Andhra Pradesh: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో.. ఏపీ ప్రభుత్వం మళ్లీ కట్టుదిట్టమైన చర్యలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఓ ప్రాంతాన్ని మళ్లీ రెడ్ జోన్‌గా ప్రకటించింది.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం సైతం ఈ అంశంపై మళ్లీ దృష్టి పెట్టింది.
గతంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నట్టుగానే మళ్లీ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు కీలక అడుగులు వేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన చోట్లలో మళ్లీ రెడ్ జోన్ విధించారు.
చిత్తూరు నగరంలోని కేశవరెడ్డి పాఠశాల, శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ వైరస్ నియంత్రణ చర్యలను ముమ్మరం చేశారు.
ఈ రెండు విద్యా సంస్థల్లోనూ గురువారం ఉదయం సోడియం హైఫోక్లోరైట్ పిచికారి చేయించారు. వారం రోజుల పాటు పాఠశాల మూసి వేయాల్సిందిగా యాజమాన్యాలకు అదేశాలు జారీ చేశారు.
కరోనా పాజిటివ్‌గా గుర్తించబడిన విద్యార్థుల తరగతి గదిలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు చిరునామాలను సేకరించి, వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. పాఠశాల, కళాశాల వద్ద రెడ్ జోన్ ఏర్పాటు చేశారు.