానిక్ ఫార్మాట్
ప్రధాన ఉద్దేశ్యం. ఇలా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోకి వచ్చిన సమాచారాన్ని
వినియోగదారుడు తనకు నచ్చిన రీతిలో, అవసరమున్నంత మేరకు కాపీ చేసుకొని, ఎడిట్
చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక పదమో, పదబంధమో టైపు చేస్తే, ఆ ప్రయోగానికి
సంబంధించిన భిన్నమైన తెలుగు సమాచార నిధులనుంచి సమాచారాన్ని సెకనులో మన కళ్ళ
ముందుంచుతుంది. స్మార్ట్‌ఫోన్ ద్వారా ప్రపంచాన్ని అరచేతిలో పట్టుకుంటున్న ఈ
తరానికి కావలసింది ఇదే. పూర్వ తరాల జ్ఞానసంపదనీ ఈ తరాలకు అవసరమైన సమచారాన్నీ
అందించగలిగినప్పుడే ఏ మాతృభాష అయినా బతుకుతుంది.

తెలుగు సమాచారాన్ని ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లోకి తీసుకురావడానికి వ్యక్తిగతంగా,
సంస్థాగతంగా పనిచేస్తున్న సంస్థలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మొట్టమొదట తెలుగు
వికీపీడియాను పేర్కొనాలి. ఆంధ్రభారతి వెబ్‌సైట్, వివిధ వార్తా చానళ్ళ
వెబ్‌సైట్‌లు తెలుగు సమాచార నిధుల కూర్పు కోసం ఇతోధికంగా తోడ్పడుతున్నాయి.
అంతర్జాలంలో నడుస్తున్న వందలకొలది మ్యాగజైన్‌లు ఎన్నో ఉన్నాయి. వారందరికీ వేనవేల
వందనాలు. చేయి చేయి కలుపుదాం భాషా సాంకేతీకరణలో భాగమవుదాం. మాతృభాష కోసం
ప్రాణాలర్పించిన వారికి ఇదే నిజమైన, ఆచరణాత్మకమైన నివాళి.

Flash...   చంద్రుడిపై అద్భుతం జరగబోతుందా.. ప్రపంచం కళ్లన్నీ మళ్లీ ఇస్రో వైపే!

డా. చంద్రయ్య ఎస్

అసోసియేట్ ఫెలో, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం