NEP తో ఉపాధ్యాయులకు ముంచుకొస్తున్న ముప్పు


ఉపాధ్యాయ నియామక విధానం ప్రస్తుతం జిల్లా యూనిట్‌గా ఉండే ఖాళీలకు డి.ఎస్‌.సి ద్వారా జరుగుతుండగా కొత్త విధానం ప్రకారం స్కూల్‌ కాంప్లెక్స్‌ యూనిట్‌గా జరుగుతాయి. ప్రస్తుతం విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాల వారీగా విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి లెక్కిస్తారు. కానీ కొత్త విధానం ప్రకారం స్కూల్‌ కాంప్లెక్స్‌ ఆధారంగా విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి తీసుకుంటారు. అంటే ఉపాధ్యాయుడు పాఠశాలకు చెందినవాడిగా కాక … స్కూల్‌ కాంప్లెక్స్‌కు చెందిన వాడిగా మారి …ఆ కాంప్లెక్స్‌ పరిధిలోని స్కూళ్లన్నిట్లోనూ బోధించవలసి ఉంటుంది. ఫలితంగా ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది.

‘జాతీయ విద్యా విధానం-2020’ ఉపాధ్యాయులకు సంబంధించి తీవ్ర ప్రతికూలమైన ప్రతిపాదనలు చేసింది. నియామకాలు, ఉద్యోగోన్నతులు, అర్హతలు, వేతనాలు, బదిలీలు వంటి అంశాల్లో ప్రస్తుతం అరకొరగా వున్న హక్కులను సైతం ఉపాధ్యాయులు పూర్తిగా కోల్పోతారు. ఉపాధ్యాయులకు సమాంతరంగా ఒక పెద్ద వాలంటరీ వ్యవస్థ ఏర్పడబోతున్నది. దాంతో ఉద్యోగ భద్రత పోవడమేగాక ఉపాధ్యాయుల హోదాని కూడా తగ్గిస్తుంది. వారు కార్పొరేట్‌ సంస్థలలో పని చేసే కార్మికులుగా మారతారు. విద్యా విధానంలో ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి భాగస్వామ్యాన్ని కూడా రద్దుపరిచి పాలకులు రూపొందించే కార్యక్రమాలను అమలుచేసే వారిగా మిగిలిపోతారు. స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తిని కోల్పోతారు. ఉపాధ్యాయుల, అధ్యాపకుల జీతభత్యాలను, విద్యా వ్యయం వంటి భారాలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ విధానాల రూపకల్పనను కేంద్రం చేతుల్లో పెడుతోంది. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలుకావటానికి ఉపాధ్యాయులే కీలక పాత్ర పోషించాలని ఒకవైపు ప్రధానమంత్రి ఊదరగొడుతుంటే, మరోవైపు మన రాష్ట్ర ఎన్‌ఇపి అమలుకు చూపుతున్న ఉత్సాహం ఉపాధ్యాయులను పెనం నుంచి పొయ్యిలో పడేసే విధంగా ఉంది. ఉపాధ్యాయుల గురించి చేసిన ప్రతిపాదనలు వారికి పెనుప్రమాదం తెచ్చి పెట్టేలా ఉన్నాయి.

నియామక అర్హతలు
    2030 నాటికి ఉపాధ్యాయుల కనీస అర్హత 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బిఇ.డి కనీస అర్హతగా వుంటుంది. 5ం3ం 3ం4 లలో అన్ని దశలకు పరిమితంగా ఉంది. అంటే పూర్వ శిశువిద్య నుండి సెకండరీ దశ వరకు అవే అర్హతలు. ఈ అర్హతలను టీచింగ్‌ యూనివర్సిటీల నుండి పొందాలి. కొత్త విధానానికి అనుగుణంగా ‘టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌’ (టి.ఇ.టి)ను ప్రస్తుతమున్న 2 భాగాలుగా కాక నాలుగు భాగాలుగా విడదీస్తారు. ఎన్‌.టి.ఎ దీనితో పాటు సబ్జెక్ట్‌ల వారీగా పరీక్షను, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. టి.ఇ.టి అర్హత సాధించిన వారు డెమో ఇవ్వాలి. ”ఇంటర్వ్యూ ఉపాధ్యాయ నియామకాల్లో అంతర్భాగంగా ఉంటుంది” అని ఎన్‌ఇపి పేర్కొంది. అన్ని స్థాయిలకు ఒకే విద్యార్హతలు, ఎన్‌.టి.ఎ పరీక్షలు, డెమో, ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వుంటుంది. ఈ అర్హతలు బోధనకు, విద్యార్థులకు మేలు చేయకపోగా ఉపాధ్యాయ నియామకాలలో పేదలు, ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి సామాజిక తరగతులు, వెనుకబడిన ప్రాంతాల విద్యార్ధులు పూర్తిగా వెలివేతకు గురవుతారు. ఒక రకమైన ఆధిపత్య భావజాలం ఇంటర్వ్యూ, డెమోలను ప్రభావితం చేసే ప్రమాదముంది. ఆధిపత్య సామాజిక తరగతుల వారే భవిష్యత్తులో ఉపాధ్యాయులవుతారు. ప్రస్తుతం దూర విద్య, వృత్యంతర విద్య, వివిధ రకాల అర్హతలతో ఉపాధ్యాయులు అవుతున్నవారు … కొత్త విధానం వల్ల భవిష్యత్తులో కాలేరు. ఇది ఒక పెద్ద సామాజిక విభజనకు దారితీస్తుంది.
