వారి ఆత్మగౌరవాన్ని వైసీపీ మంటగలిపింది: పవన్
పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గాదె పేరు ప్రకటన

అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): చదువుతో పాటు లోకజ్ఞానాన్ని, మంచి నడవడికను
నేర్పించే ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని వైసీపీ ప్రభుత్వం మంటగలిపిందని జనసేన
అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కృష్ణా, గుంటూరు
జిల్లాల జనసేన నేతలతో హైదరాబాద్‌లో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై చర్చించారు. ఈ నేపథ్యంలో న్యాయవాది గాదె వెంకటేశ్వరరావు
పేరును ప్రతిపాదించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడతూ.. ఉపాధ్యాయులను బ్రాందీ
షాపుల్లో పద్దులు రాయడానికి, వైన్‌షాపుల ముందు క్యూలైన్లు సరిచేసే పనులకు
ఉపయోగించి అవమానించారని మండిపడ్డారు. ఈ పరిస్థితులు మారాలంటే శాసన మండలిలో
ఉపాధ్యాయుల సమస్యలు వినిపించడానికి బలమైన గొంతు అవసరమని, అలాంటి వ్యక్తే ప్రముఖ
న్యాయవాది గాదె వెంకటేశ్వరరావు అని అన్నారు. ‘‘మండలిలో ఉపాధ్యాయ ప్రతినిధులను
ఎన్నుకోవడానికి త్వరలో ఎన్నిక జరగబోతోంది.
ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, వారి ఆత్మగౌరవం
కాపాడడానికి రాజ్యాంగ నిర్మాతలు ఈ అవకాశాన్ని కల్పించారు’’ అని అన్నారు.
ప్రస్తుతం ఏపీలో లక్షలాది మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు భావిభారత పౌరులను
తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారన్నారు. అలాంటి వారిని అనేక సమస్యలు
పీడిస్తున్నాయన్నారు. ముఖ్యంగా గత ఐదేళ్లుగా కొత్త పీ రివిజన్ కమిషన్ కోసం
ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారని, పీఆర్‌సీని రివైజ్ చేయాలని ఎన్నిసార్లు
విన్నవించినా ప్రభుత్వాలు స్పందించలేదన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు
అప్పగించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. అమ్మఒడి, నాడు-నేడు వంటి పథకాల
నిర్వహణ పనులను కూడా ఉపాధ్యాయులపై మోపారని విమర్శించారు. ఈ పరిస్థితి మారాలంటే
కుల, మతాలకు అతీతంగా ఏ సమయంలోనైనా ప్రజలకు అండగా నిలబడే గాదె వెంకటేశ్వరరావు
లాంటి వ్యక్తులు మండలికి వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.