18 ఏళ్లు దాటిన వారందరికీ మే 1 నుంచి వ్యాక్సిన్‌.. కేంద్రం కీలక నిర్ణయం

 


కంపెనీలు 50శాతం టీకాలను కేంద్రానికి ఇవ్వాలి

మిగిలినవి బహిరంగ విపణిలో అమ్ముకోవచ్చు

అదనపు టీకాలను రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా 

కంపెనీల నుంచి కొనుక్కోవచ్చు

ఆస్పత్రులు, ఇతర కంపెనీలు కూడా..

మార్కెట్లో సరఫరాకు ముందే ధర ప్రకటించాలి

కేసుల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలకు టీకాలు

వృథానూ పరిగణనలోకి తీసుకోనున్న కేంద్రం

మూడో విడతలో ఉచిత టీకా ఉండదు!

మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో నిర్ణయం

వైద్యులు, ఫార్మా కంపెనీలతో ప్రధాని సమీక్ష

ప్రజలంతా టీకా వేసుకోండి మన ముందున్న ఆయుధం అదే: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19: పిల్లల నుంచి పెద్దల వరకూ దేశవ్యాప్తంగా అన్ని వయసుల వారికీ కరోనా సోకుతోంది. ఒకటి తర్వాత ఒకటిగా దశలవారీగా విస్తరిస్తోంది. రోజురోజుకూ పరిస్థితి తీవ్రంగా మారుతోంది. టీకా కార్యక్రమాన్ని విస్తృతం చేస్తే తప్ప కరోనాను కట్టడి చేయడం సాధ్యం కాదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మలి దశలో అంటే, మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు వేయాలని నిర్ణయించింది. రాష్ట్రాలూ టీకాలను కొనుక్కునేలా, బహిరంగ మార్కెట్లో వాటిని విక్రయించేలా నిబంధనలను సరళీకరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాదు.. ఆస్పత్రులు, కంపెనీలు ఉత్పత్తిదారుల నుంచే నేరుగా టీకాలు కొనుక్కునే వెసులుబాటు కల్పించింది. కాకపోతే, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లతోపాటు 45 ఏళ్లు దాటి ఇతరేతర వ్యాధులున్న వారికి కేంద్ర ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఇకపై కూడా వీరికి ఉచితంగానే వేస్తారు. కానీ, మూడో దశలో మిగిలిన వారంతా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుందని సంకేతాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్రఖ్యాత వైద్య నిపుణులు, ఫార్మా కంపెనీల ప్రతినిధులతో ప్రధాని మోదీ సోమవారం రెండు విడతల్లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. దేశంలో కొవిడ్‌-19 పరిస్థితిపై విస్తృతంగా చర్చలు జరిపారు. ‘‘గత ఏడాది ఇదే సమయానికి, వైద్యుల అవిరళ కృషి; ప్రభుత్వ వ్యూహం కారణంగా కరోనా వైరస్‌ మొదటి దశను మనం సమర్థంగా నిలువరించగలిగాం. 

Flash...   VARADHI WORKSHEETS: LEVEL 1 ( CLASS 1 & 2)

కానీ, ఇప్పుడు దేశం రెండో దశను ఎదుర్కొంటోంది. డాక్టర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లంతా పూర్తి శక్తిసామర్థ్యాలతో మహమ్మారిని ఎదుర్కొంటున్నారు. లక్షలాది ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు’’ అని డాక్టర్లతో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. టైర్‌ 2, 3 నగరాలకు కొవిడ్‌ విస్తరించడంపై ఈ సమావేశంలో దృష్టి సారించారు. ఆయా నగరాల్లోని వైద్యులతో సంప్రదింపులు జరుపుతూ, వారికి ఆన్‌లైన్లోనే సలహాలివ్వాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తక్కువ సమయంలో అందరికీ వ్యాక్సిన్‌ అందేలా చూస్తామని ప్రధాని అన్నారు. కరోనా కట్టడికి మన ముందున్న అతిపెద్ద ఆయుధం టీకా మాత్రమేనని చెప్పారు. ఈ సమావేశంలోనే పెద్దలందరికీ టీకా వేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. మరింత వేగంగా పెద్దలందరికీ వ్యాక్సిన్లు వేస్తామని అనంతరం కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. మూడో విడత మార్గదర్శకాలనూ విడుదల చేసింది. కరోనాను కట్టడి చేయాలంటే 25 ఏళ్లు దాటినవారందరికీ టీకాలు వేయాలని తెలంగాణ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. శనివారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కూడా ఇదే డిమాండ్‌ చేసింది. రెండు మూడు రోజులుగా ప్రధాని కూడా కొవిడ్‌ పరిస్థితిపై సమీక్షలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం వెలువడింది. 

ఉత్పత్తి పెంచండి.. ధరలు తగ్గించండి

రోగులకు అత్యవసరమైన వివిధ రకాల మందుల ఉత్పత్తి పెంచాలని, రెమ్‌డెసివిర్‌ వంటి మందుల ధరలను తగ్గించాలని ఫార్మా కంపెనీలను ప్రధాని మోదీ కోరారు. టీకా కొరతపై ఫార్మా కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. ప్రపంచ ఫార్మా కేంద్రంగా భారత్‌ను మార్చారంటూ వారిని అభినందించారు. మందులు, నియంత్రణ ప్రక్రియకు సంబంధించి కేంద్రం సంస్కరణలు తీసుకురానుందని చెప్పారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మందులు, అత్యవసర వైద్య పరికరాల సరఫరా సాగడానికి సప్లయి చైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కొవిడ్‌తోపాటు భవిష్యత్తులో రాబోయే ఇలాంటి ముప్పులపై మరిన్ని పరిశోధనలు చేయాలని సూచించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత ఫార్మా పరిశ్రమ ఎగుమతుల్లో గత ఏడాది 18 శాతం వృద్ధి సాధించిందని, క్లిష్ట సమయంలోనూ 150 దేశాలకు మందులను సరఫరా చేసిందని కొనియాడారు. 

Flash...   కరోనా పెరుగుతున్న కారణం గా సంక్రాంతి సెలవులు పొడిగించాలి అనుకుంటున్నారా ?

మూడో దశకు మార్గదర్శకాలు ఇవీ..!

టీకా తయారీదారులు ఒక నెలలో ఉత్పిత్తి చేసే వ్యాక్సిన్లలో 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తే సరిపోతుంది. మిగిలిన 50 శాతం డోసులను అవి రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చు. అదనంగా కావాల్సిన టీకాలను ఇకనుంచి రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా కంపెనీల నుంచి కొనుక్కోవచ్చు. తన వాటా నుంచి కరోనా కేసుల సంఖ్యను బట్టి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్లను కేంద్రం పంపిస్తుంది. అయితే, రాష్ట్రాలకు కోటాను నిర్ణయించడంలో టీకా వృథాను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. వృథా ఎక్కువగా ఉంటే అది కోటాపై ప్రభావం చూపుతుంది.  బహిరంగ మార్కెట్లోకి టీకాలను సరఫరా చేయడానికి ముందే తయారీదారులు ధరను ప్రకటించాలి. ధరను బట్టి.. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులు, ఇతర కంపెనీలు తయారీదారుల నుంచి టీకాలను కొనుక్కుంటాయి. కేంద్ర ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ఇప్పటివరకూ ఉచితంగా టీకాలు వేస్తున్నారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 45 ఏళ్లు దాటి కోమార్బిడిటీస్‌ ఉన్నవారికి ఇక ముందు కూడా ఈ కేంద్రాల్లో ఉచిత టీకా కార్యక్రమం కొనసాగుతుంది.

కరోనా చికిత్సకు మరో మాత్ర ?!

ఇన్‌ఫ్లూయెంజా చికిత్సకు వినియోగించే యాంటీవైరల్‌ ఔషధం ‘మోల్ను పిరవిర్‌’ (ఎంకే-4482) కరోనా ఇన్ఫెక్షన్‌ను కూడా కట్టడి చేయగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌(ఎన్‌ఐహెచ్‌), బ్రిటన్‌లోని ప్లైమౌత్‌ వర్సిటీ పరిశోధకుల బృందం ఈ ఔషధంతో ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. కరోనా సోకని, సోకిన ఎలుకలను రెం డు గ్రూపులుగా విభజించి, 12 గంటలకోసారి 3 రోజుల పాటు మోల్ను పిరవిర్‌ మాత్రలను ద్రవరూపంలో అందించారు. మూడో గ్రూపులోని ఎలుకలకు ఎలాంటి చికిత్సా అందించలేదు. చికిత్స అందించని ఎలుకల కంటే మోల్నుపిరవిర్‌ను ఇచ్చిన ఎలుకల ఊపిరితిత్తుల్లో తక్కువ వైరల్‌ లోడ్‌ ఉంది. కాగా, మోల్ను పిరవిర్‌తో మనుషులపై జరుగుతున్న ట్రయల్స్‌ ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి