విద్యాసంస్థల్లో కొవిడ్ నిబంధనలకు తూట్లు
మాస్క్‌లు ధారణ, భౌతిక దూరం ఎక్కడ?
ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్ విద్యార్థులు పదుల సంఖలో ఐసోలేషన్‌లో..
కొవిడ్ హాట్‌స్పాట్‌గా గురుకులాలు, మోడల్ స్కూల్స్
గుంటూరులో కొవిడ్‌తో ఇప్పటికే ఇద్దరు టీచర్ల మృతి.
గుంటూరు(విద్య), ఏప్రిల్ 15: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కొవిడ్ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రధానంగా మాస్క్‌ల ధారణ, భౌతికదూరం, చేతుల శానిటైజేషన్ అసలు కనిపించడం లేదు. ఫలితంగా విద్యార్థుల ద్వారా ఇంట్లో పెద్దకు కరోనా వ్యాపిస్తోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ కేసులు 500పైన నమోదు అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. గురుకులాలు, మోడల్ స్కూల్స్, ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్స్ కొవిడ్ హాట్‌స్పాట్స్‌గా మారుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు కొవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన పాఠశాలల్లో ఇప్పటికే ఇద్దరు ఉపాధ్యాయులు కొవిడ్‌తో మృతి చెందారు. ఆయా పాఠశాలల్లో దాదాపు 9 మంది ఉపాధ్యాయులకు పాజిటివ్ రిపోర్టులు రావడం కలకలం సృష్టిస్తోంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపండం లేదు. ఇక ప్రైవేటు పాఠశాలల విషయానికి వస్తే విద్యార్థుల్ని ఆటోల్లో కుక్కి మరీ తీసుకెళ్తున్నారు. అనేక పాఠశాలల్లో శానిటైజర్ కూడా అందుబాటులో ఉండటం లేదు. అనేక స్కూల్స్‌లో బెంచీకి ముగ్గురు నలుగురిని కూర్చోబెడుతున్నారు. కొత్తపేట ప్రాంతంలోని రెండు ప్రైవేటు పాఠశాలల్లో రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఉపాధ్యాయులు కరోనాతో మరణించారు. దీంతో ఆయా పాఠశాలల్ని మూసిశారు. పాఠశాలల్లో కొవిడ్ ప్రబలిన విషయం బయటకు చెప్పవద్దని ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో ప్రధానోపాధ్యాయులు మౌనంగా ఉంటున్నారు. బుధ, గురువారాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో విద్యార్ధులు, ఉపాధ్యాయుల హాజరుశాతం 25 శాతానికి పడిపోయింది. చుట్టుపక్కల కరోనా కేసులు వెలుగు చూడటంతో ఎవరికి వారే విద్యార్ధులను స్కూళ్లకు సెలవులు పెట్టించేశారు. ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వం అదుపు తప్పిపోయినట్లే..!
మోడల్ స్కూల్‌లో ఐదుగురు విద్యార్థినులకు కరోనా
ఈపూరు ఏపీ మోడల్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులకు కరోనా సోకినట్లు ఉపాధ్యాయులు గురువారం తెలిపారు. పాఠశాలలో టీచర్‌కు కరోనా రావడంతో ఆమె పాఠాలు బోధించే తరగతిలోని 53 మంది విద్యార్థులకు వైద్యపరిక్షలు చేశారు. వారిలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఓ విద్యార్థిని కుటుంబంలో తల్లిదండ్రులకు కూడా కరోనా పాజిటివ్ అని తెలిసింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులను ఇంటికి పంపి యధావిధిగా స్కూలు నడిపారు. తాడికొండ మండలంలోని పొన్నెకల్లు జిల్లా పరిషత్ పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో గురువారం పాఠశాల విద్యార్ధులను ఇళ్ల పంపించి వేశారు. విద్యార్ధులకు శనివారం కరోనా టెస్టులు చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. గత నెలలో రావెల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునికి పాజిటివ్ రావటంతో విద్యార్థులందరికీ టెస్టులు చేశారు