‘విద్యా కానుక’లో ఇష్టారాజ్యం!


చాలీచాలని బూట్లు.. చినిగిన బ్యాగ్‌లు..

నెల్లూరు జిల్లాలో చాలామంది పిల్లలకు  రెండూ ఎడమ కాలి బూట్లు అందజేత 

నెలలు గడుస్తున్నా ప్రత్యామ్నాయం లేదు 

యూనిఫాం క్లాత్‌ సరఫరాలోనూ చేతివాటం 

ఒక్కొక్కరికి 3 జతలు అని చెప్పిన ప్రభుత్వం 

అధిక శాతం మందికి వచ్చింది రెండు జతలే 

అదీ నాసిరకం వస్త్రం ఇచ్చారని విమర్శలు 

జత కుట్టు కూలిగా కేవలం రూ.40 మాత్రమే 

వస్తువుల వాడకానికి దూరంగా విద్యార్థులు

జిల్లాకేంద్రాలు, స్కూళ్లలో గుట్టలుగా నిల్వలు. 

(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

‘జగనన్న విద్యా కానుక’ కిట్ల సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన కిట్లు కొన్ని జిల్లాల్లో 75శాతం వరకు సరఫరా కాగా పలు జిల్లాల్లో చాలామంది విద్యార్థులకు చాలీచాలని బూట్లు, చినిగిపోయిన, జిప్పులు లేని బ్యాగ్‌లే అందాయి. నెల్లూరు జిల్లాలో అధికశాతం పిల్లలకు ఎడమ కాలి షూ జత పంపించారు. వినియోగానికి పనికిరాని వాటిని వెనక్కి తీసుకుని ప్రత్యామ్నాయ వస్తువులు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోలేదు.

నెలలు గడుస్తున్నా వాటిని మార్చి కొత్తవి ఇచ్చే అంశాన్ని సమగ్ర శిక్ష గత ఎస్‌పీడీ చినవీరభద్రుడు, ఏఎ్‌సపీడీ మధుసూదన్‌రెడ్డి తేలిగ్గా తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలలు, సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయాల్లో(అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌) పెద్ద సంఖ్యలో వస్తువులు గుట్టలుగా పడి ఉన్నాయి. మరికొన్ని పిల్లల దగ్గరే ఉన్నాయి. సరిపోని బూట్లు, చినిగిన బ్యాగ్‌లను వారు వినియోగించడం లేదు. అవి లేకుండానే పాఠశాలలకు హాజరవుతున్నారు. అసమగ్రంగా, నిరుపయోగంగా ఉన్న ఆ వస్తువులను చాలాచోట్ల ప్రధానోపాధ్యాయుల నుంచి వెనక్కి తీసుకోనే లేదు. వేలాది పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు ఇప్పటికీ సరఫరా చేయలేదని సమాచారం. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పాఠశాలలకు చెందిన 43 లక్షల మంది పిల్లలకు 3జతల యూనిఫాం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ సింహభాగం విద్యార్థులకు 2జతలకు సరిపడా వస్త్రాన్ని అందించారు. కొంచం బొద్దుగా ఉన్న పిల్లలకు అది ఒక జతకే సరిపోతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 3 జతల యూనిఫాం ఎందుకు ఇవ్వలేదో ఇప్పటికీ వివరణ ఇవ్వలేదు. సరఫరా చేసిన వస్త్రం కూడా నాసిరకంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. జత  కుట్టుకూలి కింద రూ.40 మాత్రమే ఇచ్చారు.  

Flash...   Jagananna Vidya Varosthavaalu Guidelines and Schedule

బూట్ల తరలింపునకు ఎత్తుగడ 

విద్యా కానుక వస్తువులు విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా ఏ జిల్లాలోనూ సరఫరా చేయలేదు. సరుకు తగ్గిన విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. కర్నూలు, విశాఖ, కడప జిల్లాల నుంచి 4ట్రక్కుల్లో బూట్లను విజయవాడకు సమీపంలోని గొల్లపూడి వద్ద ఓ పాఠశాలలో నిల్వ చేసేందుకు పథకం వేశారు. అయితే గుంటూరు సరిహద్దులో పోలీసులు వాటిని ఆపి బిల్లులు చూపించమనడంతో గుట్టు రట్టయినట్లు సమాచారం. ట్రక్కుల డ్రైవర్లు పారిపోయినట్లు ఆలస్యంగా వెలుగు చూసింది. గత ఎస్‌పీడీ, ఏఎ్‌సపీడీకి సన్నిహితంగా ఉండే ఈ మూడు జిల్లాల సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్ల ద్వారానే ఈ సరుకును గొల్లపూడికి తరలించే ప్రయత్నాలు చేశారని సమాచారం.

ఏ జిల్లాలో అయినా సరుకు తగ్గితే తామే నిల్వ చేశామని ప్రస్తుత ఎస్‌పీడీ, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి చూపడానికే ఈ పథకం వేసినట్లు తెలిసింది. 2020-21 విద్యా సంవత్సరపు విద్యా కానుక కిట్ల సరఫరాలో అవినీతి, అక్రమాలపై ఏఎ్‌సపీడీ మధుసూదన్‌రెడ్డికి మెమో/షోకాజ్‌ నోటీసులు ఇచ్చి బాధ్యతల నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మరో అధికారికి ఫేజ్‌-2 విద్యా కానుక బాధ్యతలు అప్పగించారు.

‘తూర్పు’లో కొందరికే విద్యా కానుక 

తూర్పుగోదావరి జిల్లాలో జగనన్న విద్యా కానుక పథకం అమలు గందరగోళంగా మారింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10వ తరగతుల విద్యార్థులు 4,19,445 మందికి జేవీకే కిట్‌లు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 3,23,287 మందికి మాత్రమే అందాయి. ఇందులో 2లక్షల మందికి తప్ప మిగిలిన వారికి బూట్లు, దుస్తులు, టై కొలతల్లో తేడాలొచ్చాయి. బ్యాగ్‌లు కూడా నాసిరకమైనవి సరఫరా చేశారు. తేడా వచ్చిన కిట్‌లను కాకినాడ పీఆర్‌ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో దాచి ఉంచారు. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ శనివారం కథనం ప్రచురించడంతో విద్యార్థులకు హుటాహుటిన కేవలం బూట్లు మాత్రమే పంపిణీ చేశారు. 

నాసిరకం బ్యాగులు పంపిణీ 

గుంటూరు జిల్లాలో పంపిణీ చేసిన జగనన్న విద్యాకానుక కిట్లలో బ్యాగులు నాసిరకంగా ఉన్నాయి. చాలావరకూ బ్యాగులకు జిప్‌లు ఊడిపోయాయి. బూట్లు, దుస్తులు, బ్యాగులు ఎంతమందికి ఇచ్చారనే వివరాలు కూడా అధికారుల వద్ద లేవు. 

Flash...   Transfer of strength from other schools in child info - to escape transfers – Certain Instructions

‘పశ్చిమ’లో బూట్లన్నీ గోడౌన్ల పాలు 

పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 2.64లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. సైజు తేడాలతో పాటు కొన్ని డ్యామేజ్‌ అవడంతో దాదాపు 24వేల జతల బూట్లు అధికారులకు వెనక్కు ఇచ్చారు. ఇది జరిగి ఏడాది గడిచినా ఇప్పటిదాకా కేవలం 11 వేల జతలను మాత్రమే కాస్తో కూస్తో మార్పు చేశారు. వీటిని స్కూళ్లకు తరలించాలంటే రవాణా చార్జీలు అవుతాయన్న ఉద్దేశంతో తాడేపల్లిగూడెంలో మూలనపడేశారు. దాదాపుగా జిల్లా అంతటా విద్యార్థులంతా 2జతల యూనిఫాంతోనే సరిపెట్టుకుంటున్నారు.