టెన్త్, ఇంటర్ పరీక్షలపై రాద్ధాంతం వద్దు.. ప్రతి విద్యార్థికి భరోసా ఇస్తున్నా.. సీఎం జగన్

Jagananna Vasathi Deevena Scheme: టెన్త్‌, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదని, ప్రతి విద్యార్ధి భవిష్యత్‌ కోసం తాను ఆలోచిస్తాని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పాలసీ లేదన్నారు. పరీక్షల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని, టెన్త్‌, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్ధుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. మార్కులను బట్టే ఏ విద్యార్ధికైనా కాలేజీలో సీటు వస్తుందని గుర్తుచేసిన సీఎం జగన్.. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటామని తెలిపారు. కోవిడ్‌పై పోరాటంలో కచ్చితంగా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఆంధప్రదేశ్ వ్యాప్తంగా ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద తొలి విడత ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ ఇవాళ విడుదల చేశారు. రాష్ట్రంలో అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,048.94 కోట్లను విడుదల చేశారు. ఈ మేరకు 2020 2021 సంవత్సరానికి మొత్తం 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి తొలి విడత నగదు జమచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని, విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి విద్యార్ధి ప్రపంచంతో పోటీ పడాలని, చదువుకు పేదరికం అడ్డు కాకూడదని సీఎం జగన్‌ తెలిపారు. ప్రతి ఏడాది రెండు వాయిదాల్లో ‘జగనన్న వసతి దీవెన’ నగదు జమ చేస్తామని పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్ధులకు సాయం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేస్తున్నామని, తల్లులే నేరుగా ఫీజులు కట్టడం వల్ల జవాబుదారీతనం వస్తుందని సీఎం జగన్‌ అన్నారు. కోవిడ్ సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.

Flash...   Capacity Building Trainings to the officers and teachers from the Districts and below leve l- Schedule

ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ‘జగనన్న వసతి దీవెన’ ద్వారా 2,270 కోట్లు ఆర్థిక సాయం చేశామని, తద్వారా విద్యారంగంలో డ్రాప్ అవుట్‌లు తగ్గాయని సీఎం జగన్‌ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ను తీసుకొస్తామని అన్నారు. ఇక నుంచి ‘అమ్మఒడి’ పథకానికి ఆప్షన్లు ఇచ్చామని, అమ్మఒడి పథకం కింద డబ్బు లేదా ల్యాప్‌టాప్ ఇస్తామని సీఎం తెలిపారు. అంగన్‌వాడీలను వైఎస్ఆర్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నామని స్పష్టం చేశారు. నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామన్న సీఎం.. ‘వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం’ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని వివరించారు.

ఇదిలావుంటే, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేల చొప్పున, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులను చెల్లించేందుకు ‘జగనన్న వసతి దీవెన’ కార్యక్రమానికి సీఎం రూపకల్పన చేశారు. ‘జగనన్న వసతి దీవెన’ పథకం ద్వారా ఇప్పటికే రూ.1,220.99 కోట్లను చెల్లించారు. మొదటి విడతగా రూ.1,048.94 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో ఇప్పటివరకు జగనన్న వసతి దీవెన కింద రూ.2,269.93 కోట్లు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం.