మ‌రింత తీవ్రంగా కోవిడ్..! సెకండ్‌ వేవ్ ఎప్ప‌టి వ‌ర‌కు..?

క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ అంద‌రినీ టెన్ష‌న్ పెడుతోంది.. 2019లో పుట్టిన ఈ వైర‌స్.. 2020లో ప్ర‌భుత్వాలు, ప‌రిశ్ర‌మ‌లు, ప్ర‌జ‌లు.. ఇలా ఏ రంగాన్ని వ‌ద‌ల‌కుండా ట్వంటీ 20 మ్యాచ్ ఆడేసింది.. ఇప్ప‌టికీ కోలుకోని ప‌రిస్థితి..ఇప్పుడు మ‌ళ్లీ సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తోంది.. ఫ‌స్ట్ వేవ్ కంటే మ‌రింత సూప‌ర్ ఫాస్ట్‌గా.. డేంజ‌ర్‌గా వ్యాప్తి చెందుతోంది.. రోజుకు 2.5 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు.. 1500కు పైగా రోజువారీ మ‌ర‌ణాల‌తో వ‌ణుకుపుట్టిస్తోంది.. ఇక‌, యువ‌త‌నే ఎక్కువ టార్గెట్ చేయ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం.. క్ర‌మంగా పెరిగిపోతున్న కోవిడ్ పాజిటివిటీ రేటు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.. అయితే, ఎప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ప‌రిస్థితులు ఉంటాయి..? కోవిడ్ సెకండ్ వేవ్ త‌న విశ్వ‌రూపం చూప‌నుందా..? ఎప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌రిస్థితి ఉంటుంద‌నే దానిపై ప‌లు అంచ‌నాలున్నాయి. 

కొన్ని అంచ‌నాలు ప‌రిశీలిస్తే.. ఎంతటి భ‌యంక‌ర‌మైన మహమ్మారి అయినా ఏదో ఒక దశలో పతాకస్థాయికి చేరి క్రమంగా తీవ్రత తగ్గిపోతుంది. మొదటివేవ్‌లో భార‌త్‌లో తొలి కేసు జనవరిలో నమోదు కాగా.. సెప్టెంబరు 26న పతాకస్థాయికి చేరింది. ఆ తర్వాత క్రమంగా కేసులు త‌గ్గిపోతూ వ‌చ్చి ఫిబ్రవరి రెండోవారంలో రోజువారీ కేసుల సంఖ్య 9 వేల లోపునకు ప‌డిపోయాయి.. అయితే, మార్చి మొదటివారం నుంచి మొదలైన సెకండ్‌వేవ్‌ ఇప్పుడు బీభత్సమే సృష్టిస్తోంది. కేసులు ఇలా ఎన్నాళ్లపాటు పెరుగుతూ పోతాయి? అవి తగ్గుముఖం పట్టేదెప్పుడు? ప్రజల్లో ఎక్కువ మందికి యాంటీబాడీస్‌ వచ్చేదెప్పుడు? అంటే.. పలు సంస్థలకు చెందిన శాస్త్రజ్ఞులు వేర్వేరు అంచనాలు వేస్తున్నారు. మొత్తంగా అన్ని అంచ‌నాల‌ను ప‌రిశీలిస్తే.. సెకండ్ వేవ్ కేసులు మే నెలాఖరుకు లేదా జూన్‌ 10నాటికి తగ్గుముఖం ప‌ట్ట‌నున్నాయి.. కానీ, రానున్న 10 రోజులూ దేశంలో కరోనా విలయ తాండవం చేసే ప్ర‌మాదం ఉంది.. అత్యంత కీలకమైన ఈ 10 రోజులూ అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. 

అంచ‌నాల‌ను గ‌మ‌నిస్తే.. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ క్రెడిట్‌ సూయిస్‌ అధ్యయనంలో ప్ర‌కారం.. ఈ నెల  చివరినాటికి దేశ ప్రజల్లో 40 శాతం మందిలో కరోనా యాంటీబాడీస్‌ ఉత్పత్తి అవుతాయి. ఆ 40 శాతం మందిలో 28 శాతం మందికి కరోనా ఇన్ఫెక్షన్ల వల్ల, మరో 12 శాతం మందికి టీకాల వల్ల యాంటీబాడీస్‌ ఉత్పత్తి అవుతాయని పేర్కొంది. ఫలితంగా కోవిడ్ కేసులు, మరణాలు భారీగా త‌గ్గిపోతాయ‌ని తెలిపింది. ఇక‌, కేసులు పెరుగుతుండడంతో కొద్దిరోజులుగా ప్రజలు బయటకు రావడం తగ్గించినట్టు గూగుల్‌ సంస్థ రూపొందించిన ‘కొవిడ్‌-19 కమ్యూనిటీ మొబిలిటీ రిపోర్ట్స్‌’ ద్వారా బ‌య‌ట‌ప‌డిన‌ట్టు క్రెడిట్‌ సూయిస్‌ తన నివేదికలో పేర్కొంది. మ‌రోవైపు.. భార‌త్‌లో కరోనా కేసుల తీరుతెన్నులపై గత ఏడాది అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల బృందం.. ఏప్రిల్‌ 20 నాటికి పతాకస్థాయికి చేరుతాయని చెబుతోంది.. మే నెలాఖరు నాటికి వైరస్‌ తీవ్రత తగ్గుతుందని అంచ‌నా వేసింది. ఇంకోవైపు ‘సూత్ర’ అనే గణిత విధానం ప్ర‌కారం.. ఏప్రిల్‌ 19 నుంచి మే 17 వరకూ కేసులు పెరుగుతూ వస్తాయని, మే రెండో వారం లో పతాకస్థాయికి చేరుకుంటాయని హెచ్చ‌రిస్తోంది. ఏ అంచ‌నాలు తీసుకున్నా.. ప‌రిశోధ‌న‌లు తీసుకున్నా.. మ‌హ‌మ్మారిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌నే వారిని కాపాడుతోంద‌ని.. కొన్నాళ్లపాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అలసత్వం, నిర్లక్ష్యం పనికిరాద‌ని హెచ్చ‌రిస్తున్నాయి.

Flash...   రెండు గంటల్లో బాగు చేస్తా.. ఇదివరకు 300 మందిని నయం చేశా..