                                                       నియామక విధానం
    ఉపాధ్యాయ నియామక విధానం ప్రస్తుతం జిల్లా యూనిట్‌గా ఉండే ఖాళీలకు డి.ఎస్‌.సి ద్వారా జరుగుతుండగా కొత్త విధానం ప్రకారం స్కూల్‌ కాంప్లెక్స్‌ యూనిట్‌గా జరుగుతాయి. ప్రస్తుతం విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాల వారీగా విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి లెక్కిస్తారు. కానీ కొత్త విధానం ప్రకారం స్కూల్‌ కాంప్లెక్స్‌ ఆధారంగా విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి తీసుకుంటారు. అంటే ఉపాధ్యాయుడు పాఠశాలకు చెందినవాడిగా కాక స్కూల్‌ కాంప్లెక్స్‌కు చెందిన వాడిగా మారి ఆ కాంప్లెక్స్‌ పరిధిలోని స్కూళ్లన్నిట్లోనూ బోధించవలసి ఉంటుంది. ఫలితంగా ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు బోధనా వృత్తిలో ప్రవేశించడానికి స్కాలర్‌షిప్‌లు ఇస్తామని చెబుతున్నా అది మెరిట్‌ ఆధారంగా ఇవ్వాలని చెబుతున్నారు. ఇది అసమంజసమైనది. ఇటువంటి వారికి స్థానిక ప్రాంతాలలో ఉపాధి కల్పిస్తామని, వీరు లోకల్‌ ఏరియా రోల్‌మోడల్‌గా ఉంటారని చెబుతున్నారు. అంటే వీరిని రెగ్యులర్‌ ఉపాధ్యాయులుగా కాక స్థానిక ఉపాధ్యాయులుగా నియమిస్తారన్నమాట.
                                                జీతం-ఉద్యోగం-పదవీ కాలం
     ఉపాధ్యాయుల పదవీకాలం, ఉద్యోగోన్నతి, జీతం వంటివి ప్రస్తుతం వున్నట్టు సీనియారిటీ ప్రాతిపదికగా కాక మెరిట్‌ ఆధారంగా ఉండాలని గట్టిగా ప్రతిపాదించింది. ఈ ప్రతిభ యొక్క పరిమితులను ప్రతి రాష్ట్రం అమలు చేయాలని చెప్పింది. ఇందుకు ‘నేషనల్‌ ప్రొఫెషెనల్‌ స్టాండర్డ్స్‌ ఫర్‌ టీచర్స్‌’ను ఏర్పాటు చేసి దానికి సాధారణ మార్గదర్శకాలను ఎన్‌.సి.టి.ఇ 2022 నాటికి అభివృద్ధి చేస్తుంది. ఉపాధ్యాయుల సమీక్షలు, హాజరు, నిబద్ధత, నిరంతర వృత్తి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనే సమయం, పాఠశాలకు, సమాజానికి చేసిన సేవలను బట్టి ఉపాధ్యాయునికి ప్రోత్సాహం ఉంటుందని చెప్పింది. అంటే ఉద్యోగోన్నతులకు అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకోరు. వేతనం దాని పెరుగుదల అనేవి ధరలను బట్టి నిర్ణయించాలన్న ప్రస్తుత అవగాహనకు భిన్నంగా ఉపాధ్యాయుడు సాధించే ప్రమాణాల ఆధారంగా మారుతుంది. ఇది కార్పొరేట్‌ తరహా పాలనా పద్ధతి. ప్రస్తుతం ఐదేళ్లకు ఒకసారి హక్కుగా ఉన్న వేతన సవరణ భవిష్యత్తులో ఉండదు. అసమాన ఆర్థిక పరిస్థితులు, సామాజిక అసమానతలు ఉన్న సమాజంలో అసలు ప్రతిభ అనేది ఎలా నిర్ణయిస్తారు? పూర్తిగా కార్పొరేట్‌ సంస్థల ఉద్యోగుల తరహాలో ఉపాధ్యాయుల సర్వీస్‌ కండిషన్లను కూడా మార్చే ప్రయత్నమిది. దశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమం సాధించుకున్న హక్కులపై జరుగుతున్న దాడి ఇది. పదవీ కాలాన్ని టెన్యూర్‌ ట్రాక్‌ పద్ధతిలో అమలు చేయాలని సూచించింది.
                                                     బదిలీల నిలిపివేత !
    బదిలీలను పూర్తిగా నిలిపివేయాలని, అత్యంత ప్రత్యేకమైన పరిస్థితులలో మాత్రమే వాటిని అనుమతించాలని అదీ ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారానే జరపాలని చెప్పింది. దాంతో ఎనిమిదేళ్ళు, ఐదేళ్ళకు ఒకసారి బదిలీ అవకాశాన్ని కోల్పోయినట్లే. ఇది ఉపాధ్యాయ విద్యా వ్యవస్థ యొక్క సమగ్రతకు, వికాసానికి పెద్దగా ఉపయోగపడదు. ఎయిడెడ్‌ మరియు మిషనరీ పాఠశాలల అనుభవమిది.
 ఉపాధ్యాయుల భద్రత- హోదా
    ఉపాధ్యాయ వృత్తి భద్రతను, గౌరవాన్ని బలహీన పరిచే ప్రతిపాదనను కూడా ఎన్‌.ఇ.పి చేసింది. స్కూల్‌ కాంప్లెక్స్‌ నిర్వహణ లోనూ పెద్ద ఎత్తున వాలంటీర్లను నియమించాలని చెప్పింది. విద్యార్ధుల ప్రమాణాలను పెంచడానికి, డ్రాపౌట్‌ సమస్యను అధిగమించడానికి…వాలంటీర్లను, రిటైర్డ్‌ టీచర్లను, ఆర్మీ ఉద్యోగులను, మెరిట్‌ విద్యార్ధులను, పట్టభద్రులను, సామాజిక కార్యకర్తలను, కౌన్సిలర్లను నియమించాలని చెప్పింది. అలాగే స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలో ఆర్ట్స్‌, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌, ఒకేషనల్‌, స్పోర్ట్స్‌, యోగా వంటివి బోధించడానికి స్టూడెంట్‌ కౌన్సిలర్‌, దార్మిక, ధాతృత్వ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను నియమించుకోవాలని చెప్పింది. అంటే రెగ్యులర్‌ ఉపాధ్యాయులకు సమాంతరంగా వాలంటీర్లతో ఒక పోటీ వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ వ్యవస్థ అసమానమైనది. రెండు వేర్వేరు సేవా పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఒకే పని చేస్తారు. స్థానికంగా నియమించుకొనే ఈ వాలంటీర్ల పని పరిస్థితులు, జీతాలు, వారి నియామకం వంటి వాటి పట్ల స్పష్టత లేదు. ఇది పాఠశాలలను ఉపాధ్యాయ వృత్తిని డిఫార్ములేటింగ్‌ చేస్తుంది. విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం సుశిక్షితులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను పొందే హక్కును ఇది కాలరాస్తుంది. ఈ వాలంటీర్ల సమాంతర వ్యవస్థ ఆచరణలో విద్యార్ధులకు ఉపయోగపడదు. పైగా సమాజంలోని కొన్ని సామాజిక తరగతుల ప్రతినిధులు పాఠశాల పనిని మరలా ప్రభావితం చేయడానికి కారణమౌతుంది.
                                                        ప్రయివేటీకరణ
    విద్యా హక్కు చట్టం చెప్పిన దానికి భిన్నంగా…జాతీయ విద్యా విధానం ప్రత్యామ్నాయ పాఠశాలలను ప్రతిపాదించింది. అంటే, విద్యనందించే బాధ్యతను ప్రభుత్వం నుండి ప్రయివేటు వారికి అప్పగించడమే. ప్రైవేట్‌ పాఠశాలల స్థాపనకు అవకాశమివ్వాలని, నియంత్రణా నిబంధనలను సరళతరం చేయాలని, ఫీజులు పెంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలని, ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలలను సమానంగా చూడాలని చెప్పింది. అంటే గతంలో ఏ జాతీయ విద్యా విధానమూ చెప్పని విధంగా ప్రయివేట్‌ రంగానికి వేస్తున్న పెద్ద పీట ఉపాధ్యాయుల ఉనికికే ప్రమాదాన్ని తెస్తుంది.
/ వ్యాసకర్త యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి /
కె. శేషగిరి                                   
Flash...   Medical Reimbursement Claim of employees and Pensioners - Instructions