కేసులు పెరుగుతున్నాయి.. జాగ్రత్త! -ప్రధాని మోదీ

Tesst ‌ల సంఖ్య పెంచండి

‘RTPCR ‌’ అయితే బెటర్‌

టెస్ట్, ట్రేస్, ట్రీట్‌ను సీరియస్‌గా తీసుకోండి; మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌లను ఏర్పాటు చేయండి

వాక్సినేషన్‌ కేంద్రాల సంఖ్య పెంచండి; టీకాల వృధాను అరికట్టండి

రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ ఉద్బోధ. 

 న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు. రెండో వేవ్‌గా పేర్కొంటున్న ఈ పెరుగుదలను అడ్డుకునేందుకు తక్షణమే నిర్ణయాత్మకంగా స్పందించాలని కోరారు. ‘టెస్ట్, ట్రేస్, ట్రీట్‌’ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేయాలన్నారు.

రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ బుధవారం వర్చువల్‌గా సమావేశమై, కరోనా పరిస్థితిని, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సమీక్షించారు. కరోనా వైరస్‌ను అడ్డుకునే శక్తిమంతమైన ఆయుధం టీకాయేనని, అందువల్ల రాష్ట్రాలు టీకా కేంద్రాల సంఖ్యను భారీగా పెంచాలని ప్రధాని సూచించారు. మహారాష్ట్ర, పంజాబ్‌ల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. గత రెండు వారాల్లో దేశవ్యాప్తంగా 70 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 150 శాతానికి పైగా పెరిగిందని ప్రధాని ఆందోళన వెలిబుచ్చారు. దీన్ని అడ్డుకోనట్లయితే, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడే ప్రమాదముందన్నారు. గతంలో కరోనా కేసులు అత్యంత కనిష్టంగా నమోదైన రెండో, మూడో స్థాయి పట్టణాల్లోనూ ప్రస్తుతం కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందన్నారు.

కరోనా మహమ్మారిని భారత్‌ విజయవంతంగా ఎదుర్కోవడానికి కారణం, ఆ వైరస్‌ గ్రామాలకు చేరకపోవడమేనన్న ప్రధాని.. ఇప్పుడు పట్టణాల ద్వారా గ్రామాలకు ఆ వైరస్‌ వ్యాపించే ప్రమాదముందన్నారు. అలా జరిగితే, వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతమున్న యంత్రాంగం సరిపోని పరిస్థితి నెలకొంటుందని హెచ్చరించారు. వైరస్‌ను నిర్ధారించేందుకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలనే ఎక్కువగా చేయాలని, మొత్తం పరీక్షల్లో ఆర్టీపీసీఆర్‌ వాటా 70 శాతానికి పైగా ఉండేలా చూడాలని రాష్ట్రాలను కోరారు. చత్తీస్‌గఢ్, కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు ఎక్కువగా యాంటిజెన్‌ టెస్ట్‌లపై ఆధారపడుతున్నాయని, ఇది సరికాదని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ను సీరియస్‌గా తీసుకోవాలని, అదే సమయంలో టీకాలు వృధా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Flash...   Deputation of Senior Assistants /Junior Assistaqnts /Typists to RJDSE/DEOs/SCERT

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో 10% వరకు టీకాలు వృధా అవుతున్నాయని, యూపీలోనూ అదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చినవారిపై, వారిని కలిసిన బంధుమిత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ‘కరోనాను ఎదుర్కోవడంలో దేశం చూపిన ఆత్మవిశ్వాసం అతివిశ్వాసంగా.. వైరస్‌పై సాధించిన విజయం నిర్లక్ష్యంగా మారకుండా చూసుకోవాలి’ అని సూచించారు. దేశంలో చాలా చోట్ల మాస్క్‌లను ధరించడం లేదన్నారు. ‘దవాయి భీ.. కడాయి భీ’(వైద్యంతో పాటు జాగ్రత్త చర్యలు కూడా) మంత్రాన్ని గుర్తు చేస్తూ.. మాస్క్‌లను ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. అదే సమయంలో, ప్రజల్లో భయాందోళనలు పెరగకుండా చూసుకోవాలని కోరారు.

వైరస్‌ వేరియంట్లను గుర్తించేందుకు వీలుగా శాంపిల్స్‌ను ల్యాబ్స్‌కు పంపించాలని కోరారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని, ఇటీవల ఒకే రోజులో30 లక్షల టీకాలను ఇచ్చారని పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన జిల్లాల జాబితాను కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితిని ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరించారు. పశ్చిమబెంగాల్, చత్తీస్‌గఢ్‌సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేర్వేరు కారణాలతో ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తరువాత ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ కావడం ఇదే ప్రథమం.