ప్రైవేటు అన్‌-ఎయిడెడ్‌ పాఠశాలలు 70 శాతం ఫీజులు వసూలు జీవో అమలు నిలిపివేత

 ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను అడ్డుకోవద్దు

ఫలితాలు వెల్లడించకుండా ఆపొద్దు

ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు హైకోర్టు ఆదేశం

ఫీజు తగ్గింపు జీవో అమలు నిలిపివేత

అమరావతి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి ట్యూషన్‌ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ.. ప్రైవేటు అన్‌-ఎయిడెడ్‌ పాఠశాలలు 70 శాతం ఫీజులు వసూలు చేసేందుకు అనుమతిస్తూ నిరుడు అక్టోబర్లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 57 అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఫీజులు చెల్లించలేదనే కారణంతో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులను క్లాసులకు రానివ్వకుండా అడ్డుకోవద్దని యాజమాన్యాలకు స్పష్టం చేసింది. పరీక్షా ఫలితాలు వెల్లడించకుండా ఉండవద్దని తెలిపింది. ఫీజు బకాయిలను ఆరు వాయిదాల్లో వసూలు చేసుకోవచ్చని సూచించింది. ఫీజు చెల్లింపుపై యాజమాన్యాన్ని సంప్రదించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు వెసులుబాటు కల్పించింది. వారి అభ్యర్థనను యాజమాన్యాలు సానుభూతితో పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుత ఉత్తర్వులు తుది తీర్పుకు లోబడి ఉంటాయని పేర్కొంటూ న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ట్యూషన్‌ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ జారీ చేసిన జీవో 57ను సవాల్‌ చేస్తూ ఇండిపెండెంట్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొద్దులూరి శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. ఫీజు ఖరారులో ప్రభుత్వం కలుగజేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ఫీజుల నిర్ణయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కరోనా నేపథ్యంలో ట్యూషన్‌ ఫీజులపై 30 శాతం కోత విధించామన్నారు.  వాదనలు విన్న న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఉత్తర్వుల దృష్ట్యా జీవో అమలును నిలుపుదల చేస్తున్నామన్నారు. 

Flash...   వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం..